కాస్మొటిక్‌ చార్జీల పెంపు లేనట్లే..!

14 Apr, 2017 01:39 IST|Sakshi
కాస్మొటిక్‌ చార్జీల పెంపు లేనట్లే..!

తొమ్మిదేళ్ల క్రితం పెరిగిన కాస్మొటిక్‌ చార్జీలు
పెరిగిన ధరలతో సంక్షేమ విద్యార్థులకు ఇబ్బందులు
బడ్జెట్‌లో మెస్‌ చార్జీల పెంపుతో సరిపెట్టిన ప్రభుత్వం
కాస్మొటిక్‌ చార్జీలపై దాటవేత.. అటకెక్కిన ప్రతిపాదనలు


సాక్షి, హైదరాబాద్‌: కాస్మొటిక్‌ చార్జీల విషయంలో సంక్షేమ వసతిగృహ విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఇటీవల బడ్జెట్‌ సమావేశా ల్లో హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ చార్జీలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. కాస్మొటిక్‌ చార్జీల ఊసు  ఎత్తలేదు. దీంతో ఈ పెంపు కోసం ఏళ్లుగా చూస్తున్న విద్యార్థులు.. పాత చార్జీలతోనే సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తొమ్మిదేళ్లుగా అవే చార్జీలు..
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలో 1,650 వసతిగృహాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2.89 లక్షల మంది విద్యార్థులున్నారు. సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు రెండు కేటగిరీల్లో కాస్మొటిక్‌ చార్జీలను ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి నెలా ఏడో తరగతిలోపు ఉన్న బాలికలకు రూ.55, పదో తరగతిలోపున్న బాలికలకు రూ.75 చొప్పున ఇస్తోంది. అలాగే ఐదు నుంచి పదో తరగతి లోపు బాలురకు కాస్మొటిక్‌ చార్జీల కింద రూ.50, హెయిర్‌ కటింగ్‌ కోసం రూ.12 చొప్పున మొత్తం రూ.62 అందిస్తోంది. తొమ్మిదేళ్లుగా ఒకే రకమైన చార్జీలు ఇస్తుండటం.. మారిన పరిస్థితులకు అనుగుణంగా చార్జీలు పెరగకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

 హెయిర్‌ కటింగ్‌కు నెలకు రూ.12 ఇవ్వడంతో చాలా హాస్టళ్లలోని విద్యార్థులు రెండు, మూడు నెలలకోసారి హెయిర్‌ కటింగ్‌ చేయిస్తున్నారు. కాస్మొటిక్‌ చార్జీల కింద ఇచ్చే మొత్తంతో సబ్బులు, నూనె, పౌడర్‌ తదితర వస్తువులు కొనుగోలు చేయాలి. కానీ ప్రభుత్వం అత్తెసరు చార్జీలు ఇవ్వడంతో విద్యార్థులు నాణ్యతలేని సబ్బులవైపు చూస్తున్నారు. కొందరైతే శరీరానికి, బట్టలు ఉతికేందుకు ఒకే సబ్బును వినియోగిస్తున్నారు. బాలికల విషయంలోనూ ఇలాంటి ఇబ్బందులే ఉన్నాయి.

ప్రభుత్వం నుంచి స్పందన కరవు..
సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల కాస్మొటిక్‌ చార్జీలను 2008–09 విద్యాసంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పెంచారు. అప్పట్లో అమల్లో ఉన్న చార్జీలను రెట్టింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత చార్జీల పెంపు కోసం విద్యార్థి సంఘాలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినా పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. అనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.

తాజా బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా సంక్షేమ శాఖలు మెస్‌ చార్జీలు, కాస్మొటిక్‌ చార్జీల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. బాలురకు కనిష్టంగా రూ.125, బాలికలకు రూ.200 చొప్పున ఇచ్చేలా ప్రతిపాదనలు తయారు చేసి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రుల బృందానికి సమర్పించాయి. అయితే మెస్‌ చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్‌ శాసనసభలో ప్రకటన చేసినప్పటికీ కాస్మొటిక్‌ చార్జీల పెంపు ఊసెత్తలేదు. ఆ తర్వాత ప్రత్యేక ప్రకటన చేస్తారని భావించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో ఈ ఏడాది కాస్మొటిక్‌ చార్జీలు పెరిగే అవకాశం లేదని స్పష్టమవుతోంది.

మరిన్ని వార్తలు