గరీబోళ్ల భూములపై గద్దలు!

5 Oct, 2014 01:36 IST|Sakshi
గరీబోళ్ల భూములపై గద్దలు!

 దళిత భూ పంపిణీలో అవినీతి
 
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/కొండాపూర్:  ప్రతి నిరుపేద దళితుణ్ణి మూడు ఎకరాల సాగు భూమికి ఆసామిని చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన దళితులకు భూమి పంపిణీ పథకం ప్రహసనంగా మారుతోంది. భూమి కొన్నది ముగ్గురి దగ్గర నుంచే.. పంచింది కూడా ముగ్గురికే కానీ, ఈ ముగ్గురిని.. ఆ ముగ్గురిని కలిపి ఓ గ్రామ సర్పంచ్ భర్త అనుచరులు, మధ్యవర్తులు కలసి ముప్పై ఆరు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. పథకం మొదలైంది కేవలం నాలుగైదు మండలాల్లో మాత్రమే.. కానీ అప్పుడే అవినీతి వ్యవహారం వెలుగు చూడటంతో దళిత వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

తొలివిడత కింద 9 నియోజకవర్గాల్లో కనీసం 167మంది రైతులకు మూడు ఎకరాల చొప్పున 900 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం కోసం 40 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో 6 మంది.. ముఖ్యమంత్రి చేతుల మీదుగా గోల్కొండ కోట వద్ద పట్టాలు తీసుకోగా.. 34 మంది దళిత మహిళలు మంత్రి హరీష్‌రావు చేతుల మీద సంగారెడ్డిలో పట్టాలు తీసుకున్నారు.
 
ఎమ్మార్వో పేరు చెప్పి..
కొండాపూర్ మండలం మారేపల్లిలో 11 మంది మహిళలు మొదటి విడత పంపిణీకి అర్హులని, ఇందుకోసం 33 ఎకరాల భూమి అవసరం అవుతుందని అధికారులు నిర్ధారించారు. మారేపల్లి శివారులోని అనంతసాగర్ గ్రామాలకు చెందిన రైతులు మడిగెల శేఖర్, రామప్ప, అమృతమ్మల వద్ద నుంచి 41 సర్వే నంబర్‌లో ప్రభుత్వం తొమ్మిది ఎకరాలను కొనుగోలు చేసింది. అధికారులు, గ్రామ కమిటీ కలసి ఎకరాకు రూ 3.50 లక్షలు నిర్ధారణ చేయగా ప్రభుత్వం పూర్తి డబ్బును చెక్కు రూపంలో రైతులకు చెల్లించింది. ఈ భూమిని మచుకూరి చంద్రకళ, లక్ష్మి, పట్లూరి సుజాత అనే దళిత మహిళలకు పంపిణీ చేశారు.

అయితే భూమి ధర నిర్ణయంలో, లబ్ధిదారుల ఎంపికలో సర్పంచ్ భర్త అనుచరులు కీలక పాత్ర పోషించారు. పంపిణీ కార్యక్రమం మరుసటి రోజు నుంచే సర్పంచ్ భర్త అనుచరులు తమకు కాగితాల ఖర్చులు, అధికారుల రాకపోకలకు ఖర్చులు అయ్యాయని చెప్పి లబ్ధిదారుల నుంచి మనిషికి రూ. 10 వేలు చొప్పున తీసుకున్నారు. ఇక పట్టాదారులపై వల విసిరారు. తమ వల్లే భూమికి ఎక్కవ ధర వచ్చిందని, రూ 2 లక్షలు కూడా పలకని భూమిని రూ 3.50లక్షలు ఇప్పించాము కాబట్టి ఎకరాకు రూ 50 వేల చొప్పున తమకు ఇవ్వాలని  రైతులను డిమాండ్ చేస్తున్నారు.

ప్రధాన అనుచరుడు మల్లేష్ ద్వారానే ఈ దందా నడిచినట్లు తెలుస్తోంది. పై అధికారుల నుంచి సర్పంచ్ మీద ఒత్తిడి ఉందని, ఎమ్మార్వోకు కూడా డబ్బులు ఇవ్వాలంటూ రైతుల్ని బెదిరిస్తున్నారు. ఎకరాకు రూ. 50 వేలు ఇస్తేనే భూమి తీసుకుంటామని, లేదంటే మీ భూమి మీరు తీసుకోండి అంటూ మధ్యవర్తి రైతులను బెదిరిస్తుండగా సాక్షి పేపర్, సాక్షి టీవీ రికార్డు చేసింది. కాగా బెదిరింపులు మేం భరించలేమని ప్రభుత్వం కోరితే ఇచ్చిన భూమి వెనక్కి తీసుకుంటామని రైతులు ఆవేదన తో ‘సాక్షి’తో చెప్పారు.

మరో ట్విస్ట్..
అధికారులు ముగ్గురు మహిళలకు మూడు ఎకరాల చొప్పున భూమి పంపిణీ చేస్తూ పట్టాలిచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా లబ్ధిదారులకు ఒక మెలికపెట్టారు. పట్టాలు ఇచ్చినప్పటికీ వాళ్లు ఈ ఏడాది సాగు చేసుకోవడానికి వీల్లేదని మెలికపెట్టారు. ఇప్పటికే వెంకయ్య అనే కౌలు రైతు చేతిలో ఉన్న ఈ భూమిని, ఆయన కౌలు గడువు ముగిసిన తర్వాతనే కబ్జాలోకి వెళ్లాలని ఆధికారులు ఆదేశించడంతో పాపం లబ్ధిదారులు సంతోషపడలేక, బాధపడలేక మౌనంగా ఉండిపోయారు.

డబ్బులు ఇవ్వకుంటే..
నేను సర్కారుకు మూడు ఎకరాలు అమ్మిన. ఎకరానికి రూ. 3.50 లక్షల చొప్పున ఇచ్చిండ్రు. ఈ డబ్బుల నుంచి రూ. 80 వేలు ఇవ్వమని పెద్దపటేల్ అనుచరులు మధ్యవర్తితో సెప్పుతుండు. గన్ని పైసలు ఎట్టా ఇత్తా పటేలా అంటే ఇంటలేడు. తాశీల్దారు గీతమ్మకు ఇయ్యాలనిజెప్పి ఒక్కటే గాయ్..గాయ్ జేస్తుండు. ‘డబ్బులు మాత్రం ఎవరికీ ఇవ్వొద్దని’ తాశీల్దార్ మేడం స్వయంగా నాతో చెప్పారు. కానీ మధ్యవర్తులు రూ .80వేలు ఇత్తవా? లేదా? అంటూ బెదిరిస్తున్నారు. నా భర్త చనిపోయాడు. బిడ్డ పెళ్లిజేసిన అప్పులు మీద పడ్డయ్. భూమి అమ్మి అప్పులు కట్టుకున్న. ఇప్పుడు సర్పంచు భర్త మనుషులు వచ్చి డబ్బులు ఇవ్వకుంటే భూమి లాక్కుంటామని బెదిరిస్తున్నారు.

- మడిగెల అమృతమ్మ, అనంతసాగర్

మరిన్ని వార్తలు