హైదరాబాద్‌లో కరోనా మరణం.. అంత్యక్రియలు పూర్తి

30 Mar, 2020 13:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనాతో మరణించిన తొలి వ్యక్తి అంత్యక్రియలు ముగిశాయి. కరోనా వైరస్‌తో మృతిచెందిన 74 ఏళ్ల వృద్ధుడి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. హెల్త్‌ వర్కర్లు దగ్గరుండి అతని అంత్యక్రియలు నిర్వహించారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఆ వ్యక్తి గ్లోబల్ ఆస్పత్రిలో చనిపోతే అతని రక్త నమూనాలు టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. శనివారం అతని అంత్యక్రియలు జరిగాయి. 

కరోనా మృతుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచడంతోపాటూ, లాక్‌డౌన్‌ నేపథ్యంలో అంత్యక్రియలకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతించారు. కాగా, మరణించిన తర్వాతనే అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం మీడియా సమావేశంలో చెప్పారు. అతనికి పలు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు, దాంతోనే అతను ఆస్పత్రిలో చేరినట్లు ఆయన తెలిపారు.

ఈ నెల 14న మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన వృద్ధుడు 17న తిరిగి వచ్చారు. 20న శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది రావడంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. గత గురువారం రాత్రి అతను మృతిచెందాడు. వృద్ధుడి మృతదేహాన్ని ఆరోగ్య శాఖ సూచనలమేరకు కుటుంబ సభ్యులు సైఫాబాద్‌ పోలీసుల సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతడి నమూనాలను పరీక్షలకు పంపించగా కరోనా పాజిటివ్‌గా తేలింది.

మరిన్ని వార్తలు