వేలం పాట గోవిందా?

4 Nov, 2017 14:10 IST|Sakshi

జమ్మికుంట(హుజూరాబాద్‌):  ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మార్కెట్‌ జమ్మికుంటలో నిబంధనలకు నీళ్లు వదిలారు. పత్తి కొనుగోలు వేలంలో పోటీపడుతున్న వ్యాపారులు చివరి బండి వరకు మాత్రం మద్దతు ధర చెల్లించడం లేదు. మొదటి ఒక్కటి, రెండు వాహనాల్లోని పత్తికి మాత్రమే వేలంలో పాడిన ధర చెల్లిస్తూ..తర్వాత వాహనాల్లోని పత్తికి ఇష్టారీతిగా ధర నిర్ణయిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పత్తి కొనేదిలేదంటూ మొండికేస్తున్నారు. వారి చెప్పిందే ధరగా చెల్లుబాటు అవుతుంది. 

పేరుకే వేలం!
జమ్మికుంట మార్కెట్‌లో ప్రతి రోజు పత్తి కొనేందుకు వ్యాపారులు పోటీపడి వేలంపాట పాడుతున్నారే తప్ప అన్ని వాహనాల్లోని పత్తికి అదే ధర చెల్లించడం లేదు. ఇదంతా అధికారుల సాక్షిగానే జరుగుతున్నా స్పందించినా పాపానపోవడం లేదు. జమ్మికుంట పత్తి మార్కెట్‌కు శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి 184 వాహనాల్లో 1,899 క్వింటాళ్ల లూజ్‌ పత్తి వచ్చింది. పాలకవర్గం, అధికారుల సమక్షంలో రెండు వాహనాలకే వ్యాపారులు వేలం పాడారు. మొదటి వాహనానికి క్వింటాల్‌కు రూ.4,400 ధర పెట్టిన వ్యాపారులు, రెండో వాహనానికి రూ.4,510 చెల్లించారు. తర్వాత వాహనాలకు మాత్రం వ్యాపారులకు ఎవరికి నచ్చిన ధరలు వారు చెల్లించారు. సేటు చెప్పిందే ధరగా పరిస్థితులు మారిపోయాయి. వేలం అన్ని వాహనాలకు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నిస్తే పట్టించుకునే వారు కరువయ్యారు. 

ఇష్టారీతిన కొనుగోళ్లు
మొదటి ఒకట్రెండు వాహనాలకే వేలం పాట పాడుతున్న వ్యాపారులు తర్వాత ఇష్టారీతిన కొనుగోళ్లు చేస్తున్నారు. నాణ్యమైన పత్తికి సైతం క్వింటాల్‌కు రూ.3,500 నుంచి రూ.4,200 చెల్లించారు. గతంలో ప్రతీ వాహనానికి వేలం పాడిన వ్యాపారులు ఈసారి మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్‌లో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు