‘పాడు’ కరోనా.. ‘గానా’ బజానా 

26 Apr, 2020 07:26 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో : రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో సినీనటులు తమ పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే పనిలో నిమగ్నమయ్యారు. కొత్త కొత్త ట్యూన్స్‌తో పాటలు పాడి కరోనా మహమ్మారి నుంచి ఎలా రక్షణ పొందవచ్చో వివరిస్తున్నారు. నెలన్నర క్రితం మొదలైన ఈ గానా బజానా దేశవ్యాప్తంగా వీనుల విందు చేస్తుంటే.. ఇందులో తెలుగు పాటలు అందులోనూ నగరవాసులు పాడిన పాటలే పెద్ద సంఖ్యలో ఉండటం విశేషం.

యువ హీరో భరోసా..
యువ హీరో, సామాజిక సమస్యలపై తరచూ స్పందించే మంచు మనోజ్‌ మరోసారి తన బాధ్యతను నిర్వర్తించారు. ‘గుండె చెదిరిపోకురా గూడు వదలమాకురా ధైర్యం వీడ బోకురా అంతా బాగుంటాం రా’ అంటూ ఆందోళనలో ఉన్న ప్రజానీకానికి ఆయన భరోసాని అందించే ప్రయత్నం చేశారు. ఈ పాట కూడా మనసుల్ని స్పర్శిస్తూ మనోధైర్యాన్ని అందిస్తూ సాగుతుంది. తన చిన్నారి కోడలితో కలిసి మనోజ్‌ చేసిన ఈ పాటకి కూడా మంచి స్పందన లభించింది. మరో యువ నటుడు, బిగ్‌బాస్‌ ఫేమ్‌ ఆదర్శ్‌ కూడా ఈ ట్రెండ్‌లో తాను సైతం భాగమయ్యాడు. లాక్‌డౌన్‌ టైమ్‌లో వ్యాయామం ప్రాముఖ్యత హోమ్‌ టైమ్‌ని సద్వినియోగం చేసుకోమంటూ సాగే ఈ ర్యాప్‌ సాంగ్‌ని ఆయనే రాసి, కంపోజ్‌ చేసి పాడడం విశేషం. సినిమా రంగంలో అవసరార్థులకు సాయం అందించే నటుడు కాదంబరి కిరణ్‌ సారథ్యంలోని ఎన్‌జీఓ మనం సైతం ఆధ్వర్యంలోనూ ఓ ఆల్బమ్‌ రూపుదిద్దుకుంది. ‘మనం సైతం కరోనాపై అందరొక్కటై తిరగబడదామా?’ అంటూ సినీ–మీడియా రంగంలోని అనేక మందిని కలుపుకుంటూ సాగిన పాట ఆకట్టుకుంటుంది. 

చేతులెత్తి మొక్కుతా.. 
చేయి చేయి కలపకురా అంటూ చౌరాస్తా బ్యాండ్‌ సభ్యుడు, కుకట్‌పల్లి నివాసి రామ్‌ తనే రాసి స్వరపరిచిన పాట తెలుగువారిని ఉర్రూతలూగిస్తోంది. ఓ రకంగా కరోనాపై తెలుగు పాటల వెల్లువకు నాంది పలికింది ఈ పాటేనని చెప్పొచ్చు. ఈ పాట నగరవాసులకు బాగా చేరువైంది. మీడియా చానెళ్లలోనూ కని–వినిపించి మన్ననలు అందుకుంది. చేతులెత్తి మొక్కుతా సూపర్‌ హిట్‌ మరెందరో సెలబ్రిటీలకు లాక్‌డౌన్‌లో ఓ సత్కాలక్షేపానికి దారి చూపిందని చెప్పొచ్చు. ఇక ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ అయితే చెప్పనే అక్కర్లేదు. ప్రముఖ గాయని, తెలంగాణ పండుగ పాటలకు కేరాఫ్‌గా పేరొందిన గాయని మంగ్లీ సైతం కరోనాపై నోరు చేసుకుంది. పైసా పోతే పోనీగానీ పానముంటే సాలన్నా, బలుసాకైనా తిందాం గాని బ్రతికి ఉంటే చాలన్నా అంటూ మరో గాయకుడు కాసర్ల శ్యామ్‌తో కలిసి ఆమె రూపొందించిన ఆడియో–వీడియో ఆల్బమ్‌ కూడా  ఆకట్టుకునేలా సాగుతుంది. (కరోనా : హాయిగా.. స్వేచ్ఛగా విహరిస్తాం)

సెలబ్రిటీ.. సాంగ్స్‌.. 
సెన్సేషన్‌కి కేరాఫ్‌గా నిలిచే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కూడా ‘అది ఒక పురుగు.. కనిపించని పురుగు’ అంటూ తనదైన స్టైల్‌లో జనాల మీదకు పాటల పురుగును వదిలారు. అయితే ఈ చెవిలో జోరీగను జనం పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కరోనాపై జాగ్రత్తలు చెబుతూ లాక్‌డౌన్‌కు మద్దతు తెలుపుతూ.. సంగీత దర్శకుడు కోటి వీనులవిందు పాట అందించారు. దీనికి కనువిందు కూడా జోడించే పనిలో సాక్షాత్తూ మెగాస్టార్‌ చిరంజీవి, ఎవర్‌గ్రీన్‌ హీరో నాగార్జున వంటి వారు సైతం భాగస్వాములు కావడం ఆ పాటకి మరింత వన్నెలద్దింది. వుయ్‌ గొన్నా ఫైట్‌ విత్‌ కరోనా ఏదేమైనా.. లెట్స్‌ ఫైట్‌ దిస్‌ వైరస్‌ అంటూ సాగిన  మెగా మేల్కొలుపు అందర్నీ ఆకట్టుకుంది. అదేక్రమంలో సంగీత దర్శకుడు కీరవాణి కూడా తనవంతు బాధ్యతగా గొంతు సవరించుకున్నారు. ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే చేరింది.. మహమ్మారి రోగమొక్కటీ’ అంటూ ఆయన గతంలో తాను స్వరపరచిన స్టూడెంట్‌ నెం.1 చిత్రంలోని పాటకి పేరడీ కట్టారు. ఈ వ్యాధిని ఎదుర్కోవడం ఇలా అంటూ చక్కని సాహిత్యంతో ఆయన తెలుగువారికి  దిశానిర్ధేశం చేశారు.  

మరిన్ని వార్తలు