గ్రేటర్.. పవర్

17 Jan, 2016 01:51 IST|Sakshi
గ్రేటర్.. పవర్

కార్పొరేషన్ ఆఫీస్‌కు సంప్రదాయేతర విద్యుత్
చెత్తతో విద్యుత్ ఉత్పత్తి తడిచెత్తకు తోడుగా సౌర శక్తి
మరిన్ని ప్లాంట్ల ఏర్పాటు దిశగా ‘గ్రేటర్ వరంగల్’ ప్రయత్నాలు

 
హన్మకొండ : రాష్ట్రంలోనే తొలిసారిగా సంప్రదాయేతర విద్యుత్‌తో నడిచే కార్యాలయంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఖ్యాతి పొందింది. నిత్యం నగరం నుంచి వెలువడే తడి చెత్త, ప్రకృతి నుంచి ఉచితంగా లభించే సౌరశక్తి సాయంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ కార్యాలయ అవసరాలకు వినియోగిస్తున్నారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో భాగంగా తడిచెత్త ఆధారిత బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి వీధి దీపాలు వెలిగించే దిశగా మరో ప్రయోగానికి కూడా కార్పొరేషన్ సిద్ధమవుతోది. మూడు అంతస్తులు ఉన్న గ్రేటర్ వరంగల్ కార్యాలయానికి సగటున నిత్యం 70 కిలోవాట్ల విద్యుత్తు అవసరం. ఇందులో 51 కిలోవాట్ల విద్యుత్‌ను సౌరశక్తి, తడిచెత్త ఆధారిత విద్యుత్ ప్లాంట్ ద్వారా కార్యాలయ ప్రాంగణంలోనే ఉత్పత్తి చేస్తున్నారు. వరంగల్ నగర పాలక సంస్థ భవనంపై 2013 ఆగస్టులో రూ. 48 లక్షల వ్యయంతో సోలార్ యూనిట్  నెలకొల్పారు. దీని నుంచి 27 కిలోవాట్ల విద్యుత్‌ఉత్పత్తి అవుతోంది.

తాజాగా 2015 డిసెంబరు 5 నుంచి కార్యాలయ ఆవరణలో రూ. 24 లక్షల వ్యయంతో నిర్మిం చిన బయోగ్యాస్ ప్లాంట్ పని చేయడం ప్రారంభించింది. దీనినుంచి 24 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ రెండు పద్ధతుల్లో ఉత్పత్తి అయిన 51 కిలోవాట్ల విద్యుత్తుతో మూడు అంతస్తులు గల కార్పొరేషన్ కార్యాల యంలోని 104 ఫ్యాన్లు, 232 ట్యూబ్‌లైట్లు, 83 డీఎస్‌ఎల్, 11 వాట్ ఎల్‌ఈడీ బల్బ్స్, ఒక వాటర్ కూలర్, 54 కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 31 ఏసీలకే సంప్రదాయ విద్యుత్ ఉపయోగిస్తున్నారు. డిమాండ్ లేనప్పుడు ఉత్ప త్తి అయ్యే సౌర, తడిచెత్త ఆధారిత విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపిం చేందుకు నెట్ మీటరింగ్ కోసం దరఖాస్తు చేశారు.
 
తగ్గిన కరెంటు బిల్లు
 గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయూనికి సగటున ప్రతీనెల రూ.1.10 లక్షల కరెంటు బిల్లు వచ్చేది. కానీ, 27 కేవీ సోలార్ పవర్ యూనిట్ అందుబాటులో వచ్చిన తర్వాత బిల్లు ఒక్కసారిగా రూ.60 వేలకు పడిపోయింది. తాజాగా 24 కేవీ తడిచెత్త విద్యుత్తు అందుబాటులోకి రావడంతో ప్రతీనెల కరెంటు బిల్లు రూ.20 వేల కు కిందకు పడిపోనుంది. పైగా నెట్‌మీటర్ అందుబాటులోకి వస్తే ఈ బిల్లు కూడా మరింత తగ్గుతుంది.
 
మరిన్ని తడిచెత్త ప్లాంటు
ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో భాగంగా తడిచెత్త ఆధారిత బయోగ్యాస్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంటుకు రెండేళ్ల కిందట  గ్రేటర్ అధికారులు రూపకల్పన చేశారు. ఇందులో ఒక టన్ను తడిచెత్త సామర్థ్యంతో 2013లో బాలసముద్రంలో రూ.13.75 లక్షల వ్యయంతో తొలి తడిచెత్త ఆధారిత బయోగ్యాస్ ప్లాంటు ఏర్పా టు చేశారు. ఈ ప్లాంటు నుంచి 12 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్‌ను సమీపంలో ఉన్న చిల్డ్రన్స్‌పార్కులో 70 లైట్లతో పాటు మూడు 5 హెచ్‌పీ మోటార్లకు ఉపయోగిస్తున్నారు. కార్పొరేషన్ ఆవరణలో రెండు టన్నుల చెత్త 24 కేవీ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన రెండో ప్లాంటు సైతం విజయవంతంగా పనిచేస్తోంది. ప్రతీరోజు నగరంలో నిత్యం 40 టన్నుల తడి చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇందులో కేవలం మూడు టన్నుల చెత్త ఈ రెండు ప్లాంట్లకు వెళ్తుంది. మిగిలిన చెత్త డంపింగ్ యార్డు చేరుతోంది. దీంతో నగరంలో కనీసం పది చోట్ల తడి చెత్త ఆధారిత విద్యుత్‌ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వీటిద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వీధి దీపాలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. తద్వారా పరిశుభ్రతతో పాటు ఏకకాలంలో కాలుష్య, వ్యయ నియంత్రణ  చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు