గ్రేటర్‌లో కరోనా టెన్షన్‌

20 May, 2020 10:14 IST|Sakshi
వెంకటేశ్వర్‌నగర్‌ వద్ద ఏర్పాటు చేసిన కంటైన్మెంట్‌ జోన్‌

తాజాగా నగరంలో 34 పాజిటివ్‌ కేసులు

కొత్తగా హస్తినాపురం, లంగర్‌హౌస్‌ ప్రాంతాల్లో కేసులు

మాదన్నపేటలో ఒకే రోజు ఇద్దరి మృతి

సాక్షి,సిటీబ్యూరో: నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న  కరోనా వైరస్‌ సిటీజనులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. గత కొంతకాలంగా తగ్గినట్లే కనిపించిన వైరస్‌ ఇటీవల మరింత ఉగ్రరూపం దాల్చుతుండటంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మంగళవారం 34 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. మాదన్నపేటలో కరోనా వైరస్‌ బారిన పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.  మలక్‌పేటలో మరో తొమ్మిది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కింగ్‌కోఠి  క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న 32 మందికి వ్యాధిæ నిరరణ పరీక్షలు చేయగా 11 మందికి పాజిటివ్‌ వచ్చింది. నెగిటివ్‌ వచ్చిన 21 మందిని డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డులోలో 52 మంది ఉన్నారు. వీరి రిపోర్టులు ఇంకా రావల్సి ఉంది. ఫీవర్‌ ఆçసుపత్రిలో తాజాగా మరో 4 అనుమానిత కేసులు అడ్మిట్‌ అయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ 7 సస్‌పెక్టెడ్‌ కేసులు ఉన్నాయి. వీరి రిపోర్ట్స్‌ ఇంకా రావాల్సి ఉంది.  

ఫీవర్‌లో నాలుగు అనుమానిత కేసులు
నల్లకుంట: నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రిలో మంగళవారం నాలుగు కోవిడ్‌–19 అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీరిని ఐసోలేషన్‌ వార్డులో చేర్చుకుని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వీరి నుంచి నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. 

హస్తినాపురం డివిజన్‌లో తొలి పాజిటివ్‌ కేసు
హస్తినాపురం: హస్తినాపురం డివిజన్‌  పరిధిలోని దాతూనగర్‌లో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయ్యింది. దాతూనగర్‌కు చెందిన వ్యక్తి సైదాబాద్‌లోని తన సమీప బంధువుల ఇంటికి వెళ్లగా అక్కడ అతడికి కరోనా వైరస్‌ సోకినట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీ అధికారులు దాతూనగర్‌ను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.  

ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో తొమ్మిది కేసులు
చాదర్‌ఘాట్‌: ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌ వాహెద్‌ నగర్, శంకర్‌ నగర్, సరోజిని నగర్, హౌసింగ్‌బోర్డ్‌ కాలనీల్లోని ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిదిమందికి మంగళవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వారిలో ఒకరు (58) కూరగాయల వ్యాపారం చేస్తుంటాడని అతడి ద్వారా కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. వీరి బంధువుల ఇళ్లను కంటైన్మెంట్‌గా ప్రకటించిన అధికారులు బారికేడ్స్‌ ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు.

లంగర్‌హౌస్‌లో  మహిళకు కరోనా  పాజిటివ్‌
లంగర్‌హౌస్‌: లంగర్‌హౌస్‌ ప్రశాంత్‌నగర్‌కు చెందిన మహిళకు(23)కు మంగళవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సదరు మహిళ లక్డికాపూల్‌లోని బీపీఓ కాల్‌సెంటర్‌లో పనిచేస్తోంది. మంగళవారం తీవ్ర జ్వరం, దగ్గుతో ఆబిడ్స్‌లోని ఆస్పత్రికి వెళ్లగా, కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆరుగురిని మల్లేపల్లిలోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.

ఛాతీ, ఆయుర్వేద ఆసుపత్రుల్లో తగ్గిన కరోనా కేసులు
వెంగళరావునగర్‌: ఛాతీ, ఆయుర్వేద ఆసుపత్రుల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మూడు రోజుల క్రితం ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో రెండు పాజిటివ్‌ కేసులు ఉండగా, ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో 13 పాజిటివ్‌ రావడంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఛాతీ ఆసుపత్రిలో ఒక్క కేసు నమోదు కాగా, ఆయుర్వేద ఆస్పత్రిలో పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. తాజాగా మంగళవారం ఛాతీ, ఆయుర్వేద ఆసుపత్రుల్లో 8 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా రాలేదు. దాదాపు రెండు నెలల తర్వాత ఈ ఆసుపత్రుల్లో జీరో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.  

కరోనాతో ఇద్దరు మృతి
 చంచల్‌గూడ: కరోనా బారినపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మాదన్నపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న వృద్ధుడు(75), మరో మహిళ (50)మహిళకు ఇటీవల కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందారు.   

కోలుకుంటున్న జియాగూడ
జియాగూడ: జియాగూడలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో బస్తీవాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత 20 రోజులుగా నిరవధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. పది మందికి పైగా మృత్యువాత పడ్డారు. 120 మందికి పైగా క్వారంటైన్‌లో ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు జియాగూడలో   పది బస్తీలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటు వైద్యసిబ్బంది ఇంటింటికి తిరిగి పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయడంతో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. 

పది కంటైన్మెంట్‌ జోన్లు....
జియాగూడలోని కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన   వెంకటేశ్వర్‌నగర్, దుర్గానగర్, సాయిదుర్గానగర్, సంజయ్‌నగర్, ఇందిరానగర్, కురుమ బస్తీ, సబ్జిమండి, మేకలమండి, లక్ష్మీనరసింహనగర్, ఇక్బాల్‌గంజ్‌ తదితర బస్తీలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. స్థానికులను బయటికి రాకుండా కట్టడి చేయడంతో పాటు మేకలమండి, సబ్జిమండి, పురానాపూల్‌ తదితర ప్రాంతాల్లోని మార్కెట్లు, దుకాణాలను పూర్తిగా మూసివేశారు. దీంతో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. మంగళవారం ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు