కొంప ముంచిన ‘కోటరీ’

14 Dec, 2018 12:03 IST|Sakshi

సుదీర్ఘ రాజకీయ అనుభవం... పోల్‌ మేనేజ్‌మెంట్‌లో దిట్ట... ఎన్నికలకు ముందు అందివచ్చిన అధికారం... నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి... కేసీఆర్‌ చరిష్మా.. కారు జోరు... ఇవేవీ తాండూరులో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ఓటమిని నిలువరించలేకపోయాయి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి పోటీ చేసిన నాయకుడి ముందు ఈయన రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం ఏమాత్రం పనిచేయకుండాపోయింది. మహేందర్‌రెడ్డి చుట్టూ ఉన్న కోటరీయే దీనికి ప్రధాన కారణమని అటు నియోజకవర్గంతో పాటు ఇటు జిల్లా రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.  

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా ప్రజలు, క్షేత్రస్థాయి నాయకులు కొంతకాలంగా మహేందర్‌రెడ్డిని నేరుగా కలిసే అవకాశం లేకుండా పోయింది. తన చుట్టూ ఎప్పుడూ ఉండే నలుగురైదుగురు నాయకులు వ్యవహరించిన తీరు కారణంగానే ఆయన ప్రజలకు దూరమయ్యారనే వాదన వినిపిస్తోంది. మంత్రిగా చేసిన అభివృద్ధి విషయంలో ప్రజలు తప్పుపట్టకపోయినా, కనీసం ఆయన్ను కలవాలంటే కూడా కష్టమైందనే భావనతోనే ఓట్లు వేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోటరీతో పాటు మరికొన్ని చిన్నా చితకా కారణాలు కూడా మాజీ మంత్రి ఓటమికి కారణాలయినప్పటికీ ప్రజలకు దూరంగా చుట్టూ ఉన్న నలుగురితోనే కార్యకలాపాలు నడపడమే ప్రధాన కారణమైందని తెలుస్తోంది.  

బ్రహ్మాస్త్రం ఎందుకో..? 
మహేందర్‌రెడ్డి ఓటమికి మరికొన్ని అంశాలు కూడా కారణమయ్యాయి. అక్కడ సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ తరఫున పి.మహేందర్‌రెడ్డి అనే మరో నాయకుడు బరిలో ఉన్నారు. ఇద్దరి పేర్లు మహేందర్‌రెడ్డి కావడం, ఇద్దరి గుర్తులు (కారు, ట్రక్కు) పోల్చుకోలేని విధంగా ఉండడంతో ట్రక్కు గుర్తుకు 2,600 ఓట్లకు పైగా పోలయ్యాయి. మహేందర్‌రెడ్డి ఓడిపోయింది కూడా కేవలం 2,875 ఓట్లతోనే. రాజకీయ వ్యూహంలో భాగంగా తన పేరున్న వ్యక్తితో నామినేషన్‌ వేయించి తన ఎన్నికల గుర్తుతో సామీప్యత ఉన్న గుర్తు వచ్చేలా ప్రత్యర్థి పోటీలో పెట్టినప్పటికీ దాన్ని సరిగ్గా గ్రహించడంలో, ఈ విషయాన్ని తన కేడర్‌లోకి బలంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఇదే ఆయన పుట్టి ముంచింది.

దీనికి తోడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పైలెట్‌ రోహిత్‌రెడ్డిపై వ్యవహరించిన తీరు ఆయనపై సానుభూతి పెరిగే విధంగా చేసిందనే విమర్శలు కూడా ఉన్నాయి. కొత్తగా ప్రజల్లోకి వస్తున్న నాయకుడిపై కేసులు పెట్టించడం, వేధింపుల కారణంగా రోహిత్‌కు నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి పెరిగిందనే చర్చ జరుగుతోంది. మరోవైపు, నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక మాఫియాపై కూడా ప్రజల్లో సదాభిప్రాయం లేదు. పెద్ద ఎత్తున ఇసుకను అడ్డగోలుగా గులాబీ నేతలు అక్రమరవాణా చేస్తున్నా మంత్రి హోదాలో ఉండి కూడా చూసీచూడనట్టు వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. ఇందుకు కూడా తన చుట్టూ ఉన్న కోటరీననే చర్చ కూడా స్థానికంగా జరుగుతోంది. మొత్తంమీద కర్ణుడి చావుకి లక్ష కారణాలన్నట్టు... ఎన్నికల నిర్వహణలో ఘనాపాటీగా పేరుతెచ్చుకున్న మహేందర్‌రెడ్డి ఈసారి ఓట్ల బాక్సాఫీసు ముందు బోల్తా కొట్టారు.   

ఓటమిని మూటగట్టుకుని 
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలను శాంతించిన మహేందర్‌రెడ్డి ఓటమికి అనేక కారణాలున్నాయి. తన రాజకీయ జీవితానికి పునాది వేసిన టీడీపీని వీడి.. 2014 ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటినుంచి ఈయనకు తిరుగులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని భావించారు. కానీ ద్వితీయశ్రేణి నాయకత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించలేకపోయారు. తాండూరు నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ను ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కుటుంబీకులను, బీజేపీ టికెట్‌ ఆశించి పార్టీ వీడిన రమేష్‌కుమార్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నప్పటికీ.. ఎన్నికల్లో వీరి ప్రభావం ఏమీ లేకపోవడంతో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు.

ప్రజల సమస్యలను నేరుగా వినే సమయం ఇవ్వకపోవడం, ఏ పని కోసం వెళ్లినా.. కిందిస్థాయి నాయకులకు చెప్పాలని సూచించడం వంటివి మహేందర్‌రెడ్డి ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.  తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి మహేందర్‌రెడ్డి 6 సార్లు పోటీ చేసి.. 4 సార్లు విజయం సాధించి, 2 సార్లు ఓటమి పాలయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో భాగంగా గత మూడు నెలలుగా మంత్రి హోదాలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. రూ.2 వేల కోట్లతో తాండూరును అభివృద్ధి చేశానంటూ ఆత్మస్తుతి చేసుకోవడానికే అధిక ప్రాధాన్యమిచ్చారు. చుట్టూ ఉన్న ఆ నలుగురు చెప్పిందే విని గెలుస్తామనే ధీమాకు వచ్చేశారు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పసిగట్టలేకపోయారు. ఫలితంగా ఓటమిని మూటగట్టుకుని కుంగిపోతున్నారు. ఇటీవల తాండూరులో జరిగిన ప్రజాశీర్వాద సభలో.. సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. మహేందర్‌రెడ్డిని గెలిపిస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినా.. ఓటర్లు మాత్రం ప్రతికూల తీర్పు ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు