సిరా మార్క్.. తిర‘కాసు’!

31 Aug, 2014 23:44 IST|Sakshi
సిరా మార్క్.. తిర‘కాసు’!

ప్రభుత్వ భూములను  పరిరక్షించాలని సర్కార్ ఆదేశం
మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భూముల జాబితా
వాటిని రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ రెడ్ ఇంకుతో మార్క్
ప్రభుత్వ ఆదేశాల్లోని లొసుగులను సొమ్ము చేసుకుంటున్న అధికారులు
మేడ్చల్: ‘ఎర్ర సిరా మార్క్’ పేరుతో కంచే చేను మేస్తోంది. ఆమ్యామ్యాలకు దాసోహమంటోంది. ప్రభుత్వ ఆదేశాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకున్న రిజిస్ట్రేషన్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. నగర శివార్లలో లక్షలాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే.. వాటిలోని లోపాలను అడ్డుపెట్టుకుని మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు రిజిస్ట్రేషన్లు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వివరాలు.. నగర శివార్లలోని విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. వాటిని అక్రమార్కులు అక్రమ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

దీంతో సదరు భూములను పరిరక్షించాలని భావించిన సర్కారు.. రెవెన్యూ శాఖ నుంచి మండలాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించి ఫలానా సర్వేనంబర్‌లో ప్రభుత్వ భూమి ఉంది.. ఆ సర్వేనంబర్‌లో రిజిస్ట్రేషన్ చేసే సమయంలో రెవెన్యూ శాఖ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలని నిబంధనలు విధించింది. ఇందులో భాగంగా మేడ్చల్ పట్టణానికి సంబంధించి ప్రభుత్వం 238 సర్వేనంబర్‌లలో దాదాపు 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని సర్వేనంబర్ల జాబితాను రెవెన్యూ అధికారులు స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి జాబితాను పంపించారు.
 
జాబితాతో సొమ్ము చేసుకుంటున్న రిజిస్ట్రేషన్ అధికారులు..
రెవెన్యూ అధికారులు పంపించిన జాబితా సబ్ రిజిస్ట్రార్ అధికారులకు కాసులు కురిపించే కల్పవృక్షంగా మారింది. రెవెన్యూ అధికారులు పంపిన సర్వేనంబర్లలో కొంత ప్రభుత్వ భూమి ఉందని పంపగా.. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మేడ్చల్ రెవెన్యూ అధికారులు పంపిన 238 సర్వేనంబర్లను ఎర్ర సిరాతో మార్కు చేస్తున్నారు.

 అవి రిజిస్ట్రేషన్ చేయడంలేదని తమకు ప్రభుత్వ ఆదేశాలున్నాయని తిరకాసులు పెడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం పంపిన సర్వే నంబర్లలో 10 గుంటల నుంచి ఎకరం వరకు ప్రభుత్వ భూమి ఉంది. దానికి అనుగుణంగా రెవెన్యూ అధికారులు  ప్రభుత్వ భూమికి శాశ్వత నంబర్ ఇచ్చి మిగతా భూమికి బై నంబర్లు ఇస్తూ పహాణీల్లో రాశారు. కొనుగోలుదార్లు, అమ్మకందార్లు సదరు స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లున్నా కూడా మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ అధికారులు మాత్రం రిజిస్ట్రేషన్ చేయడంలేదు.

రిజిస్ట్రేషన్లను పెండింగ్ డాక్యుమెంట్ కింద ఉంచుతున్నారు. పైరవీకారులు ఎంతో కొంత ముట్టజెప్పడంతో పెండింగ్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవుతోంది. ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌కు మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ అధికారులు సాధారణంగానే రూ.2-3 వేలు లాగడం సహజం. మరి ఇలాంటి కేసుల్లో వారు చేతివాటం ప్రదర్శించకుండా ఉంటారా..? ఒక్కో రిజిస్ట్రేషన్‌కు రూ. 20 వేల నుంచి రూ. 30 వేలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సదుద్దేశాన్ని అవినీతీ అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. మేడ్చల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డబ్బులిస్తేనే పనులు అవుతున్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు.
 
ప్రభుత్వ నిబంధనలు ఇవీ..
నగర శివార్లలో ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవడానికి కావాల్సిన భూములు లభ్యం కాకపోవడంతో  మేడ్చల్ వంటి పట్టణాల్లో  ఏయే సర్వేనంబర్లలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, ఏయే సర్వే నంబర్లలో రోడ్లు ఉన్నాయి, కాలనీల్లోని ఏయే సర్వే నంబర్లలో ఖాళీ స్థలం ఉంది. శ్మశాన వాటికలు, ఖబ్రస్థాన్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయి వంటి వివరాలను తెలియజేస్తూ.. ఆయా సర్వే నంబర్‌లో ఇన్ని గుంటల భూమి, లేదా ఇన్ని ఎకరాల భూమి ప్రభుత్వానికి సంబంధించినదని ఉత్తర్వులు జారీ చేసి ఆ సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఆ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు రెవెన్యూ రికార్డుల్లోని బై 1, 2, 3 లేదా అ, ఆ, ఇ వంటి వాటి గురించి పట్టించుకోకుండా అసలు నంబర్‌ను రిజిస్ట్రేషన్ లిస్టులో బ్లాక్ చేసి పెట్టారు. అమ్మకందారుడు గానీ, కొనుగోలుదారుడు గానీ రిజిస్ట్రేషన్ చేయమని అడిగితే బ్లాక్ చేసిన లిస్టును చూపుతూ అత్యవసరంగా కావాలంటే వారే ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.
 
ప్రభుత్వ నిబంధనలకు
అనుగుణంగానే: రవీందర్‌రెడ్డి, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం పంపిన సర్వేనంబర్ల జాబితాలోని సర్వేనంబర్లను రిజిస్ట్రేషన్ చేయకుండా బ్లాక్ చేశాం. అలాంటివి పెండింగ్‌లో ఉంచాం. ఎలాంటి పైరవీలకు తావివ్వకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం.

మరిన్ని వార్తలు