కాసులిస్తేనే ధ్రువీకరణ!

20 Oct, 2018 09:46 IST|Sakshi

కరీంనగర్‌ హెల్త్‌: పుట్టినా పైసలే.. చచ్చినా పైసలే అన్నట్లు ఉంది వ్యవహారం. ఏ సర్టిఫికెట్‌ కావాల న్నా చేతులు తడపాల్సిన దుస్థితి జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో ఉంది. రికార్డులు భద్రపరిచే గది సిబ్బంది కాసుల కక్కుర్తికి దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. జనన, మరణ ధ్రువీకరణపత్రాలు పొందాలంటే డబ్బులు ఇవ్వందే అందడం లేదు.

అవసరమే ఆసరా 
పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మంథని శ్రీరా ములు మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై కరీంనగర్‌ ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి కుమారుడు శంకర్‌దాసు దుబయ్‌లో ఉంటున్నాడు. మరణించిన తర్వాత గడువులోపు ధ్రువీకరణపత్రం తీసుకోవాలనే అవగాహన లేకపోవడంతో అతను దుబయ్‌ వెళ్లిపోయాడు. తన తల్లికి ప్రభుత్వం నుంచి వితంతువు పింఛన్‌ దరఖాస్తు కోసం తన తండ్రి మరణ ధ్రువీకరణపత్రం అవసరం ఏర్పడింది.

దీని కోసం దరఖాస్తు చేసుకోగా మున్సిపాలిటీలో రికార్డు కాలేదని ఆస్పత్రి నుంచి సర్టిఫికెట్‌ తీసుకొని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో మృతుడి భార్య దరఖాస్తు చేసుకోగా రికార్డులు ఇప్పుడు దొరకవని.. పరిశీలించి రాయాలంటే డబ్బులు ఖర్చు అవుతుందని అనధికార అసిస్టెంట్‌ ద్వారా డిమాండ్‌ చేశాడు. ఇలా రెండు వారాల తర్వాత ఆ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి జోక్యంతో మరణ ధ్రువీకరణపత్రం జారీ అయ్యింది.
 
అవగాహన లోపం
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రి నుంచి జనన, మరణ ద్రువీకరణపత్రం పొందాలంటే కాసులు ఇవ్వాల్సిందే. ఈ ధ్రువీకరణపత్రం పొందడానికి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. జనన, మరణ ధ్రువీకరణపత్రం సకాలంలో పొందాలనే అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. లబ్ధిదారుల అమాయకత్వం, అవసరాన్ని ఆసరాగా చేసుకొని సర్టిఫికెట్లు జారీ చేసే ప్రభుత్వ ప్రధానాస్పత్రి రికార్డులు భద్రపరిచే గది అధికారి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. సర్టిఫికెట్‌ జారీ చేయడానికి రెండు నుంచి రూ.5వేలు డిమాండ్‌ చేస్తున్నట్లు బాధితులు తెలుపుతున్నారు. డిమాండ్‌ చేసిన డబ్బులు ముట్టచెప్పకపోతే వారాల తరబడి రికార్డులు లేవంటూ తిప్పుకుంటున్నారని బాధితులు పేర్కొంటున్నారు.
 
తప్పుల తడకగా రికార్డులు
జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు రెండు నెలల్లోపు సంబంధిత మున్సిపాలిటీ, గ్రామపంచాయతీల నుంచి పొందాల్సి ఉంటుంది. రెండు నెలల గడువు దాటితే ఆర్డీవో నుంచి పొందాల్సి ఉంటుంది. రెవెన్యూశాఖకు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా ప్రభుత్వాస్పత్రి వైద్యుడి ద్వారా సర్టిఫికెట్‌ తీసుకోవాలి. ఆ సర్టిఫికెట్‌ కోసం ఆస్పత్రిలోని రికార్డులు ఉండే గది అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ సర్టిఫికెట్‌ జారీ చేయడానికి రికార్టుల గది సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే రికార్డులు లేవని, వెతికిన దొరకడం లేదని, రికార్డుల్లో తప్పులు ఉన్నాయంటూ వేధింపులకు గురిచేస్తున్నారు.

ఉద్దేశపూర్వకంగానే తప్పులు !
ధ్రువీకరణపత్రాల కోసం వచ్చే వారి నుంచి డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతో రికార్డు గది సిబ్బంది వివరాలు తప్పులతడుకగా నమోదు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పేరు, ఇంటిపేరు, తండ్రిపేరు, లేదా తల్లిపేరు, లేదా మరణించిన వారి పేర్లు, పుట్టిన, మరణించిన తేదీలు ఇలా ఏదో ఒకటి రికార్డుల్లో తప్పులు రాసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలకు ఇక్కడి నుంచి రికార్డుల సమాచారం ఎప్పటికప్పుడు పంపిస్తుంటారు. రికార్డులలో తప్పులు ఉండడంతో వాటిని సరిచేసుకునేందుకు ప్రభుత్వాస్పత్రి రికార్డుల గది అసిస్టెంట్‌ను సంప్రదించాల్సి వస్తుంది. వాటిని సరిచేసి సర్టిఫికెట్‌ జారీ చేయాలంటే మరికొన్ని డబ్బులు ఇవ్వాలని ప్రజలను డిమాండ్‌ చేస్తే అందినకాడికి దండుకుంటున్నారు.

అనధికార సిబ్బందితో పనులు
జనన, మరణ ధ్రువీకరణపత్రాలు భద్రపరిచే రికార్డు గదిలో ప్రైవేట్‌ వ్యక్తుల చెలామణి చేస్తూ.. రికార్డులు రాస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. రికార్డుగదిలో ఒకరు మాత్రమే సిబ్బంది ఉన్నారు. పని ఒత్తిడి అవుతుందనే సాకుతో అనధికారికంగా మరొకరిని   అసిస్టెంట్‌గా ఏర్పాటు చేసుకొని అతని ద్వారా డబ్బులు వసూలు చేయిస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు.

మరిన్ని వార్తలు