మేత..మోత

7 Mar, 2017 19:06 IST|Sakshi
► మూగజీవాల గ్రాసం కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలు
► వరిగడ్డి, కంది, వేరుశనగ పొట్టుకు డిమాండ్‌ పెంచిన వైనం
► ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుకు వెనకాడని పాడిరైతులు
 
హన్వాడ : రోజురోజుకు ఉష్ణోగ్రతలు మారుతున్నకొద్దీ ఎండాకాలం ముంచుకొస్తుంది. పెనంలా మాడే ఎండల కారణంగా మూగజీవాలు రాబోయే రోజుల్లో మేతకు అలమటించనున్నాయి. ఈ పరిస్థితిని ముందే పసిగడుతున్న కాపరులు ముందస్తు మేతలను నిల్వ చేసుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇందుకు ఆయా పొలాల రైతుల నుంచి పశువుల మేతకోసం వరి, జొన్నచొప్పలను తీసుకుంటున్నారు. వీటితోపాటు మేకలు, గొర్రెల మేతకోసం కంది, వేరుశనగ పొట్టులను కొనుగోలు చేస్తున్నారు. దీన్ని గుర్తించిన పలువురు రైతులు, మూగజీవాల రైతుల నుంచి అధిక మొత్తంలో ఆశించేందుకు అమాంతం రేట్లు పెంచేస్తున్నారు. దీంతో మూగజీవాల మేత కోసం ఎంతకైనా సరేనని పాడిరైతులు కొనుగోలుకు వెనుకాడటంలేదు. 
 
భారంగామారిన గ్రాసం: మూగజీవాల మేతకోసం పాడిరైతులు, మేకలు, గొర్రెల కాపర్లకు కష్టాలు మొదలయ్యాయి. మండలంలో పలువురు గొర్రెలకాపర్లు ఈపాటికే ఇతర ప్రాంతాలకు మేతల కోసం, గొర్రెల తరలింపు కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొందరు రైతులు ఇక్కడే ముందస్తు మేతను సమకూర్చుకుంటున్నారు. ఇందుకోసం వేరుశనగ పొట్టును ఎకరానికి రూ.8నుంచి రూ.10వేల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మండలంలో మొత్తం 30వేల గొర్రెలు, 10వేల వరకు మేకలున్నాయి. అయితే వీటన్నింటికీ ముందస్తు మేత సమకూర్చుకోవాలంటే ఈ రబీలో 800ఎకరాల్లో సాగైన వేరుశనగ పొట్టును కొనుగోలు చేసినా.. వాటికి సరిపోయే పరిస్థితులు కనిపించడం లేదు.
 
ఓ వైపు వేరుశనగకు సరైన నీరందక దిగుబడి కూడా తగ్గడంతో రైతులు కనీసం పొట్టుతోనైనా లోటును పూడ్చుకోవాలనే ఆలోచనతో ఎకరానికి రూ.8నుంచి రూ.10వేల వరకు విక్రయిస్తుండటంతో.. కాపర్లు తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయక తప్పడంలేదు. ఇదిలా ఉండగా పాడిరైతులకు మాత్రం ప్రభుత్వం 75శాతం రాయితీతో జొన్నవిత్తనాలు విక్రయిస్తోంది. మండలంలో మొత్తం 40వేలకు పైగా ఉన్న పాడి సంపదకు ఇప్పటివరకు పశువైద్య సిబ్బంది 1300ల కిలోల జొన్నవిత్తనాలను విక్రయించారు. మరికొందరు రైతులు 1010రకం వరిగడ్డిని ట్రాక్టర్‌లోడుకు రూ.7నుంచి 9వేలు వెచ్చిస్తున్నారు. హంసరకం వరిగడ్డిని పశువులు ఇష్టంగా తినడంతో దీనికి ట్రాక్టర్‌లోడుకు రూ.12వేలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.
 
 
మరిన్ని వార్తలు