పత్తి రైతుల కష్టం దళారుల పాలేనా?

29 Sep, 2019 08:09 IST|Sakshi

వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి ఇలాకపై చిన్నచూపు  

జిల్లాలో 7,295 ఎకరాల్లో పత్తి సాగు  

సాక్షి, వనపర్తి :  జిల్లా పత్తి రైతులు పండించిన పంట ఉత్పత్తులను మరోసారి దళారుల చేతిలో పెట్టాల్సిందేనా.. అన్న ప్రశ్నలు జిల్లాలో సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఏటా జిల్లాలో సుమారు ఎనిమిది వేల ఎకరాలకు పైచిలుకు పత్తి సాగవుతోంది. పండించిన పంటల ఉత్పత్తులను విక్రయించేందుకు వనపర్తి ప్రాంత రైతులు సుదూర ప్రయాణం చేసి జడ్చర్లలోని బాదేపల్లి మార్కెట్‌లో విక్రయించాలి. వ్యయప్రయాసలు ఎందుకని భావించే రైతులు స్వగ్రామంలోనే దళారులకు పత్తిని విక్రయించటం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. వనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రిగా పదవిలో ఉన్నారు.

అయినా జిల్లాలో పత్తిరైతులకు మద్ధతు ధర కల్పించేందుకు సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు.  ఈసారి జిల్లాలో కనీసం ఒక్కటైనా సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారన్న రైతుల, వ్యవసాయ అధికారుల ఆశలపై నీళ్లు చల్లినట్‌లైంది. ఈ విషయం బహుశా మంత్రి నిరంజన్‌రెడ్డి దృష్టికి రాకపోయి ఉండవచ్చు. కానీ.. జిల్లాలో ఎక్కువగా పత్తిసాగు చేసే ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్‌పేట, వనపర్తి మండలాల పరిధిలోని రైతుల ఆశలు నీరుగారాయని చెప్పవచ్చు.

సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి పంటను విక్రయిస్తే భారత ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్‌పీ (మినిమమ్‌ సపోర్టింగ్‌ ప్రైజ్‌) ధర క్వింటా రూ.5,550 తప్పక లభిస్తుంది. ఇదివరకు అడిగేవారులేక ప్రస్తుత వనపర్తి జిల్లా పరిధిలో కనీసం ఒక్కసారికూడా సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి సొంత జిల్లాలో ఈసారైనా సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారనే ఆశ ఉండేది.  

దళారుల చేతుల్లో రైతు చిత్తు  
జిల్లాలో పత్తి సాగు చేస్తున్న రైతులు పంటల ఉత్పత్తులను వాహనాల్లో ఇతర ప్రాంతాల్లోని మార్కెట్‌కు తీసుకువెళ్లలేక గ్రామాలకు వచ్చే దళారులకే విక్రయిస్తున్నారు. వచ్చేందే రేటు.. ఇచ్చిందే మద్దతుధర అన్నట్లుగా వ్యవహారం నడుస్తుండేది. మంత్రి హయాంలో పరిస్థితి మారుతుందని రైతులు భావించారు. ఇకనైనా మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందించి జిల్లాలో ఎక్కువగా పత్తిసాగు చేసే ప్రాంతంలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.  

జిల్లాలో 7,295 ఎకరాల్లో పత్తిసాగు  
జిల్లా వ్యవసాయశాఖ అధికారుల అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుత ఖరీఫ్‌లో 7,295 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. జిల్లాలో 14 మండలాలు ఉండగా వనపర్తి నియోజకవర్గం పరిధిలోని ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్‌పేట, వనపర్తి మండలాల్లోనే ఎక్కువగా పత్తి సాగు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా మండలాల్లో కొంతమేర సాగయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లా సాధారణ పత్తిసాగు విస్తీర్ణం 8,315 ఎకరాలు కాగా 7,295 ఎకరాల్లో పత్తిసాగు చేశారు.

గత ఏడాది 6,795, అంతకుముందు ఏడాది ఖరీఫ్‌లో 10,950 ఎకరాల్లో సాగు చేశారు. మార్కెటింగ్‌ సౌకర్యం సక్రమంగా ఉంటే జిల్లాలో పత్తిసాగు మరింత పెరిగే అవకాశం ఉంది. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏటా విరివిగా జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కారణంగా ఏటేటా జిల్లాలో వరిసాగు విస్తీర్ణం పెరుగుతోందని చెప్పవచ్చు.  
సీసీఐ

కొనుగోలు కేంద్రాలకు కసరత్తు  
కాటన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా.. అధికారులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. 
జిల్లా నుంచి మార్కెటింగ్‌శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించినా వనపర్తి జిల్లాలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. పత్తి రైతులకు మరోసారి విక్రయాల అవస్థలు తప్పేలాలేవు. 

కేంద్రం ఏర్పాటు చేయాలి   
మంత్రి చొరవతో ఈసారి పత్తిసాగు ఎక్కువగా చేసే మా ప్రాంతంలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. ఏటా పండించిన పత్తిని మార్కెట్‌కు తీసుకువెళ్లలేక గ్రామాలకే వచ్చి కొనుగోలు చేసే దళారులకు విక్రయించేది. మా ప్రాంతంలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఇచ్చే మద్ధతు ధరకే రైతులమంతా పత్తిని విక్రయించుకుంటాం.  
– శేఖర్‌గౌడ్, రైతు, అప్పారెడ్డిపల్లి, ఖిల్లాఘనపురం మండలం 

ప్రతిపాదనలు పంపించాం  
జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాము. సీసీఐ కొనుగోలు కేంద్రాలు మార్కెట్‌ యార్డులోగానీ, జిన్నింగ్‌ మిల్లులులోగానీ ఏర్పాటు చేస్తారు. వనపర్తి జిల్లా పరిధిలో నేషనల్‌ హైవే 44పై ఒక్కటే ఉంది. ఇప్పటివరకు జిల్లాలోని నాలుగు మార్కెట్‌ యార్డులలో ఎక్కడా విక్రయానికి పత్తి రాలేదు. 
– స్వరణ్‌సింగ్, డీఎం, మార్కెటింగ్, వనపర్తి జిల్లా 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా