అటు చికిత్సలు.. ఇటు పరీక్షలు!

26 May, 2020 04:24 IST|Sakshi

ఇప్పటికే పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో మొదలైన కరోనా వైద్యం

ప్రైవేటు ల్యాబొరేటరీల్లో పరీక్షలకు అనుమతిపై సర్కారు కసరత్తు

ఇటీవలి హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే నిర్ణయం..

ఎలా ముందుకెళ్లాలన్న దానిపై రెండు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం

ఇటు 13 ప్రైవేటు ల్యాబొరేటరీలకు ఐసీఎంఆర్‌ ఇప్పటికే అనుమతి..  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటులో కరోనా వైద్యం, నిర్ధారణ పరీక్షలపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కరోనా వైద్య చికిత్సకు పచ్చజెండా ఊ పుతూ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు మార్గదర్శకాలివ్వగా, ప్రైవేటు ల్యాబొరేటరీల్లో నిర్ధారణ పరీక్షలకు అనుమతిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ తర్జనభర్జన పడుతోంది. దీనిపై రెండు రకాల ప్ర ణాళికలను తయారు చేసినట్టు వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన కీలక అధికారులు చెబుతున్నా రు. అనుమతిస్తే ఏం చేయాలి? లేకుంటే ఏంట న్న దానిపై ఈ రెండు ప్రణాళికలు సిద్ధంగా ఉ న్నాయి. కొందరు వైద్యాధికారులు మాత్రం హై కోర్టు తీర్పును గౌరవించి ప్రైవేటు, కార్పొరేట్‌ ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడమే మంచిదని అంటున్నారు. కొందరేమో అలా అ నుమతిస్తే దుర్వినియోగం జరుగుతుందేమోనని, అనవసరంగా పరీక్షలు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

అంతేగాక పాజిటివ్‌ వచ్చిన వారిని, వారి కాంటాక్టులను పట్టుకోవడంలో ప్రభుత్వ పట్టు పోతుందన్న భావన కూడా నెలకొంది. ఈ రెండు అంశాలపైనే ఇప్పుడు తర్జనభర్జన పడుతున్నారు. త్వరలో దీని పై ఒక నిర్ణయం తీసుకుంటామని ఒక కీలకాధికారి తెలిపారు. ఈ నేపథ్యంలోనే నిర్ణీత ప్రైవేటు ల్యాబొరేటరీలకు ఒకవేళ కరోనా టెస్టులకు అనుమతినిస్తే, కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. ఇతర సాధారణ వైద్య పరీక్షల విషయంలో పలువురు ప్రైవే టు ల్యాబ్‌లకు వెళ్లి తమకు అవసరమైన చెకప్‌ లు సొంతంగా చేయించుకుంటున్నారు. వాటిని డాక్టర్లకు చూపించి వైద్యం చేయించుకుంటున్నా రు. ఆయా పరీక్షల్లో నెగిటివ్‌ వస్తే కొందరు డాక్టర్లను కూడా సంప్రదించడం లేదు. కానీ కరోనా పరీక్షల విషయంలో జ్వరం, జలుబు, దగ్గు వం టి అనుమానాలతో ఎవరికి వారు సొంతంగా ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లి పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించొద్దని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది.

కరోనా అనుమానిత వ్యక్తులు నేరుగా ల్యాబొరేటరీకి కాకుండా, వారు తప్పక ఆసుపత్రుల్లో చేరాల్సిందేనని, అక్కడి డాక్టర్ల సూచన మేరకు మాత్రమే ప్రైవేటు ల్యాబ్‌లు పరీక్షలు చేయాలన్న షరతు విధించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఎవరికివారు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం, వారికి పాజిటివ్‌ లేదా నెగిటివ్‌ వచ్చినా తమకు ఆ సమాచారం తెలియకపోతే, వారిని వారి కాంటాక్టులను గుర్తించడంలో సమస్యలు వస్తాయన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ఇక చికిత్సలు ఇప్పటికే అనేక ప్రైవేటు, కార్పొరే ట్‌ ఆసుపత్రుల్లో మొదలయ్యాయని వైద్య, ఆరో గ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే వాటి ల్లో నిర్వహించే చికిత్సలకు ఫీజులను ఖరారు చే యాల్సి ఉందని, దీనిపైనా ఒక నిర్ణయం తీసుకో వాలని భావిస్తున్నట్లు ఒక అధికారి వ్యాఖ్యానిం చారు. సోమవారం జరిగిన సమావేశంలోనూ ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది.

రోజుకు 2,700 పరీక్షలు..
ప్రస్తుతం రాష్ట్రంలో 10 ప్రభుత్వ ఆధ్వర్యంలోని బోధనాసుపత్రులు, సంస్థల్లో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇకపై ప్రైవేటు ల్యాబొరేటరీ లు తోడైతే పరీక్షల సామర్థ్యం మరింత పెరగనుందని వైద్య, ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఐసీఎంఆర్‌ రాష్ట్రంలో 13 ప్రైవేటు ఆ సుపత్రులు, వాటికి సంబంధించిన ల్యాబ్‌లు, ఇతర డయాగ్నస్టిక్‌ సెంటర్లకు కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో పరీక్షలు చేస్తున్న నేపథ్యంలో ప్రైవేటుకు అనుమతి ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సామర్థ్యానికి మించి పరీక్షలు చేయాల్సి వచ్చినప్పుడే ప్రై వేటు రంగంలో నిర్ధారణ పరీక్షలు చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వ భావన. ఇంతలో హై కోర్టు తీర్పుతో ఐసీఎంఆర్‌ అనుమతిచ్చిన ప్రైవే టు ల్యాబొరేటరీల్లో పరీక్షలపై ఇంకా స్పష్టత రా వాల్సి ఉంది. ఒకవేళ వాటికీ ప్రభుత్వం అనుమతిస్తూ మార్గదర్శకాలు జారీచేస్తే, మొత్తం ప్రభు త్వ, ప్రైవేటుల్లో 23 చోట్ల కరోనా నిర్ధారణ పరీక్ష లు చేసే వీలు కలుగుతుంది. అన్నింటా కలిపి రోజుకు 2,300 నుంచి 2,700 వరకు కరోనా పరీక్షలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.

ఐసీఎంఆర్‌ అనుమతి పొందినవి ఏంటంటే..
రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గాంధీ మెడికల్‌ కాలేజీ, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, ఫీవర్‌ ఆసుపత్రి, నిమ్స్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం), ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ, సీసీఎంబీ, సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్, వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీలలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో సీబీ నాట్‌ పద్ధతిలో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. సీబీ నాట్‌ ద్వారా సాధారణంగా క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. కానీ దాన్ని ఇప్పుడు కరోనా నిర్ధారణ పరీక్షలకు ఉపయోగిస్తున్నారు. ఇక 13 ప్రైవేటు ల్యాబొరేటరీలు, ఆసుపత్రులకు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

అవి.. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలోని ల్యాబొరేటరీ సర్వీసెస్, హిమాయత్‌నగర్‌లోని విజయ డయాగ్నస్టిక్‌ సెంటర్, చర్లపల్లిలోని వింటా ల్యాబ్స్, సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని అపోలో హెల్త్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ లిమిటెడ్, పంజగుట్టలోని డాక్టర్‌ రెమిడీస్‌ ల్యాబ్స్, మేడ్చల్‌లోని పాథ్‌కేర్‌ ల్యాబ్స్, శేరిలింగంపల్లిలోని అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాథాలజీ అండ్‌ ల్యాబ్‌ సైన్సెస్, సికింద్రాబాద్‌ న్యూబోయిన్‌పల్లిలోని మెడిక్స్‌ పాథ్‌ల్యాబ్స్, సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ల్యాబ్‌ మెడిసిన్, మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరి ఎన్‌ఆర్‌ఐ కాలనీలోని బయోగ్నోసిస్‌ టెక్నాలజీస్, బంజారాహిల్స్‌లోని జర్నలిస్ట్‌ కాలనీలోని టినెట్‌ డయాగ్నస్టిక్స్, ఏఐజీ (ఏసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్టో ఎంటరాలజీ) లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి అవకాశముంది.

అలాగే ట్రూనాట్‌ పద్ధతిలో బంజారాహిల్స్‌ స్టార్‌ ఆసుపత్రిలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ల్యాబ్‌ మెడిసిన్‌లో పరీక్షలు చేయవచ్చు. ఆ మేరకు వాటికి ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చింది. వాటిల్లో కరోనా నిర్ధారణకు ఫీజు ఎంత ఉండాలన్న దానిపై గతంలోనే కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఒక్కో కరోనా పరీక్షకు రూ.4,500 వరకు వసూలు చేసుకోవచ్చని కేంద్రం గతంలో తెలిపింది. అనుమతిస్తే ఆ ప్రకారమే కరోనా నిర్ధారణ పరీక్ష ఫీజు వసూలు చేసే అవకాశముంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలోని ఆరోగ్యశ్రీ పరిధిలోని పేదలకు, ఈజేహెచ్‌ఎస్‌ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, జర్నలిస్టులకు, ఇతర మెడికల్‌ స్కీంలలో ఉండే వారికి ఉచితంగా చేస్తారా లేదా కూడా తెలియాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని వార్తలు