అద్దాల మేడలు.. అందమైన భవంతులు..

28 Aug, 2019 11:01 IST|Sakshi
నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలోని ఐటీ, ఇతర సంస్థల భవనాలు

రూపురేఖలు మారుతున్న ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌

అనేక అంతర్జాతీయ కంపెనీల ఏర్పాటు

అమెజాన్‌ రాకతో రెట్టింపైన ఆదరణ

తాజాగా వన్‌ప్లస్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ ప్రారంభం

త్వరలో అమెరికన్‌ కాన్సులేట్, గూగుల్‌ కార్యాలయాలు

రాయదుర్గం: నగరానికి శివారులో నానక్‌రాంగూడ ఒకప్పుడు రాతి, మట్టిగుట్టలు, పంట పొలాలు ఉండేవి. అయితే ఇపుడు అక్క బహుళ అంతస్తుల అద్దాల మేడలతో రూపురేఖలే మారిపోయాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలన్నీ నేడు నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటయ్యాయి. తాజాగా  ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ ఆమెజాన్‌ రాకతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యత పెరిగింది. సుమారు 313 ఎకరాల విశాల స్థలంలో నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతం రూపుదిద్దుకుంది. ఇందులో ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ట్రేడింగ్, ఫైనాన్షియల్‌ బ్యాకింగ్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్, కమొడిటీస్‌ ఎక్ఛేంజ్, వెంచర్‌ క్యాపిటల్, అసెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో సుమారు రెండున్నర లక్షల మంది ఐటీ, ఇతర కేటగిరీల్లో  వివిధ స్థాయిల్లో ఉద్యోగులు షిఫ్ట్‌ల వారీగా పనిచేస్తున్నారు.

ఇప్పటికే వెలిసిన కంపెనీలు ఇవే...
నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలో అనేక కంపెనీలు వెలిశాయి. అందులో తాజాగా 12.3 ఎకరాల విశాల స్థలంలో ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్‌ క్యాంపస్‌ను ఏర్పాటు చేసినవిషయం తెలిసిందే. ఇందులో 15వేల మందికి ఉపాధి కలుగనున్న విషయం తెలిసిందే.  మైక్రోసాఫ్ట్, ఐఆర్‌డీఏ, ఐసీఐసీఐ, ఐఐఆర్‌ఎం, హనీవెల్, కాంగ్నిజెంట్, హిటాచీ కన్సల్టింగ్, వర్చూషా, యాక్సెంచర్, టీసీఎస్, సైయింట్, క్యాపెజెమినీ, కంప్యూటర్‌ అసోసియేట్స్, ఓఎన్‌జీసీ,ప్రాంక్లిన్‌ టెంపుల్టన్, విజువల్‌సాఫ్ట్‌ వంటి అతిపెద్ద సంస్థలు వెలిశాయి. ఇందులో సీఏ సంస్థనే అతిపెద్దగా 20కి పైగా ఎకరాల్లో వెలిసింది. కాగా ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ , వేవ్‌రాక్, విజువల్‌సాఫ్ట్, క్యాపెజెమిని, కాంగ్నిజెంట్, హనీవెల్,  సెయింట్‌ వంటి సంస్థలు పదిఎకరాలకుపైగా ఏర్పాటయ్యాయి. షెరటాన్, హయ్యత్,  ఓక్‌వుడ్‌ రెసిడెన్సీ వంటి స్టార్‌ హోటళ్ళు కూడా వెలిశాయి. క్యూసిటీ, కపిల్‌ టవర్స్, యాక్సెంచర్‌ వంటి అతిపెద్ద భవనాలు వెలిశాయి.   వైద్యసౌకర్యం కోసం కాంటినెంటల్‌ ఆస్పత్రి, వాహనాల కోసం వరుణ్‌మోటార్స్‌ వంటివి కూడా నిర్వహిస్తున్నారు. వీటి చెంతనే ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, విప్రో, ఇన్ఫోసిస్, టీఎస్‌ఐఐసీ సైబరాబాద్‌జోన్‌ కార్యాలయం, జలమండలి గచ్చిబౌలి సెక్షన్‌ కార్యాలయం, శాంతిసరోవర్‌లోని ఇన్నర్‌స్పేస్‌ భవనం కూడా ఉన్నాయి.

నిన్న వన్‌ప్లస్‌ .....త్వరలో అమెరికన్‌ కాన్సులేట్, గూగుల్‌......
ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలో మరికొన్ని సంస్థలు రానున్నాయి. వాటిలో సోమవారం రోడ్‌ నెంబర్‌–2లో వన్‌ప్లస్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు చేతుల మీదుగా ప్రారంభించారు. త్వరలో అమెరికన్‌ కాన్సులేట్, గూగుల్‌ సంస్థలు రానున్నాయి. వీటిలో అమెరికన్‌ కాన్సులేట్‌కు 12.17 ఎకరాలు, గూగుల్‌ సంస్థకు ఏడున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించారు.  మరో ఏడాదిన్నరలో అమెరికన్‌ కాన్సులేట్‌ భవనాన్ని పూర్తి చేయాలని బావిస్తున్నట్లు తెలిసింది. దీని రాకతో ప్రతి నిత్యం రెండున్నర వేల మందిని వీసా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో మరింతగా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత పెరుగనుంది.

లింకు రోడ్లపై దృష్టి పెట్టిన టీఎస్‌ఐఐసీ సంస్థ....
నానక్‌రాంగూడ ఐటీకారిడార్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతానికి రాకపోకలు నగరం నుంచి చుట్టూరా ఉండే ప్రాంతాల నుంచి సాఫీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందు కోసం ఈ రెండు ప్రాంతాల కోసం లింకు రోడ్ల నిర్మాణంపై టీఎస్‌ఐఐసీ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.  

అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు
నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతం రోజురోజుకూ బిజీగా మారుతోంది.   ఇప్పటికే రెండున్నర లక్షల మంది పనిచేస్తుండగా మరో 20వేల మంది దాకా పెరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో టీఎస్‌ఐఐసీ పాలకమండలి, ఉన్నతాధికారుల చొరవతో లింకురోడ్ల నిర్మాణం, ఆర్టీసీ బస్సులతోపాటు టీఎస్‌ఐఐసీ ద్వారా ఆరు ఉచిత బస్సులను ఐటీ ఉద్యోగుల కోసమే నడుపుతున్నాం. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తాం. హరితహరంలో గ్రీనరీని పెంచుతున్నాం. – వినోద్‌కుమార్, జోనల్‌ మేనేజర్‌– సైబరాబాద్‌జోన్‌ టీఎస్‌ఐఐసీ

మరిన్ని వార్తలు