ఐసీడీఎస్‌లో అవినీతి కోణం

31 Aug, 2019 11:23 IST|Sakshi
ఆదిల్‌పేట్‌లోని అంగన్‌వాడీ కేంద్రం 

సాక్షి, మందమర్రి(ఆదిలాబాద్‌) : ఐసీడీఎస్‌లో జరిగిన అవినీతి బట్టబయలు అయింది. ఆయా చనిపోయి నాలుగు సంవత్సరాలు అయినా ఆమె బ్యాంక్‌ అకౌంట్‌లో గౌరవ వేతనం జమ చేస్తూ వచ్చారు. అయితే ఆమె స్థానంలో కొత్తగా నియామకం అయినా ఆయా వేతనం అందడం లేదని అధికారలకు ఫిర్యాదు చేయడంతో అవినీతి బయట పడింది. మందమర్రి మండలంలోని ఆదిల్‌పేట్‌ అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పని చేసే పసునూటి మల్లక్క అనారోగ్యంతో ఏప్రిల్‌ 2015లో మృతి చెందింది. అయితే ఈ విషయాన్ని సీడీపీవో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారులకు తెలియజేసి వేతనాన్ని నిలుపుదల చేయడంలో సూపర్‌వైజర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించింది.

దీంతో 2019 వరకు మృతిరాలి బ్యాంకు ఖాతాలో లక్షా 96వేల 579 రూపాయల గౌరవ వేతనం జమ అయింది. అయితే కొత్తగా ఫిబ్రవరి 2019లో సీడీపీవో ద్వారా  సహాయకురాలిగా నియామకమైన మోర్ల రజిని  ఇంత వరకు వేతనం రాకపోయేసరికి  విషయాన్ని అధికారుల దృష్తికి తీసుకువెళ్లగా అసలు విషయం బయటకు పొక్కింది. దీనికి మందమర్రి సెక్టార్‌ సూపర్‌వైజర్‌ రమాదేవి బాధ్యత వహించాలని సీడీపీవో నోటీస్‌ ఇచ్చారు. అయితే అధికారులు ముందుగా మృతురాలి అకౌంట్‌ నుంచి గౌరవ వేతనాన్ని గుట్టు చప్పుడు కాకుండా వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.

కొత్త ఆయా నియామకం..
ఆదిల్‌పేట్‌ అంగన్‌వాడీ కేంద్రం ఆయా 2015లో చనిపోగా గత సంవత్సరం మే నెలలో కొత్త ఆయా కోసం నోటిఫికేషన్‌ వేసి ఫిబ్రవరి 2019 మాసంలో కొత్త ఆయాగా మోర్ల రజినిని నియమించారు. రజిని ఆరు మాసాలుగా ఆయాగా విధులు నిర్వహిస్తుంది. ఆరు నెలలుగా రజినికి గౌరవ వేతనం రాకపోవడంతో ఐసీడీఎస్‌ కార్యాలయంలో సంప్రదించగా మృతురాలు మల్లక్క అకౌంట్లోనే గౌరవ వేతనం జమ అవుతుందన్న విషయం బయటకు వచ్చింది. ఆరు నెలలుగా ఆదిల్‌పేట్‌ అంగన్‌వాడీ కేంద్రంలో ఆయా పనులు చేస్తున్నానని తనకు గౌరవ వేతనం చెల్లించాలని రజిని డిమాండ్‌ చేసింది. 

సంజాయిషీ ఇవ్వాలని...
ఆయాగా పని చేసిన మల్లక్క మృతి చెందిన విషయాన్ని తెలియజేయక పోవడంతోనే మృతురాలి బ్యాంక్‌ అకౌంట్‌లో గౌరవ వేతనం జమ అయిందని దానికి మందమర్రి సెక్టార్‌ సూపర్‌వైజర్‌ నిర్లక్ష్యమే కారణమంటూ రమాదేవికి నోటీసు పంపించారు. నోటీసులో మల్లక్క డ్యూటీ చేస్తుందని అటెండెన్సీ ఏ కారణం చేత ఇవ్వవలసి వచ్చిందో తెలపాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో రాత పూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలని తదితర అంశాలను రమాదేవికి సీడీపీవో అందించిన సంజాయిషీ నోటీసులో పేర్కొన్నారు. 

కొట్టొచ్చినట్లు అధికారుల నిర్లక్ష్యం..
ఆయాగా పని చేసిన మల్లక్క చనిపోయిన తర్వాత ఇద్దరు సూపర్‌వైజర్లు మారారు. చనిపోయినప్పుడు పని చేసిన సూపర్‌వైజర్‌ వేరు. ప్రస్తుతం సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న రమాదేవి ఆదిల్‌పేట్‌లోని అంగన్‌వాడీ ఆయా మల్లక్క చనిసోయినప్పుడు అక్కడ విధులు నిర్వహించడం లేదు. అంతే కాకుండా ఆయా చనిపోయినందుకే ఆ కేంద్రానికి ఆయా కావాలని నోటిఫికేషన్‌ వేయడం జరిగింది. 

నోటిఫికేషన్‌ ద్వారానే కొత్తగా మోర్ల రజినిని ఆయాగా నియమించడం జరిగింది. కొత్తగా నోటిఫికేషన్‌ వేసినప్పుడైనా మల్లక్క పేరును తొలగించాల్సి ఉంది. అయినా అలా జరగలేదు. దీంతో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కాని కింది స్థాయి అధికారులను బలి చేసి చేతులు దులుపుకుందామనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి బాధ్యులుగా ఉన్న ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా