రండి..బాబూ రండి!

3 Apr, 2019 07:36 IST|Sakshi

టెన్త్‌ విద్యార్థులకు ‘కార్పొరేట్‌’ వల

ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో రాయితీల తాయిలాలు  

విద్యార్థులను చేర్పించాలని అధ్యాపకులపై ఒత్తిడి

కొలువు పదిలం కావాలంటే టార్గెట్‌పూర్తి చేయాల్సిందే..

ఆకర్షణీయ మాటలు చెప్పేందుకు పీఆర్‌ఓల నియామకం

సాక్షి,సిటీబ్యూరో:‘సార్‌ మీ ఇంట్లో ఎవరైనా పదో తరగతి పరీక్షలు రాస్తున్న పిల్లలున్నారా? ఉంటే మా కాలేజీలో చేర్పించండి. ఫలితాలు వచ్చిన తర్వాత అయితే ఫీజు ఎక్కువగా ఉంటుంది. ముందే రిజర్వు చేసుకుంటే ఫీజులో 20 నుంచి 30 శాతం రాయితీ లభిస్తుంది. ఎంసెట్, నీట్‌లో ఉచిత శిక్షణ ఇస్తాం’.. పదోతరగతి పరీక్షలు రాస్తున్న తల్లిదండ్రులకు కార్పొరేట్‌ ఇంటర్మీడియట్‌ కాలేజీల పీఆర్‌ఓలు, అధ్యాపకులు ఇస్తున్న ఆఫర్‌ ఇది. 

పదోతరగతి పరీక్షలు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో అప్పుడే ఆయా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల వేట ప్రారంభించాయి. ఇందుకోసం కొన్ని కాలేజీలు ప్రత్యేకంగా పీఆర్‌ఓలను నియమించుకోగా, ఇంకొన్ని కాలేజీలు విద్యార్థులను చేర్పించే బాధ్యతను ఇప్పటి వరకుఆయా కాలేజీల్లో పనిస్తున్న అధ్యాపకులకు అప్పగించాయి. విద్యార్థులను చేర్పించే విషయంలో ఒకొక్కరికీ ఒక్కోరకమైన టార్గెట్‌ ఇస్తున్నారు. టార్గెట్‌ పూర్తి చేసిన వారికే వేతన పెంపు, కొలువు పదిలంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఇంటర్‌ పరీక్షలు పూర్తి అయిపోయినా అధ్యాపకులకు ఆయా కళాశాలలు సెలవులు ఇవ్వలేదు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాల వద్దకు అధ్యాపకులు వెళ్లి కరపత్రాలు చూపించి విద్యార్థులను ఆకర్షించే పనిలో పడ్డారు. సాయంత్రం, ఉదయం సమయాల్లో కళాశాల సమీప ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నారు. ‘సార్, ఇంట్లో పదో తరగతి పరీక్ష రాసిన వాళ్లు ఎవరైనా ఉన్నారా..? వారిని మా కళాశాలలో చేర్పించండి’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. గ్రేటర్‌లోని పలు జూనియర్‌ కళాశాలల్లో పనిచేసే ఉద్యోగులు, అధ్యాపకులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. గురుకుల జూనియర్‌ కళాశాలలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రైవేటు కళాశాలల్లో చాలా సీట్లు మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని ముందు గుర్తించిన వాటి యాజమాన్యాలు ఫీజు డిస్కౌంట్లు.. పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

రంగులు వేసి..ముస్తాబు చేసి..
ప్రస్తుతం ప్రైవేటు కళాశాలలు ఉన్న సమీప ప్రాంతాల్లోని విద్యార్థులను ఆకర్షించేందుకు వాటి యాజమాన్యాలు తమ కాలేజీల భవనాలకు మెరుగులు దిద్దుతున్నాయి. శివారు ప్రాంతాల్లో మైదానాలు ఉన్నాయని అందులో పేర్కొంటున్నాయి. పదో తరగతి చదివే పిల్లల జాబితాలను, ఫోన్‌ నంబర్లు సేకరించి వారి ఇళ్లకు మధ్యవర్తులను, దళారులను పంపి ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఫీజు ఎక్కువగా ఉంటుందని, అదే ముందే సీటు రిజర్వు చేయించుకున్న వారికి ఫీజులో రాయితీ ఉందంటూ ఆశ చూపుతున్నారు. 

ప్రవేశాల కోసం రాయితీల ఎర
గ్రేటర్‌ పరిధిలో కొన్ని కళాశాలలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. ఇంటర్‌లో చేరేటప్పుడు ఫీజులో 20 శాతం నుంచి 30 శాతం రాయితీ ఇస్తున్నారు. పదిలో మార్కుల ఆధారంగా రాయితీ మరింత పెరుగుతుందని చెబుతున్నారు. కానీ విద్యార్థి సదరు కళాశాలలో చేరిన తర్వాత ఏడాది పూర్తి ఫీజు గుంజుతున్నారు. ఎంసెట్, నీట్‌ అంటూ అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక్కసారి విద్యార్థులు ఆయా కళాశాలల్లో చేరాక ఏదో రూపంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. 

మధ్యవర్తులతో బేరసారాలు
ప్రచారం చేసి విద్యార్థులను ఆకర్షించడంలో కొన్ని కళాశాలలు ఆరితేరాయి. విద్యార్థులకు గాలం వేయడం కోసం రూ.లక్షలు వెచ్చించి మధ్యవర్తులను నియమించుకున్నాయి. వీరు విద్యార్థుల కుటుంబ యోగక్షేమాలు తెలుసుకొని మాట కలపడంలో నేర్పరులు. వీరి మాటల్లో పడి విద్యార్థులను ఆ కళాశాలల్లో చాలామంది తల్లిదండ్రులు చేర్పించేస్తున్నారు. ఆ మాటలు నమ్మి కళాశాలలను ఎంపిక చేసుకుంటే తర్వాత ఇబ్బందులేనని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

డబ్బులు కట్టి మోసపోవద్దు  
అనుమతులు ఉన్న కాలేజీల జాబితాను ఇంటర్‌మీడియట్‌ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచుతాం. ఏ కాలేజీలో యే విధమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయో కూడా పొందుపరుస్తాం. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే అడ్మిషన్‌ తీసుకోవాలి. తల్లిదండ్రులు ముందే డబ్బులు కట్టి మోసపోవద్దని మా విజ్ఞప్తి.    – జయప్రద, హైదరాబాద్‌ జిల్లా    ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి 

మరిన్ని వార్తలు