రూ.10 వేలిస్తే... వంద రాశారు!

13 Nov, 2017 02:25 IST|Sakshi

‘దేవాదాయ’అధికారుల అవినీతి కథ

సికింద్రాబాద్‌ ఆలయంలో నకిలీ రశీదులతో భారీగా స్వాహా

ప్రసాదాల సరుకులు దుకాణాలకు అమ్ముకున్న వైనం

నల్లగొండలో జాతర పేరుతో అవినీతి పర్వం

పాత వరంగల్‌లో పూజారుల వేతనాలు స్వాహా

అవినీతిపై నివేదికలందినా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు

సీఎం కార్యాలయానికి ఫిర్యాదులతో చర్యలపై మంత్రి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ రశీదు పుస్తకాలతో రూ. లక్షల్లో ఒకరు దోచుకుంటే.. జాతర పనులంటూ తప్పుడు బిల్లులు పెట్టి మరొకరు నిధులు జేబులో వేసుకున్నారు.. ఇంకొకరేమో ఏకంగా అర్చకుల వేతనాలే స్వాహా చేశారు.. ఇంతలా అవినీతికి పాల్పడిన అధికారులపై ఆధారాలతో సహా దేవాదాయ కమిషనర్‌కు విజిలెన్స్‌ విభాగం నివేదిక సమర్పిస్తే చర్యలు తీసుకోవాల్సిన కమిషనర్‌ కార్యాలయం వారిపై ఈగ వాలకుండా చూసుకుంటోంది. రాజకీయ నేతల అండదండలున్నాయని కాలయాపన చేస్తోంది.
 
చందాల దందా
సికింద్రాబాద్‌ ప్రాంతంలోని ఓ ప్రముఖ దేవాలయం.. నిత్యం అన్నదానాలు జరుగుతుండటంతో భక్తుల విరాళాలు ఎక్కువగానే ఉంటాయి.. కానీ ఓ ఉన్నతాధికారి మాత్రం రూ.10,000 విరాళమిస్తే రూ.100గా రిజిస్టర్‌లో రాయటం, నకిలీ రశీదులివ్వటం మొదలుపెట్టాడు. ఏటా రూ.కోటి వరకు అందే విరాళాలు ఒక్కసారిగా పడిపోవటంతో అనుమానమొచ్చిన దేవాదాయ శాఖ విజిలెన్స్‌ అధికారులు విచారణ జరిపారు.

కొందరు దాతలను సంప్రదించి వారిచ్చిన మొత్తం, ఆలయ రిజిస్టర్‌లో నమోదైన మొత్తం తనిఖీ చేసి సొమ్ము స్వాహా చేస్తున్నట్లు రూఢీ చేసుకున్నారు. అలాగే ప్రసాదాలకు సంబంధించిన సరుకులు అయిపోయాయని తప్పుడు ఇండెంట్‌లు పెట్టి మళ్లీ సరుకులు కొనటం, తిరిగి దుకాణాలకు తరలించి ఆ మొత్తం స్వాహా చేస్తున్నట్లూ గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్సు అధికారులు కమిషనర్‌కు సమగ్ర నివేదిక సమర్పించారు.  

అవినీతి ‘జాతర’
నల్లగొండ జిల్లాలోని ఓ ప్రముఖ దేవాలయమది. అక్కడ ఏటా జరిగే జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయానికి కార్యనిర్వహణాధికారి లేకపోవటంతో మరో దేవాలయ అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. అంతే.. ఆ దేవాలయాన్ని అక్రమ సంపాదనకు కేంద్రంగా మలుచుకున్నాడు ఆ అధికారి. నిబంధనలకు విరుద్ధంగా సిబ్బందిని నియమించుకుని వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు.

జాతర అభివృద్ధి కార్యక్రమాల పేరుతో నకిలీ బిల్లులు పెట్టి రూ.లక్షల్లో మేశాడు. ఆలయ నిధులూ స్వాహా చేశాడు. ప్రసాదాల సామాను కొనుగోలులోనూ హస్తలాఘవం ప్రదర్శించాడు. దీనిపై ఉన్నతాధికారులకు భారీగా ఫిర్యాదులు అందటంతో విజిలెన్స్‌ అధికారులు దర్యాప్తు చేసి భారీగా అక్రమాలు జరిగాయని కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. తర్వాత ఆ అధికారిని అక్కడి నుంచి తప్పించారు. కానీ కొందరు ఎమ్మెల్యేలతో సిఫార్సు చేయించుకుని ఆయన అక్కడే తిష్ట వేశాడు. తప్పని పరిస్థితిలో ఇటీవల అసలు దేవాలయానికే పరిమితమయ్యాడు.    


అర్చకుల జీతాలు స్వాహా
పూర్వపు వరంగల్‌ జిల్లాలోని ఈ ప్రముఖ దేవాలయంలో ఓ అధికారి ఏకంగా అర్చకుల జీతాలనే స్వాహా చేశాడు. ఆలయంలో అభివృద్ధి పనుల పేరుతో నిధులు స్వాహా చేసినట్టు కమిషనర్‌ కార్యాలయానికి ఫిర్యాదులు రావటంతో విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేసి నిజమేనని తేల్చి నివేదిక సమర్పించారు. కాగా, ఈ మొత్తం వ్యవహారంపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. కమిషనర్‌ కార్యాలయాన్ని నిలదీశారు. అవినీతి వ్యవహారం సీఎం కార్యాలయం దృష్టికి వెళ్లటంతో చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు