రిమ్స్ ఆస్పత్రిలో అవినీతి రాజ్యం

7 May, 2014 03:00 IST|Sakshi
రిమ్స్ ఆస్పత్రిలో అవినీతి రాజ్యం

అబ్బాయి పుడితే రూ.800.. అమ్మాయి పుడితే రూ.500..గ్రూపులుగా మారి వసూళ్ల దందా బాధితులను పీక్కుతింటున్న సిబ్బంది    కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
 
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : రిమ్స్ ఆస్పత్రిలో అవినీతి రాజ్యమేలుతోంది. వైద్యం కోసం వచ్చే పేదల నుంచి సిబ్బంది డబ్బులు దండుకుంటున్నారు. ముఖ్యంగా ప్రసూతి విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. పుట్టిన బాబుకు, పాపకు ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రిని నిర్వహిస్తున్నా.. రూ.వేల జీతా లు తీసుకుంటున్న సిబ్బంది అక్రమమార్గంలో వసూళ్ల పర్వం మొదలుపెట్టారు. ఆస్పత్రికి రోజూ సుమారు 30 నుంచి 40 ప్ర సూతి కేసులు వస్తుంటాయి. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.1,000 నుంచి రూ.1,500 వరకు బంధువుల నుంచి సిబ్బంది వసూలు చేస్తున్నారు. కానీ రిమ్స్ ఉన్నతాధికారులు మాత్రం ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
 
 గ్రూపులుగా వసూళ్లు
 ప్రసూతి కోసం వచ్చిన మహిళా బంధువుల నుంచి ప్రసూతి విభాగం సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది గ్రూపులుగా మారి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముందుగా ఆస్పత్రికి వచ్చిన మహిళను ప్రసూతి విభాగంలో చేర్పిస్తారు. అక్కడి సిబ్బంది ఆపరేషన్‌కు సంబంధించిన దుస్తులు మహిళ ధరించిన తర్వాత రూ.200 తీసుకుంటారు. ఆ తర్వాత డెలివరీ అయిన వెంటనే ఆపరేషన్ థియేటర్‌లో ఉండే ఇద్దరు సిబ్బంది పుట్టిన పాపకు లెక్కకట్టి మరీ వసూలు చేస్తారు.

బాబు పుడితే రూ.800, పాప పుడితే రూ.500 తీసుకుంటారు. సదరు బంధువులు డబ్బులు ఇచ్చేంత వరకు పుట్టిన బిడ్డను వారి చేతికివ్వకుండా ఇబ్బంది పెడతారు. దీంతో ఏం చేయలేని పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చి బిడ్డను తీసుకుంటారు. ఇవేకాకుండా అదనంగా అక్కడి నుంచి ప్రసూతి వార్డుకు తరలించేందుకు వార్డు బాయ్‌కి రూ.100, ప్రసూతి వార్డులో పడక చూపించిన సిబ్బందికి రూ.300, పుట్టిన బిడ్డకు ఆయిల్ రాసి శుభ్రం చేసే సిబ్బందికి రూ.200 ఇలా ఎక్కడి సిబ్బంది అక్కడే దోచుకుంటున్నారు.

మొత్తంగా సుమారు రూ.1500 వరకు వసూలు చేయందే విడిచిపెట్టరు. ఎవరికి ఎంతెంత డబ్బులు ఇవ్వాలనేది కూడా సిబ్బంది ముందుగానే బాధితులకు చెబుతారు. తాము 10 నుంచి 15 మంది ఉంటామని, మీరిచ్చిన డబ్బులు అందరం పంచుకుంటామని స్వయంగా వారే చెప్పడం గమనార్హం. ప్రసూతి వార్డుకు తల్లిని, బిడ్డను తీసుకెళ్లిన తర్వాత ఒక మహిళ సిబ్బంది వచ్చి డబ్బులు వసూళు చేసుకొని వెళ్తొంది. ఆ తర్వాత మరో మహిళ సిబ్బంది వచ్చి అంతకుముందు ఇచ్చిన డబ్బులు తమకు కావని వారు ఆపరేషన్ థియేటర్ సిబ్బంది అంటూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి డబ్బుల కోసం మహిళ బంధువులు పీక్కుతింటున్నారు. ఒకవేళ సిబ్బంది అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే వారికి నరకం చూపేడుతున్నారు. ఇక గిరిజన మహిళల పరిస్థితి మరీ దారుణం.
 
 కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
 రిమ్స్‌లోని ప్రసూతి వార్డులో జరుగుతున్న అవినీతి గురించి స్వయంగా కలెక్టర్ అహ్మద్ బాబుకు బాధితులు ఫిర్యాదు చేశారు. గతేడాది ఆగష్టులో రిమ్స్ తనిఖీలకు వచ్చిన కలెక్టర్‌ను కలిసిన కొంత మంది బాధితులు తమ నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని విన్నవించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసూతి వార్డులో ఉన్న సిబ్బందిని వేరే వార్డుల్లోకి మార్చాలని రిమ్స్ అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అయినప్పటికి కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ సిబ్బంది వసూళ్ల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రసూతి వార్డు ఇన్‌చార్జీ అధికారులు ఈ విషయాన్ని మామూలుగా తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని ఎవరికైన చెబితే ఎక్కడ మళ్లీ తమను హింసిస్తారనే భయంతో బాధితులు నోరు మెదపడం లేదు. ఏదేమైన ప్రసూతి వార్డులో అవినీతి కంపును తొలగించాలని పలువురు కోరుతున్నారు.
 
దృష్టి సారిస్తాం..
రిమ్స్ ప్రసూతి వార్డులో డబ్బులు వసూలు చేసే సిబ్బంది చర్యలు తీసుకుంటాం. ఇకపై సిబ్బంది డబ్బులు తీసుకుంటున్నారనే దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. గతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ వార్డులో ఉన్న సిబ్బందిని వేరే వార్డుకు బదిలీ చేయడం జరిగింది. ఆస్పత్రికి వచ్చిన వారిని సిబ్బంది డబ్బులు అడిగితే తమకు ఫిర్యాదు చేయాలి. సదరు సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటాం.
 - డాక్టర్ శశిధర్, రిమ్స్ డెరైక్టర్

మరిన్ని వార్తలు