కాటన్.. కాలం

11 Apr, 2014 06:17 IST|Sakshi
కాటన్.. కాలం

 ‘‘ఏప్రిల్ ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చిన్నారుల నుంచి పెద్దల వరకు అల్లాడిపోతున్నారు. బయటికెళితే చెమటతో వస్త్రాలన్నీ తడిసి చిరాకు పెడుతున్నాయి. మండు టెండలోనూ ఉత్సాహంగా ఉండాలంటే చిన్నా, పెద్దా, ఆడా మగా కాటన్ వస్త్రాలు ధరించడమే మేలు...’
 

వేసవి మెచ్చే ఫ్యాషన్ ఇదే..

మండు వేసవిలో  చల్లదనం కోసం..

గిరాకీ పెరిగిందంటున్న వ్యాపారులు


 నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ తెల్లారుతూనే భానుడు భగభగలాడుతున్న రోజులివి. కార్యాలయాలకు వెళ్లేవారు, వివిధ పనులతో పట్టణంలో తిరిగేవారు, ఇలా అందరికీ చెమటకారణంగా ఏ పని చేద్దామన్నా మనసు నిలకడగా ఉండ ని పరిస్థితి. పైగా చిరాకు, ఇలాంటి సందర్భంలో కాస్త చల్లదనం, ఉల్లాసం కలిగించే దుస్తులు ధరించడమే ఉత్తమం. ఖద్దరు, కాటన్, చేనేత దుస్తులు ధరించడం భేషుగ్గా ఉంటుంది.



 కాలానికి తగ్గట్టు వస్త్ర శ్రేణి మార్పు...
 కాలానికి తగ్గట్టుగా వస్త్రశ్రేణిని మార్చడంలో ప్రజలు ముందుంటున్నారు. ఏ సీజన్‌కు ఆ ఫ్యాషన్ పల్లవి అందుకుంటుండటంతో వాతావరణానికి అనుకూలంగా ఉండే దుస్తుల ఎంపికకు ప్రాధాన్యం పెరిగింది. జిల్లాలో సగటున 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో శరీరం తట్టుకోలేకపోతోంది. దీని నుంచి కొంతైనా ఉపశమనం పొందడానికి ధరించే దుస్తులూ కీలకమే. ఇప్పటికే మార్కెట్‌లో వేసవి దుస్తులు తెల్ల తెల్లగా మెరుస్తున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు నచ్చేలా మీటర్ *100 నుంచి వేల రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి.



 కాటన్‌లోనూ ఫ్యాషన్..
 కాటన్ వస్త్రాలంటే పెద్దలకే అన్న భావన ఉండేది. ఇది వరకు మహిళలకు కాటన్ చీరలు, పురుషులకు కాటన్ చొక్కాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. యువతరం ఇలాంటివి ధరించేందుకు ఇష్టపడేవారు కాదు. వయస్సు పెరిగినట్లు కన్పిస్తారని మధ్య వయస్సు వారూ దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు యువ డిజైనర్ల నైపుణ్యంతో కాటన్‌లోనూ ఫ్యాషన్ ఉట్టిపడుతోంది.



ఏ వయస్సు వారికి ఎలాంటి దుస్తులు నచ్చుతాయే అలాంటి వాటిని రూపొందించి మార్కెట్‌లోకి వదులుతున్నారు. దీంతో యువతరం కూడా జైబోలో కాటన్ అనాల్సిందే. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు మొదలు మహిళలకు కాటన్ దుస్తులు, చీరలు, ఒకదాన్ని మించిన డిజైన్ మరొకటి అందుబాటులో ఉన్నాయి. పార్టీ వేర్‌గానూ, కాటన్ కుర్రకారును ఆకట్టుకుంటోంది. వివాహ వేడుకల్లో కాటన్ పసందు చేస్తున్నది. మహిళల కోసం కాటన్‌లో పలు రకాల వెరైటీ చీరలు ఆకట్టుకుంటున్నాయి. సాధారణ రోజుల్లో కూడా ధరించే విధంగా జీన్స్‌పై డిజైనర్ కుర్తా మంచిలుక్‌నిచ్చేలా ఉంటున్నది.



 తెలుపే మలుపు
 వేసవిలో తెలుపుకు మించిన రంగేలేదు. ఈ రంగు కాటన్, ఖద్దరు దుస్తులతో హోదాకు, ఉన్నత వ్యక్తిత్వానికి, ప్రశాంతతకు ప్రతీకగా పలు ప్రయోజనాలున్నాయి. కూల్‌కూల్‌గా ఉండేందుకు వేసవిలో తెలుపు రంగు దుస్తుల్ని వేసుకోవడం ఉత్తమం.



 మీటరకు 50 నుంచి 500లదాకా...
 ఖాదీ వస్త్రాలు ప్రస్తుతం మీటర్‌కు 50 నుంచి 500ల వరకు అందుబాటులో ఉన్నాయి. ధర ఎక్కువైనా సరే అనే వారికి *2 వేల వరకు ఖద్దరు వస్త్రాలున్నాయని వ్యాపారులు తెలిపారు. తమిళనాడు నుంచి దిగుమతయ్యే సింపూర్ ఖద్దర్ మీటర్ 60 నుంచి 2 వేల వరకు ఉంటుంది. బీహార్ నుంచి వచ్చే సిల్క్ ఖద్దరు 200ల నుంచి 1800ల దాకా ఉంది. స్థా నిక ఖద్దరు 100 నుంచి వెయ్యిదాకా విక్రయిస్తున్నారు.

మరిన్ని వార్తలు