అవినీతిరహిత పాలనే లక్ష్యం

12 Jul, 2014 02:57 IST|Sakshi
అవినీతిరహిత పాలనే లక్ష్యం

కరీంనగర్.. స్మార్ట్‌సిటీ హోదాకు కృషి
- వీఎల్‌టీ టాక్స్‌తో ఆదాయం పెంపు
- మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన సర్దార్ రవీందర్‌సింగ్
- నల్లా కనెక్షన్ ఫైలుపై తొలి సంతకం

 సాక్షి, కరీంనగర్: అవినీతిరహిత, పారదర్శక పాలన అందించడమే లక్ష్యమని నగర పాలక సంస్థ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఆయన మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. నల్లా కనెక్షన్ ఫైలుపై తొలిసంతకం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు రూ.200 డీడీ చెల్లించి.. నల్లా కోసం దరఖాస్తు చేసుకుంటే 48 గంటల్లోగా కనెక్షన్ ఇస్తామన్నారు. దసరాలోగా నగరానికి నిరంతరం తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.
 
కార్పొరేషన్ ఆదాయం పెంచేందుకు నగరంలో రెండు గుంటల నుంచి ఎకరం వరకు ఖాళీ స్థలం ఉన్న వారి నుంచివీఎల్‌టీ టాక్స్ వసూలు చేస్తామన్నారు. నగరంలో ఎవరికి ఏ ఆపదొచ్చినా తనను, మున్సిపల్ కమిషనర్‌ను కలువొచ్చని చెప్పారు. కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదాకు కృషి చేస్తాననిపేర్కొన్నారు.
 
రోడ్లపై చెత్త వేస్తే చర్యలు
ప్రతి డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని వివరించారు.
 నగరంలో వ్యాపారులకు ముప్పై రోజుల్లోగా చెత్త బుట్టలు పంపిణీ చేస్తామన్నారు. చెత్త రోడ్లపై వేస్తే చర్యలు తప్పవన్నారు. సమస్యలను సమష్టిగా పరిష్కరించుకుందామని కార్పొరేటర్లు, అధికారులను కోరా రు. డివిజన్లలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి కోసం అల్లాడుతున్న హౌసింగ్‌బోర్డు కాలనీలో అక్కడి ప్రజల మధ్యే శనివారం అధికారులతో కలిసి సమీక్ష చేస్తామన్నారు.

రాజకీయ ఉద్యోగమిచ్చిన సీఎం కేసీఆర్‌కు మేయర్ కృతజ్ఞతలు తెలిపారు. మేయర్‌కు నగర కార్పొరేటర్లు.. అధికారులు శాలువా, పూలమాలలు వేసి అభినందన లు తెలిపారు. కాగా, అధికారులు మేయర్ చాంబర్‌లో కొత్త ఫర్నిచర్ వేశారు. నగర డెప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన గుగ్గిళ్లపు రమేశ్ చాంబర్‌లో మాత్రం పాత కుర్చీలే ఉంచారు. దీంతో అసంతృప్తికి గురైన రమేశ్ వెంటనే  కొత్త ఫర్నిచర్ తెప్పించుకున్నారు.

మరిన్ని వార్తలు