లంచం ఇస్తేనే ఆపరేషన్లు

21 Jul, 2014 00:39 IST|Sakshi
లంచం ఇస్తేనే ఆపరేషన్లు

‘ఖని’ ధర్మాస్పత్రికి అవినీతి రోగం

గోదావరిఖని ధర్మాస్పత్రికి అవినీతి రోగం పట్టుకుంది. ఇక్కడ లంచం ఇవ్వనిదే శస్త్రచికిత్సలు చేయడం లేదు. చివరికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా నిర్వహించాల్సిన శస్త్రచికిత్సలను సైతం లంచం కోసం పక్కన పెడుతున్నారు. ఏడాదిన్నరలో కనీసం ఒక్క కేసు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా నిర్వహించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నెలల తరబడి పేషెంట్లు శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు. ధర్మాస్పత్రిని నమ్ముకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్న నిరుపేద ప్రజలను ప్రతీ పనికి ఓ రేటంటూ జలగాల్లా పీడిస్తున్నారు. ఆస్పత్రిలో కొందరు వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేందని పేషెంట్లు నిలదీస్తే ‘పైసలిస్తే పదినిమిషాల్లో ఆపరేషన్ అవుద్ది..ఆలోచించుకో’ అంటూ బహిరంగంగానే ఉచిత సలహాలిస్తున్నారు. అధికారు లు ఈ అవినీతిపై మౌనంగా ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం ‘సాక్షి’ ఆస్పత్రిని సందర్శించగా పలువురు పేషెంట్లు తమ బాధలు వెల్లడించారు.                                                - కోల్‌సిటీ
 
రెండు నెలలు ఇన్‌పేషెంట్‌గా..
గోదావరిఖని ఫైవింక్లయిన్‌కాలనీకి చెందిన ఐల వేణి రాజమ్మకు పిత్తాశయంలో రాళ్లు (గాల్‌బ్లాడర్ స్టోన్స్) రావడంతో కొంత కాలం నుంచి తల్లడిల్లుతోంది. రెండున్నర నెలల క్రితం పరీక్ష చేయించుకోగా, ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు సూచించారు. రెండు నెలలుగా రాజమ్మ ఆస్పత్రిలో ఇన్‌పేషంట్‌గా అడ్మిట్ అయి శస్త్రచికిత్స కోసం ఎదురుచూస్తోంది. నెల క్రితం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కూడా ఈమెకు శస్త్రచికిత్స నిర్వహణ కోసం అనుమతి ఇచ్చింది. అయితే మొదట మత్తు డాక్టర్ లేడని, తర్వాత గుండె సంబంధిత సమస్య ఉందని, ఆ తర్వాత వయస్సు ఎక్కువగా ఉండడంతో శస్త్రచికిత్సకు రాజమ్మ శరీరం సహకరించదని పొంతనలేని సమాధానాలు చెబుతూ ఆపరేషన్ చేయకుండా జాప్యం చేస్తూ వచ్చారు. బాధితురాలి బంధువులు నిలదీస్తే కరీంనగర్‌కు రెఫర్ చేస్తున్నామని చెప్పి చేతులు దులుపుకున్నారు. రాజమ్మతోపాటు ఆమె కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
 
రూ. 5 వేలు లంచం ఇచ్చినా..
కమాన్‌పూర్ మండలం రాణాపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు మెడగోని కొమురయ్యగౌడ్ హెర్నియాతో మూడు నెలలుగా బాధపడుతున్నాడు. నెల క్రితం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు చూపించగా, శస్త్రచికిత్స చేస్తామని చె ప్పి అడ్మిట్ చేసుకున్నారు. 21 రోజులుగా కొమురయ్య ఆస్పత్రిలో ఇన్‌పేషంట్‌గా చికిత్స పొందుతున్నాడు. బెడ్ ఇవ్వాలంటే రూ. 700 చెల్లించాలని డిమాండ్ చేయడంతో డబ్బులు క ట్టినట్లు బాధితుడు ఆరోపించాడు. ‘పే-రూం’ పేరుతో రోజుకు రూ. 100 చొప్పున తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆపరేషన్ లేటవుతుందనడంతో ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ ప్రైవేట్ సెక్యూరిటీగార్డు అడిగినప్పుడు రూ. 5 వేలు ఇచ్చినట్లు వివరించాడు. ఈ డబ్బులు డాక్టర్‌కు ముట్టజెప్పానని, రెండు రోజుల్లో ఆపరేషన్ చేస్తారని అతడు చెప్పాడని, మూడు రోజులు గడిచినా ఇప్పటికీ ఆపరేషన్ చేయలేదని బాధితుడు వాపోయాడు. అలాగే స్థానిక కృష్ణానగర్‌కు చెందిన కాశిపేట దుర్గమ్మ అనే వృద్ధురాలు అదుపుతప్పి కిందపడిపోయింది. వారం క్రితం ఆమెను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చే స్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆమెను పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్పత్రిలోని అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు