అవినీతికి అడ్డాలుగా పీఏసీఎస్‌లు!

12 Oct, 2015 02:03 IST|Sakshi

ఇబ్రహీంపట్నం: ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు అండగా నిలవాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అవినీతి కూపంలో కూరుకుపోతున్నాయి. పాలకవర్గాలు, అధికారులు కుమ్మక్కై డబ్బు కొల్లగొడుతున్నారు. చేయని తప్పులకు రైతులను బాధ్యులను చేస్తున్నాయి. రుణాలు చెల్లించినా చెల్లించలేదని రికార్డుల్లో ఉండడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మండల పరిధిలోని రాచకొండ దండుమైలారం కో- ఆపరేటివ్ బ్యాంకులో రూ. 26 లక్షల అక్రమాలు జరిగినట్లు శనివారం వెలుగుచూసింది.

ఈ బ్యాంకులో మొత్తం 1247 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. అక్రమార్కులు తొలి విడత రుణ మాఫీ నిధుల్లో 50 శాతం సొమ్ము, బ్యాంకు నిర్వహణ ఖర్చుల కింద రూ. 4 లక్షల నిధులు కాజేశారు. రైతులకు తెలియకుండానే వారి పేర్లపై బంగారం, దీర్ఘ, స్వల్ప కాలిక పంట రుణాలు తీసుకున్నట్లుగా రికార్డుల్లో ఉంది.

ఫోర్జరీ సంతకాలు, బినామీ పేర్లు, నకిలీ పాసుపుస్తకాలతో ఈ తతంగం సాగింది. బ్యాంకులో ఇప్పటి వరకు సుమారు రూ. 26 లక్షల అక్రమాలు వెలుగు చూశాయని విచారణ అధికారి నర్సింహారెడ్డి చెప్పారు. బ్యాంకు సీఈఓ సయ్యద్ మక్బుల్ మరికొందరితో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఏవిధమైన చర్యలు తీసుకుంటారోనని సర్వత్రా చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు