పత్తికి ధీమా ఏదీ?

14 Jun, 2018 01:37 IST|Sakshi

  గులాబీ పురుగుతో నష్టపోతున్నా బీమా వర్తింపచేయని కేంద్రం 

  అప్పుల ఊబిలో రైతులు

సాక్షి, హైదరాబాద్‌: పంటల నష్టపోతే రైతులను ఆదుకోవాల్సిన పంటల బీమా పథకం ప్రహసనంగా మారుతోంది. పత్తికి గులాబీ పురుగు సోకి నష్టం జరిగినా బీమా అందడం లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా స్పందన లేదు. దీంతో బీమా వర్తించక రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత ఖరీఫ్‌లో రాష్ట్రంలో 97.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా 47.72 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. అంటే రాష్ట్రంలో సాగైన పంటల్లో సగం మేర పత్తి పంటే కావడం గమనార్హం. అయితే పత్తిపై గులాబీ పురుగు దాడి చేసింది. దీంతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు గుర్తించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక కూడా పంపింది. గులాబీ రంగు పురుగు ఉధృతి కారణంగా పత్తికి తీవ్ర నష్టం వాటిల్లిందని వివరించింది.

కానీ వారికి పంటల బీమా కింద పరిహారం అందే పరిస్థితి లేదని.. అందువల్ల ఆ పథకంలో మార్పులు చేసి, పత్తి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరింది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), ఆధునీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌)లను కలిపి మరో పథకాన్ని తీసుకురావాలని సూచించింది. గులాబీ రంగు పురుగు సోకిన పత్తి దిగుబడి, వాతావరణం రెండింటినీ లెక్కలోకి తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. కానీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాలేదని రాష్ట్ర వ్యవసాయ శా>ఖ వర్గాలు చెబుతున్నాయి. 

మూడో వంతు దిగుబడి నష్టం.. 
గతేడాది 3.30 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ వర్గాలు అంచనా వేశాయి. కానీ గులాబీ పురుగు, ఇతర కారణాలతో 2 కోట్ల క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదని చెబుతున్నాయి. గులాబీ పురుగుతో పత్తికి భారీగా నష్టం జరిగినట్టు ఈ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. సగటున ఎకరాకు 10–12 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి ఉండాలి. కానీ గులాబీ పురుగు కారణంగా.. గత ఖరీఫ్‌లో చాలాచోట్ల ఆరేడు క్వింటాళ్లకు మించి ఉత్పత్తి కాలేదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇంత నష్టం జరిగినా రైతులకు నష్టపరిహారం అందించే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు.

గులాబీ రంగు పురుగు వల్ల దెబ్బతిన్న పంటకు పరిహారం ఇవ్వకపోతే బీమా ప్రీమియం చెల్లించి ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌కు సంబంధించి పత్తి పంటకు బీమా ప్రీమియం చెల్లించేందుకు వచ్చే నెల 15వ తేదీ వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఆలోగానే గులాబీ పురుగు సమస్యకు బీమా వర్తించేలా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.  

>
మరిన్ని వార్తలు