ఒకటా మూడా?

17 Jul, 2019 13:03 IST|Sakshi

మహానగరం మూడు కార్పొరేషన్లుగా అవతరిస్తుందా..?

జీఎంహెచ్‌ఎంసీకే పరిమితమవుతుందా...?

ఓ వైపు ఎన్నికల ఏర్పాట్లు.. మరోవైపు విలీన చర్చలు

ఔటర్‌ లోపలున్న 23 మున్సిపాలిటీలపై తర్జనభర్జన

నేటి కేబినెట్‌లో స్పష్టత వచ్చే అవకాశం

సాక్షి, సిటీబ్యూరో: ఢిల్లీ, ముంబై తరహాలో హైదరాబాద్‌ మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తారా..? ఔటర్‌ లోపల ఉన్న 23 మున్సిపాలిటీలను ఇందులో విలీనం చేస్తారా...? మున్సిపాలిటీల వారీగా మంగళవారం తుది ఓటర్ల జాబితా ప్రకటించిన నేపథ్యంలో మహానగరంలో మళ్లీ సస్పెన్స్‌ మొదలైంది.అయితే దీనిపై రాష్ట్ర నూతన మున్సిపల్‌ చట్టం ఆమోదం కోసం బుధవారం రాష్ట్ర  కేబినెట్‌ భేటీలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. వాస్తవానికి పోలీస్‌ అవసరాల కోసం నగరాన్ని మూడు కమిషనరేట్లుగా విభజించగా, మున్సిపల్‌ పాలన మాత్రం జీహెచ్‌ఎంసీ కేంద్రంగానే కొనసాగుతోంది.శివారు ప్రాంతాలన్నీ మహానగరంలో కలిసిపోయినా మొన్నటి వరకు పంచాయతీలుగానే కొనసాగాయి. తాజా మార్పులతో పట్టణాలుగా అప్‌గ్రేడ్‌ అయి వచ్చే నెలారంభంలో ఎన్నికలకు సైతం సన్నద్ధం అవుతున్నాయి.

నగరంలో కలిసిపోయిన ప్రాంతాలు గ్రామ పంచాయతీలుగా ఉన్న సమయంలో అక్రమ కట్టడాలు, చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలు భారీగా జరిగిపోవటంతో ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పెద్ద సమస్యగా మారిపోయింది. కోర్టు వివాదాలు సైతం భారీగానే పేరుకుపోయాయి. తాజాగా శివారు ప్రాంతాలను ఈ దఫా మున్సిపాలిటీలుగానే కొనసాగించి, వచ్చే ఐదేళ్ల తర్వాత జీహెచ్‌ఎంసీలో విలీన ప్రతిపాదనలు ఉండగా, మరో వైపు ఔటర్‌ రింగు రోడ్డు లోపలి ప్రాంతాలన్నింటికి ప్రత్యేక మాస్టర్‌ ప్లాన్‌ తీసుకొచ్చి మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే గ్రేటర్‌లో విలీనం తప్పనిసరి అన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అలా కాకుండా మహానగరానికి ముఖద్వారాలుగా ఉన్న ప్రాంతాల్లో అడ్డదిడ్డమైన పాలన, రాజకీయ జోక్యం చోటు చేసుకుంటే భవిష్యత్‌లో కూడా వాటిని సరి చేయలేరన్న భావన వ్యక్తమవుతోంది.

విలీనమైతే..మూడు కార్పొరేషన్లు
ఇప్పటికే జలమండలి, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలను విలీనం చేయాలన్న ప్రతిపాదనను ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ముందుకు తీసుకు రాగా, నగర శివారులోని 23 మున్సిపాలిటీలను గ్రేటర్‌లో విలీనం చేస్తే మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసే చాన్స్‌ కనిపిస్తోంది. వాటిని హైదరాబాద్, హైదరాబాద్‌ ఈస్ట్, హైదరాబాద్‌ వెస్ట్‌ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి ఈ మూడు కార్పొరేషన్ల మధ్య సమన్వయం కోసం చీఫ్‌ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల కోసం బీసీ ఓటర్ల గణన, వార్డుల విభజన తదితర అంశాలు పూర్తి కావటంతో ఎన్నికలు నిలిపేయటం సాధ్యం కాకపోతే ఔటర్‌ రింగురోడ్డు లోపలున్న మున్సిపాలిటీలకు వచ్చే నెలారంభంలో ఎన్నికలు నిర్వహించటం ఖాయం కానుంది. 

మరిన్ని వార్తలు