నా భర్త జాడ చెప్పండి!

22 May, 2020 02:34 IST|Sakshi

మంత్రి కేటీఆర్‌కు ఓ మహిళ ట్వీట్‌

మనుషుల మధ్య అనుబంధాలనూ చంపేస్తున్న కరోనా

బర్త్‌డే పార్టీ కేంద్రంగా వనస్థలిపురంలో విస్తరించిన వైరస్‌

ఫ్యామిలీ అంతా ఆస్పత్రిపాలు

తండ్రి ఈశ్వరయ్య, కుమారుడు మధుసూదన్‌ మృతి..

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో జరిగిన అంత్యక్రియలు 

భర్త మధుసూదన్‌ ఆచూకీ కోసం భార్య ట్వీట్‌ చేయడంతో విషయం వెలుగులోకి..

సాక్షి, హైదరాబాద్‌: కరోనా.. ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కుటుంబసభ్యులు కడచూపునకూ నోచుకోకుండా చేసింది. మాయదారి మహమ్మారి అయిన వాళ్లనూ దూరం పెట్టడంతో ఆ కుటుంబంలోని తండ్రీకొడుకులకు అనాథ శవాల్లా దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. మృతుల్లో ఒకరి భార్య ‘నా భర్త జాడ చెప్పండి సార్‌’ అంటూ మంత్రి కేటీఆర్‌కు బుధవారం ట్విట్టర్‌ వేదికగా ఫిర్యాదు చేయడంతో.. కరోనా మనుషుల మధ్య అనుబంధాలనూ ఎలా దూరం చేస్తుందో వెలుగుచూసింది. మృతుల్లో ఒకరైన మధుసూదన్‌ భార్య సైతం కరోనా బారినపడి, ఆస్పత్రి నుంచి డిశ్చారై్జ్జ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే భర్త డిశ్చార్జి అయినట్టు వైద్యులు చెప్పారు. తీరా చూస్తే ఇంట్లో భర్త జాడలేదు. కుటుంబసభ్యులూ పెదవిప్పలేదు. దీంతో ఆవేదన చెందిన ఆమె కేటీఆర్‌కు ట్వీట్‌ చేయగా.. ఆపై విషయం తెలిసి ఆమె హతాశురాలైంది. కనీసం దహస సంస్కారాల వీడియో అయినా చూపించకపోవడం దారుణమంటూ కన్నీరుమున్నీర వుతోంది. కట్టుకున్న వాడి కడచూపునకూ నోచుకోలేకపోయానని విలపిస్తోంది.

పరామర్శించేందుకు వెళ్తే అంటుకుంది
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరుకు చెందిన ఆలంపల్లి ఈశ్వరయ్య కుటుంబం నలభై ఏళ్ల క్రితమే నగరానికి వలస వచ్చింది. ఈయన పెద్దకుమారుడు ఆలంపల్లి శ్రీనివాస్‌ సరూర్‌నగర్‌ శారదా నగర్‌లో ఉంటూ మలక్‌పేట గంజ్‌లో పల్లీనూనె వ్యాపారం చేస్తున్నాడు. ఈశ్వరయ్య దంపతులు వనస్థలిపురం ఎ–క్వార్టర్స్‌లో రెండో కుమారుడు మధుసూదన్‌ వద్ద ఉంటున్నారు. ఏప్రిల్‌ మూడో వారంలో శ్రీనివాస్‌కు ఉన్నట్టుండి జ్వరం వచ్చింది. వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా, అతడిని   
పరామర్శించేందుకు తండ్రి ఈశ్వరయ్య సహా తల్లి, సోదరుడు మధుసూదన్‌ వెళ్లారు. సాధారణ చికిత్సతో జ్వరం తగ్గకపోవడంతో అనుమానం వచ్చి, ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఏప్రిల్‌ 26న ఆయనకు కరోనా వైరస్‌ సోకినట్టు తేలింది. ఇదే సమయంలో మధుసూదన్‌ తన కుమార్తె పుట్టినరోజు వేడుకలను ఇంట్లో నిర్వహించారు. హుడా సాయినగర్‌లో ఉండే ఆయన అత్త సహా ఎస్‌కేడీనగర్‌లోని సోదరి కుటుంబసభ్యులు ఈ వేడుకలకు హాజరయ్యారు. మరోపక్క శ్రీనివాస్‌కు కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆయనకు సన్నిహితంగా మెలిగిన తల్లిదండ్రులు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, సోదరుడు మధుసూదన్, ఆయన భార్య మాధవి, ఇతర కుటుంబసభ్యులు మొత్తం 25 మందిని కింగ్‌కోఠి ఆస్పత్రి క్వారంటైన్‌ సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 12 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కావడంతో అందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఎర్రగడ్డలో తండ్రికి..సాహెబ్‌నగర్‌లో కొడుక్కి..
ఆరోగ్యం విషమించి ఏప్రిల్‌ 29న తండ్రి ఆలంపల్లి ఈశరయ్య (72) మృతిచెందారు. ఆ మర్నాడే రెండో కుమారుడు మధుసూదన్‌ (42) చనిపోయారు. పెద్ద కుమారుడు శ్రీనివాస్‌ సహా అప్పటికే ఆ కుటుంబసభ్యులంతా వైరస్‌ బారినపడటం, ఒక్కొక్కరు ఒక్కో వార్డులో చికిత్స పొందుతుండటం, ఒకరోజు వ్యవధిలోనే కుటుంబంలోని ఇద్దరు చనిపోవడం ఆ కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టింది. మొదట తండ్రి మరణవార్తను పెద్దకుమారుడికి చేరవేశారు. కుటుంబసభ్యులంతా ఆస్పత్రిలోనే ఉండటంతో కనీసం అంత్యక్రియలు కూడా నిర్వహించలేని దుస్థితి. దీంతో కుటుంబసభ్యుల అంగీకారంతో ఆస్పత్రి అధికారులు ఈశ్వరయ్య మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. వారు జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహకారంతో కరోనా నిబంధనల మేరకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో దహనం చేశారు. మర్నాడే మధుసూదన్‌ కూడా చనిపోయినట్టు సోదరుడు శ్రీనివాస్‌కు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులెవరూ రాకపోవడంతో తండ్రి మృతదేహంలాగే, తన సోదరుడికీ అంత్యక్రియలు నిర్వహించాలని శ్రీనివాస్‌ కోరడంతో ఆస్పత్రి అధికారులు ఆయన మృతదేహాన్ని వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. ఆయనకు సాహెబ్‌నగర్‌ శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. మరోపక్క కరోనా బారినపడి చికిత్సపొందుతున్న మధుసూదన్‌ భార్య మాధవికి భర్త మృతి వార్తను కుటుంబసభ్యులు చెప్పలేదు. చెబితే ఆరోగ్యం మరింత దెబ్బతినడమే కాక మానసికంగా షాక్‌కు గురవుతుందని భావించారు.

భర్త కోలుకున్నాడని చెప్పారు..
చికిత్స తరువాత కోలుకోవడంతో మాధవితో పాటు ఆమె అత్త, పిల్లలు, ఇతర బంధువులను ఈ నెల 17న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, డిశ్చార్జి ప్రక్రియ ఆలస్యం కావడం, రాత్రి పొద్దుపోవడంతో మర్నాడు ఉదయం మాధవి తదితరులు ఇంటికి వెళ్లారు.  ఆస్పత్రిలో ఉన్నప్పడు తన భర్త మధుసూదన్‌ కోలుకుని ఇంటికి వెళ్లారని వైద్యులు చెప్పడం, తీరా ఇంట్లో ఆయన కనిపించకపోవడంతో మాధవి ఆందోళన చెందారు. ఆరా తీస్తే.. ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో ఆమె మరింత కలత చెందారు. తన భర్త ఆచూకీ చెప్పాలంటూ ఆమె మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఆస్పత్రి అధికారులు, పోలీసులు ఆమె కుటుంబసభ్యులను అప్రమత్తం చేయగా వారు ఆమె వద్దకు చేరుకుని జరిగిన విషయం చెప్పారు. చివరిచూపు దక్కనివ్వకుండా, కనీసం సమాచారం లేకుండా తన భర్త మృతదేహానికి ఆంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారని ఆమె అధికారులను నిలదీశారు. అందరూ ఉన్నా అనాథ శవంలా అంత్యక్రియలు నిర్వహించారని వాపోయారు. తన బాధను చూడలేకనే పిల్లలు సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని పెట్టారన్నారు. 


బంధువులే చెప్పొద్దన్నారు..
ఈ ఉదంతంపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు స్పందించారు. మధుసూదన్‌ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులెవరూ రాకపోవడంతోనే, మృతదేహాన్ని పోలీసులకు అప్పగించినట్టు ఆయన తెలిపారు. కరోనా నిబంధనల మేరకే ఆయన మృతదేహానికి జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహకారంతో పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారని చెప్పారు. అప్పటికే వైరస్‌ బారినపడి ఆస్పత్రిలో చేరిన ఆయన భార్యకు ఇది తెలిస్తే.. ఆమె మానసికంగా కుంగిపోయి షాక్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందన్న కుటుంబసభ్యుల విజ్ఞప్తితోనే తామీ విషయాన్ని ఆమెకు చెప్పలేదని, ఆ తర్వాత బంధువులు కూడా ఆమెకు ఆయన మరణవార్త చెప్పకపోవడమే సమస్యకు కారణమని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

డాక్టర్లపై ఆరోపణలు తగవు: మంత్రి ఈటల
గాంధీ వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్యం చేస్తున్నారని, వారిపై ఆరోపణలు చేయటం సరికాదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ఆయ న గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల కోసమే ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. కరోనా కేసుల విషయంలో కానీ, కరోనా మరణాల విషయంలో కానీ ప్రభుత్వం ఏమీ దాయడంలేదన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన మొదట్లో ఎవరన్నా చనిపోతే వారి కుటుంబ సభ్యులు సైతం చూడడానికి భయపడేవారని.. దహన సంస్కారాలు చేయడానికి కూడా ముందుకు రాలేదని తెలిపా రు. అమెరికా, ఇటలీ వంటి దేశాలలో వందలమంది చనిపోతే.. కుటుంబ సభ్యులు లేనివారికి ప్రభుత్వాలే అంత్యక్రియలు చేశాయని వెల్లడించారు.  

బంధువుల సూచనల మేరకే.. 
గత నెల 29న వనస్థలిపురం నుండి ఈశ్వరయ్య అనే రోగి కరోనా పాజిటివ్‌తో గాంధీ ఆసుపత్రిలో చేరారని.. 30న చనిపోయారని మంత్రి ఈటల తెలిపారు. ‘‘దీంతో ఆయన కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేశాం. ఈశ్వరయ్య కొడుకు మధుసూదన్‌ తీవ్రమైన శ్వాస సంబంధమైన ఇబ్బందితో గాంధీకి వచ్చారు. ఆయన ఒకటో తేదీన చనిపోయారు. అప్పటికే ఆయన భార్యతో సహా కుటుంబసభ్యులంతా క్వారంటైన్‌లో ఉన్నారు. భర్త చనిపోయిన విషయాన్ని భార్యకి చెప్తే షాక్‌కి గురవుతారని, ఇలాంటి సమయంలో చెప్పకుండా ఉండటమే మేలని బంధువులు సూచించారు. దీంతో ఆయన మృతదేహాన్ని పోలీసులకు అప్పగించి జీహెచ్‌ఎంసీ సిబ్బందితో దహన సంస్కారాలు నిర్వహించాం’’అని ఆయన వివరించారు. బంధువులకు చెప్పకుండా మధుసూదన్‌కు అంత్యక్రియలు నిర్వహించారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. కరోనా నుంచి కోలుకుని బయటకి వచ్చాక గాంధీ ఆస్పత్రిపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.  

>
మరిన్ని వార్తలు