కమ్ముకున్న కరోనా

2 Apr, 2020 01:53 IST|Sakshi

వెయ్యి మంది 10 వేల మందితో..

ఆ పది వేల మంది ఎందరితో కాంటాక్ట్‌?

ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో అన్ని జిల్లాల వారు..

నిఘా బృందాలకు సవాల్‌గా బాధితుల గుర్తింపు

వైరస్‌ జన సమూహంలోకి వెళ్లిందా?..

ఆందోళనలో అధికారులు

రెడ్‌జోన్లు ప్రకటించి, అనుమానితులకు

పరీక్షలు చేయడమే పరిష్కారమా?

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా మేఘాలు కమ్ముకున్నాయి. ఐదారు రోజుల క్రితం వరకు కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా పాజిటివ్‌ రావడం, వారి ద్వారా ఇంకొందరికి అంటుకోవడం.. అంతర్జాతీయ విమాన సర్వీసులు, అంతర్గత సర్వీసులు నిలిచిపోవడం.. ఇక ఏం పర్వాలేదని ఊపిరి పీల్చుకుం టుండగా.. ఉన్నట్టుండి రాష్ట్రంలో ‘మర్కజ్‌’బాంబు పేలింది. విదేశాల నుంచి వచ్చిన వారికంటే, ఇప్పుడు అత్యంత వేగంగా ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి నుంచే కరోనా వ్యాప్తి విస్తృతమవుతోంది. తెలంగాణ నుంచి 1,030 మంది ప్రతినిధులు మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్నారని వైద్య ఆరోగ్యశాఖే నిర్ధారించింది. వీరిలో 160 మందిని తప్ప అందరినీ గుర్తించారు. అయితే ఈ వెయ్యి మంది సరాసరి పది మంది చొప్పున 10 వేల మందితో కాంటాక్ట్‌ అయ్యుంటారని అంచనా. ఉదాహరణకు సచివాలయ ఉద్యోగి ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొని వారం పది రోజులు విధులు నిర్వహించారు. అతను ఈ 10 రోజుల్లో వంద మందితో కాంటాక్ట్‌ అయినట్టు అంచనా. అయితే, అతడికి నెగెటివ్‌ రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. లేకుంటే సెక్రటేరియట్‌లో చాలామంది ఐసోలేషన్‌కు, పరీక్షలకు వెళ్లాల్సి వచ్చేది.

పది వేల మంది ఎంతమందిని కలిశారో?
మొన్నటివరకు 8 జిల్లాలకే పరిమితమైన కరోనా ఇప్పుడు అన్ని జిల్లాలకూ వ్యాపించే ప్రమాదం నెలకొంది. ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న బృందంలో అన్ని జిల్లాలకు చెందినవారు ఉండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వారి ద్వారా నేరుగా కాంటాక్టయిన వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను కలిపితే పది వేల మందికి పైగా అవుతారనే అంచనా ఉంది. వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో కొందరు మినహా మిగిలిన వారిని గుర్తించింది. కానీ వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను గుర్తించి వారిలో ఏవైనా కరోనా అనుమానిత లక్షణాలున్నాయో లేదో మాత్రం తెలుసుకోలేకపోతోంది. ఈ పదివేల మంది ఇంకెంత మందితో కాంటాక్ట్‌ అయ్యారన్నది ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నగా మారింది. దీనినిబట్టి రాష్ట్రవ్యాప్తంగా వైరస్‌ జనసమూహంలోకి వెళ్లినట్టేనని కరోనా వైరస్‌ను పర్యవేక్షించే ఉన్నతస్థాయి కమిటీలోని సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడు కాదు. లాక్‌డౌన్‌ ప్రకటించే నాటికే వైరస్‌ జన సమూహంలోకి వెళ్లిపోయింది. అందుకే ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఈ విషయంలో మీకేమైనా అనుమానం ఉందా?’అని ఆయన ఎదురు ప్రశ్నించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించకపోయినా, రాష్ట్రంలో కరోనా వైరస్‌ మూడో దశలోకి వెళ్లినట్టేనని ఆయన వ్యాఖ్యల్ని బట్టి భావించాలి. కొన్ని ప్రొటోకాల్స్‌ ప్రకారం ఇటువంటివి ప్రకటించలేమని ఆయన తెలిపారు.
 
నిఘా బృందాలకు సవాల్‌
ఒకరు మరొకరితో.. మరొకరు మరికొందరితో.. మరికొందరు పలువురితో.. పలువురు వేలాది మందితో.. ఇలా కరోనా పాజిటివ్‌ వ్యక్తులు పరోక్షంగా కాంటాక్ట్‌ అయ్యారని తేలింది. ఇటీవల ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం దక్షిణ కొరియాలో ఒక వ్యక్తి ద్వారా ఏకంగా 50వేల మందికిపైగా వైరస్‌ వ్యాపించిందంటే, ఇప్పుడు వెయ్యి మంది ఢిల్లీ నుంచి రావడం, వారంతా వివిధచోట్లకు తిరగడం, రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనడం, అందులో ఆరుగురు చనిపోవడం తెలిసిందే. జన బాహుళ్యంలోకి వెళ్లిన వారిని ఎలా గుర్తించాలన్నది ఇప్పుడు నిఘా బృందాలకు సవాల్‌గా మారింది. ఉదాహరణకు ఢిల్లీ వెళ్లొచ్చని వ్యక్తికి చెందిన కుటుంబాన్ని, వారి స్నేహితులను, బంధువులను గుర్తించవచ్చు. కానీ వీరంతా ఎక్కడెక్కడికి వెళ్లారు? ఎవరెవరిని కలిశారన్నది గుర్తించడం మాత్రం కష్టమే. ‘బహుళ సమూహంలోకి వైరస్‌ వ్యాపించింది. ఎవరెవరు ఎందరిని కలిశారో గుర్తించడం సవాలే’అని ఒక నిఘా అధికారి వ్యాఖ్యానించారు. దీంతో ఏంచేయాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కొందరైతే మానసిక ఆందోళనకు గురవుతున్నారు. 

రెడ్‌జోన్ల ఏర్పాటే పరిష్కారం?
ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు, వారి బంధువులు, వారి స్నేహితులు, వారి ద్వారా కాంటాక్ట్‌ అయినవారిని గుర్తించడం కష్టమని నిఘా బృందాలు చెబుతున్న నేపథ్యంలో.. కొందరు వైద్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. వాస్తవంగా మొదట్లో ఎవరు ఎక్కడివారన్న విషయాలు తెలిసేవి. కానీ ఇప్పుడు తెలియడంలేదు. జన బాహుళ్యంలోకి వైరస్‌ సోకుతున్న నేపథ్యంలో వైరస్‌ ప్రభావిత ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించి, ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలుంటే ముందుకు రావాలని కోరాలని హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్‌ వైద్యుడు డాక్టర్‌ రాజు సూచించారు. ఇక మరో వైద్యుడు డాక్టర్‌ కమల్‌నాథ్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైరస్‌ లక్షణాలున్న వారందరినీ ఆసుపత్రులకు రమ్మనాలని, అటువంటి వారిని గుర్తించాలని అన్నారు. మొదట్లో సర్కారు చెప్పినట్టు ప్రైవేటు ఆసుపత్రులకైనా వెళ్లాలని, అక్కడ లక్షణాలు బయటపడితే వైద్య ఆరోగ్యశాఖకు తెలపాలని కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు