విదేశాల నుంచి వచ్చినవారు 69వేలు

21 Mar, 2020 01:29 IST|Sakshi

విదేశాల నుంచి వచ్చి బయట తిరుగుతున్న వైనం

ఇంట్లోనే ఉండాలని సూచించినా పట్టించుకోని ప్రయాణికులు

ఇటలీ, జర్మనీ నుంచి మార్చి 3– 14 మధ్య వచ్చిన వారు 540 మంది

విమానాశ్రయంలో నామమాత్రపు తనిఖీలు చేసి పంపిన వైద్య బృందాలు

15 రోజుల పాటు ప్రజలను ఇళ్లకే పరిమితం చేయాలంటున్న వైద్యులు

సాక్షి, హైదరాబాద్‌ : విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రయాణికులు ‘ఐసోలేషన్‌’ ప్రక్రియను విస్మరించి ప్రజల్లో కలసిపోవడంతో ఎప్పుడు ఏ మూల నుంచి ఏ ఉపద్రవం వచ్చి పడుతుందేమోనన్న ఆందోళన అధికార యంత్రాంగంలో ఉంది. కోవిడ్‌-19 ఉధృతమై వందలాదిగా కేసులు నమోదైన యూరప్‌లోని ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌ వంటి దేశాల నుంచి గడిచిన 10 రోజుల్లోనే 540 మంది హైదరాబాద్‌ వచ్చారు. వీరిలో అతి కొద్ది మంది మాత్రమే ఐసోలేషన్‌ సెంటర్‌కు వెళ్లినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు మొత్తం 69 వేల మంది ప్రయాణికులు వివిధ దేశాల నుంచి నేరుగా హైదరాబాద్‌ చేరుకున్నారు. వారిలో అమెరికా, యూరప్‌ దేశాల నుంచి వచ్చిన వారే 40 వేల మంది ఉన్నారు. మలేసియా, సింగపూర్, దుబాయ్‌తో పాటు ఇతర గల్ఫ్‌ దేశాల నుంచి 20 వేల మందికి పైగా ఉన్నారు. మార్చి 10 నుంచి అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికులను పరీక్షించడం మొదలైన తర్వాత కూడా ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌ నుంచి వచ్చిన 540 మంది ప్రజల్లో కలసిపోయారు. వీరంతా మార్చి 3–14 తేదీల మధ్య వచ్చిన వారేనని, ఆ 4 దేశాల్లో కోవిడ్‌ ఉధృతంగా ఉన్న విషయాన్ని విస్మరించి వైద్య బృందాలు తేలిగ్గా వదిలివేశాయని ఎయిర్‌పోర్టు వర్గాలే విస్తుపోతున్నాయి.
(కరోనా : బీఎస్‌ఎన్‌ఎల్‌, నెల రోజులు ఫ్రీ)

ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన వరుడికి పాజిటివ్‌?
ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన ఓ యువకుడి నిర్వాకమిది. కోవిడ్‌ వ్యాప్తి ఉధృతంగా ఉన్న దేశం నుంచి వచ్చానన్న స్పృహ లేకుండా పెళ్లికి సిద్ధమై పోయాడు. వారించినా వినలేదు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జరిగిన ఈ పెళ్లికి దాదాపు వెయ్యి మంది హాజరయ్యారు. ఇప్పుడు ఆ యువకుడు జ్వరం, దగ్గుతో బాధపడుతూ కోవిడ్‌ అనుమానంతో గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అతడికి కోవిడ్‌ ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ జరి గినా.. పుణే నుంచి వచ్చే నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. అతడి పెళ్లి ఎక్కడ జరిగింది? ఎంత మంది హాజరయ్యారన్న వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ పెళ్లికి వెయ్యి మందికిపైగా హాజరయ్యారని సమాచారం. లండన్‌ నుంచి ఈ నెల 13న హైదరాబాద్‌ వచ్చిన మరో యువకుడు కోవిడ్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. అతడికీ పాజిటివ్‌ వచ్చింది. ఈ రెండు ఉదంతాలు మచ్చుకు మాత్రమే. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎంతమందికి ఈ కోవిడ్‌ లక్షణాలు బయటపడతాయన్నది తేలడానికి ఇంకా వారం నుంచి 10 రోజులు పడుతుంది.

సీఎం పిలుపుపై స్పందిస్తారా?
విదేశాల నుంచి వచ్చి బయట తిరుగుతున్న వారు ముందుకు రావాలన్న సీఎం పిలుపుపై స్పందిస్తారా.. ఐసోలేషన్‌ కేంద్రాలకు వెళ్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అమెరికా నుంచి వచ్చీ రాగానే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సంగతి తెలుసుకున్న కలెక్టర్‌.. కోనప్పకు ఫోన్‌ చేసి ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు. కొద్దిమంది సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు షూటింగ్‌ల కోసం యూరప్‌ తదితర దేశాలకు వచ్చినా ఐసోలేషన్‌లో లేరని తెలిసింది. లక్షణాలు బయటపడేలోపే సమీప ఆరోగ్య కేంద్రాలు లేదా ఐసోలేషన్‌ కేంద్రాలకు వెళ్తే బాగుంటుందని అధికారులు సూచిస్తున్నారు.

లాక్‌డౌన్‌ తప్పనిసరి!
కోవిడ్‌ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్మరించిన ఇటలీ, ఇరాన్‌ దేశాల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే భారత్‌ తీవ్రమైన అనర్థాలు చవిచూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకుంటున్నా అవి కోవిడ్‌కు ఏ మాత్రం విరుగుడు కాదని పేర్కొంటున్నారు. వచ్చే 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ కాకపోతే ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయని ఆందోళన చెందుతున్నారు. వేలాదిగా కేసులు నమోదై వందల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నా ఈ వైరస్‌ నియంత్రణ విషయంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్త ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉన్న దేశాల నుంచి వేల సంఖ్యలో వచ్చిన ప్రయాణికులను ఐసోలేషన్‌కు తరలించని కారణంగా వచ్చే వారం, పది రోజుల్లో ఏం జరుగుతుందోనన్న ఆందోళనకు గురిచేస్తోందని సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ మాలిక్యులర్‌ బయోలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్త ఒకరు వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మంత్రులు, సీనియర్‌ అధికారులు సీఎం ఎదుట ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. (గ్రామాల్లో ‘144 సెక్షన్‌’!)

మరిన్ని వార్తలు