జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో అడుగడుగునా ‘అవినీతి దందా’

10 Jul, 2014 00:04 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆరోగ్యకర సమాజాన్ని తయారు చేయాల్సిన జిల్లా వైద్యశాఖకు అవినీతి రోగం పట్టుకుంది. కింది స్థాయి సిబ్బందిని గాడిలో పెట్టి.. సక్రమంగా వ్యవస్థను నడపాల్సిన ఉన్నతాధికారే అవినీతికి ద్వారాలు తెరవడంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో వసూళ్ల పర్వం కట్టలు తెంచుకుంది. ప్రైవేటు వ్యక్తుల నుంచే కాకుండా.. శాఖలో పనిచేసే ఉద్యోగుల అవసరాలను సైతం అవకాశంగా మలుచుకుని అక్రమ వసూళ్లకు పాల్పడడం డీఎంహెచ్‌ఓలో సర్వసాధారణమైంది.

ఉన్నతాధికారి కనుసన్నల్లో నడిచే ఈ తంతులో కొందరు ఉద్యోగులు చేతులు కలపడంతో వ్యవహారం సాఫీగా సాగింది. ఈ వ్యవహారాన్ని శోధించిన ‘సాక్షి’ గతేడాది డిసెంబర్ 21, 23తేదీల్లో వరుసగా కథనాలు ప్రచురించింది. కీసర మండలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వసూళ్ల పర్వం.. పలు ఆస్పత్రులకు చేతి రాత నోటీసులిచ్చి అక్రమాలకు పాల్పడే అంశాలతో డీఎంహెచ్‌ఓ వ్యవహారాన్ని ఎండగట్టింది. ఈ వ్యవహారాన్ని అప్పటి కలెక్టర్ బి.శ్రీధర్ తీవ్రంగా పరిగణిస్తూ.. వైఖరి మార్చుకోవాలంటూ డీఎంహెచ్‌ఓ సుధాకర్‌నాయుడును హెచ్చరించారు. అయినప్పటికీ వైఖరి మార్చుకోని డీఎంహెచ్‌ఓ వసూళ్లకు తెగబడ్డారు.

 దీంతో డీఎంహెచ్‌ఓకు షోకాజ్ నోటీసు జారీ చేయడంతోపాటు అక్రమాలపై విచారణ చేయాలంటూ డీఆర్‌ఓను ఆదేశించారు. ఆ తర్వాత ఎన్నికలు ముంచుకురావడంతో ఈ అంశం అటకెక్కింది. తాజాగా ఈయన అక్రమాలకు విసిగివేసారిన కొందరు ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు బుధవారం చాకచక్యంగా అవినీతి నిరోధకశాఖకు పట్టించి అక్రమాలకు తెరదించారు.

>
మరిన్ని వార్తలు