కరోనా : అయ్యో! తిరుపతికి ఎంత కష్టం వచ్చింది

10 Apr, 2020 19:33 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి తెలంగాణలోని మారుమూల గ్రామాల ప్రజలను కూడా వణికిస్తుంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. అయితే పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా పాటిస్తున్నారనే చెప్పాలి. అది ఎంతలా అంటే ఎవరైనా కొత్తవారు ఊరికి వస్తే వారిని ఊర్లోకి అడుగుపెట్టనివ్వకుండా ఊరి బయటే ఉంచుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఒక లారీ డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది.

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం మాన్కపూర్‌ గ్రామానికి చెందిన తిరుపతి వృత్తిరిత్యా లారీ డ్రైవర్‌. కాగా తిరుపతి ఇటీవలే తన లారీలో గుజరాత్‌కు వెళ్లి అక్కడి నుంచి మందుల లోడ్‌ తీసుకొని విశాఖపట్నంకు వెళ్లాడు. విశాఖలో మెడిసిన్స్‌ అన్‌లోడ్‌ చేసి అక్కడి నుంచి ఏప్రిల్‌ 5న తన సొంత గ్రామమైన మాన్కపూర్‌కు చేరుకున్నాడు. అయితే సొంతూరు వచ్చిన తిరుపతిని గ్రామస్తులు ఊర్లోకి రానీయకుండా ఊరి బయటే అడ్డుకున్నారు. లాక్‌డౌన్‌  నేపథ్యంలో గుజరాత్‌కు వెళ్లి వచ్చిన తిరుపతిని ఊరి బయట వేసిన టెంట్‌లో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలంటూ గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. 14 రోజుల తర్వాత కరోనా లక్షణాలు లేకుంటేనే తిరుపతిని ఊర్లోకి అడుగుపెట్టనీయాలని తీర్మానించకున్నారు. అప్పటివరకు తిరుపతి ఊరి బయట వేసిన టెంట్‌లో ఉంటూ అక్కడి పొలాల్లోనే స్నానం,మిగతా కార్యక్రమాలను తీర్చుకోవాలన్నారు. కాగా తిరుపతికి భోజనం అందించేందుకు వచ్చే కుటుంబసభ్యులు ఎవరైనా సరే కొంత దూరానా పెట్టి తిరిగి వెళ్లిపోవాలని నిశ్చయించారు.

ఇదే విషయమై గ్రామ సర్పంచ్‌ అడగ్గా.. ఆయన మాట్లాడుతూ.. 'మా గ్రామం లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేస్తుంది.  తిరుపతి మా గ్రామస్తుడే అయినా బయటికి వెళ్లి వచ్చాడు కాబట్టి 14రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఇది ఒక్క తిరుపతికే కాదు.. మా ఊరి నుంచి ఎవరు బయటికి వెళ్లినా ఇదే వర్తిస్తుంది' అంటూ చెప్పుకొచ్చాడు. కరోనా కట్టుబాటుతో ఇప్పటికే ఐదు రోజులుగా తిరుపతి ఒక రకంగా గ్రామ బహిష్కరణ అనుభవిస్తున్నాడు. కరోనా అరికట్టెందుకు గ్రామస్తుల నిర్ణయం మేరకు మరో తొమ్మిది రోజులు తిరుపతి ఊరి బయట టెంట్‌లో ఉండక తప్పదని ఆ ఊరి గ్రామస్తులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు