జూలో జంతువులు సేఫ్‌

9 Apr, 2020 03:02 IST|Sakshi

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం

ప్రతిరోజూ జంతువులను వెటర్నరీ డాక్టర్ల బృందం పరిశీలిస్తోంది

యాంటీ వైరల్‌ ద్రావకాల స్ప్రే.. 

‘సాక్షి’తో నెహ్రూ జూపార్క్‌ క్యూరేటర్‌ క్షితిజ  

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌ జూలో నాలుగేళ్ల పెద్దపులి (నాదియా)కి కరోనా వైరస్‌ సోకడం ప్రపం చవ్యాప్తంగా కలకలం సృష్టించింది. నాదియాతోపాటు మరో మూడు పులులు, మూడు ఆఫ్రికా సింహాల్లోనూ పొడి దగ్గు పెరగడం, ఆకలి మందగించడం వంటి కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో అక్కడి జూ అధికారులు అలర్టయి ఆ జూతోపాటు న్యూయార్క్‌లోని మరో మూడు జూలు, ఆక్వేరియంను నిరవధికంగా మూసేశారు. పులుల ఆలనాపాలనా చూసే వారి ద్వారా నాదియాకు కరోనా వచ్చిందని భావించినా అది నిరూపితం కాలేదని... ప్రస్తుతమైతే అన్ని పులులు కోలుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లోని జూలు, అభయారణ్యాలు, నేషనల్‌ పార్కులు, జింకల పార్కుల్లోని జంతువులకు వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వాటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటూ రాష్ట్రాల అటవీశాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

రాష్ట్రంలో హై అలర్ట్‌...
రాష్ట్రంలోని జూలు, పులుల అభయారణ్యాలు, జూపార్కులు, నేషనల్‌ పార్కుల్లోనూ హైఅలర్ట్‌ జారీ చేశారు. జంతువులను 24 గంటలపాటు సీసీ టీవీల్లో పరిశీలించాలని, వాటి ప్రవర్త న, ఆరోగ్యంలో మార్పులను గమనించి అనారోగ్య సూచనలు కనిపిస్తే వెంటనే చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జూపార్క్‌లో పులులు, ఇతర జంతువుల సంరక్షణకు చేపడుతున్న చర్యలకు సంబంధించి నెహ్రూ జూలాజికల్‌ పార్కు క్యూరేటర్‌ క్షితిజ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివిధ అంశాలు వెల్లడించారు. మార్చి మొదటివారం నుంచే సిబ్బందికి శానిటైజర్లు అందజేయడంతోపాటు ముందుజాగ్రత్త చర్యలను ముమ్మరం చేసినట్లు ఆమె చెప్పారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు క్యూరేటర్‌ మాటల్లోనే...

జంతువులన్నీ ఆరోగ్యంగానే..
జూలోని జంతువులన్నీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాయి. ప్రస్తుతం జూలోని పరిస్థితులన్నీ బాగున్నాయి. ఎలాంటి పరిస్థితి వచ్చినా దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ›జూలోని పులులు, ఇతర జంతువులకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఆకలి మందగించడం వంటి లక్షణాలుంటే వాటి శాంపిళ్లను పరీక్షల కోసం పంపించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.

జూలో ప్రత్యేక చర్యలు...
జూలో ఎప్పటికప్పుడు చేపట్టే చర్యలతోపాటు ప్రత్యేకంగా సోడియం హైపోక్లోరిన్, యాంటీ వైరల్, ఇతర ద్రావకాలను స్ప్రే చేస్తున్నాం. స్టాండర్డ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి, ప్రతినెలా ఒకసారి వివిధ రూపాల్లో ప్రత్యేక పరిశుభ్రæతా చర్యలు పాటిస్తాం. దీనికి అదనంగా చర్యలు చేపడుతున్నాం.

సిబ్బందికి పరీక్షలు...
జూలో పనిచేసే సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యానిమల్‌ హ్యాండ్లర్ల నుంచి జంతువులకు వైరస్‌ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం.

సఫారీల్లోపలే జంతువులు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 15 నుంచి జూకి సందర్శకులను అనుమతించడం లేదు. సఫారీలు నిలిచిపోయాయి. వాటిలోని జంతువులను బయటకు రానివ్వడం లేదు. సఫారీ ప్రాంతాల్లోనే వాటికి ఎండ, గాలి తగిలేలా వదిలేస్తున్నాం.

నిత్యం పరిశీలన...
డిప్యూటీ, అసిస్టెంట్‌ డైరెక్టర్లు, వెటర్నరీ డాక్ట ర్లు, సిబ్బందితో కూడిన బృందాలు ప్రతి రోజూ అన్ని జంతువులను నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. ఏ జంతువు ప్రవర్తనలోనైనా మార్పును గుర్తిస్తే వాటి శాంపిళ్లను పరీక్షల కోసం పంపిస్తాం. పులులు సహా ఏ జంతువైనా అనారోగ్యానికి గురైతే ఐసోలేషన్‌లో పెట్టాలని ఆదేశాలున్నాయి. ప్రస్తుతమైతే అన్ని జంతువులను వాటి ఎంక్లోజర్లలోనే ఉంచుతున్నాం.  
– క్షితిజ

మరిన్ని వార్తలు