పత్తి ధర ఢమాల్‌

28 Nov, 2018 10:04 IST|Sakshi
ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో పత్తి బండ్లు

ఆదిలాబాద్‌టౌన్‌:  పత్తి ధర రోజురోజుకు పడిపోతోంది. క్వింటాలు ధర రూ.6వేలకు పైగా పెరుగుతుం దని భావించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. తెల్లబంగారంగా భావించే ధర ఢమాల్‌ అవుతోంది. పత్తి కొనుగోళ్లు ప్రారంభం రోజు క్వింటా లు పత్తి రూ.5800కి కొనుగోలు చేసిన ప్రైవేట్‌ వ్యాపారులు మంగళవారం కనీసం ప్ర భుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,450 కంటే తక్కువతో కొనుగోలు చేశారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం పది రోజుల నుంచి రోజురోజుకు ధర తగ్గుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బేళ్ల ధర తక్కువగా ఉందని, పత్తి గింజల ధర కూడా పడిపోయిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ ధర కంటే ఎక్కువగా చెల్లించలేమని కరాఖండిగా చెబుతున్నారు. దీంతో పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక, వేరే దారిలేక రైతులు వారు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది.

మద్దతు ధర కంటే తక్కువ..
మార్కెట్‌లో మద్దతు ధర కంటే తక్కువగా ప్రైవేట్‌ వ్యాపారులు ధర నిర్ణయించడంతో మార్కెటింగ్‌ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ ద్వారా కొనుగోలుకు సిద్ధమయ్యారు. సీసీఐ సవాలక్ష నిబంధనలు విధించడంతో గత్యంతరం లేక రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకే పంటను విక్రయించుకుంటున్నారు. సీసీఐలో పంట విక్రయించినా రైతులకు కూడా వారం పది రోజుల వరకు డబ్బులు చెల్లించకపోవడం, తదితర కారణాలతో రైతులు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ధరలో కొంత తేడా వచ్చినా ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్మి అప్పటికప్పుడు డబ్బులను తీసుకెళ్తున్నారు. ఈ నెల 20న క్వింటాలు పత్తి ధర రూ.5600 ఉండగా, ఆ తర్వాత రూ.5550, రూ.5490, మంగళవారం రూ.5440 ధర నిర్ణయించారు. మద్దతు ధర కంటే ప్రైవేట్‌ వ్యాపారులు క్వింటాలుకు రూ.10 కంటే తక్కువగానే కొనుగోలు చేశారు.

ఆశ నిరాశే..
ఆదిలాబాద్‌ జిల్లాలో చాలామంది రైతులు అధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేస్తారు. మొదట్లో పత్తి ధర రూ.5800 వరకు ఉండడంతో క్వింటాలుకు రూ.6వేలకు పైగా ధర వస్తుందని ఆశ పడ్డారు. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బేళ్ల ధర తగ్గిందని ప్రైవేట్‌ వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బేల్‌ ధర రూ.43వేలకు పడిపోవడంతో పత్తి ధర తగ్గుతూ వస్తుందని, పత్తి గింజలు క్వింటాలుకు రూ.2వేల వరకు పడిపోయిందని చెబుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్‌ వ్యాపారులు ధరను పెంచేందుకు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. మంగళవారం సిద్దిపేటలో క్వింటాలుకు రూ.5250, వరంగల్‌లో రూ.5,300, ఖమ్మంలో రూ.5,450, జమ్మికుంటలో రూ.5,350తో కొనుగోలు జరిగాయని మార్కెటింగ్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

40 శాతం తగ్గిన దిగుబడి..
మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారింది రైతుల పరిస్థితి. ప్రతియేడు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. గతేడాది అనావృష్టితో పంటలు నష్టపోగా, ఈ యేడాది అతివృష్టి కారణంగా పంట దిగుబడిపై ప్రభావం పడింది. గతం కంటే ఈసారి 40 శాతం దిగుబడి పడిపోయింది. ఎకరానికి రెండు మూడు క్వింటాళ్ల కంటే ఎక్కువ పత్తి దిగుబడి రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 10,65,378 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరగగా, జిల్లా వ్యాప్తంగా ఈయేడాది ఇప్పటివరకు 4,07,372 క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. ఆదిలాబాద్‌ మార్కెట్‌లో 3,55,144 క్వింటాళ్లు, బోథ్‌లో 28వేల క్వింటాళ్లు, ఇచ్చోడలో 11వేల క్వింటాళ్లు, జైనథ్‌లో 9వేల క్వింటాళ్ల కొనుగోళ్లు చేపట్టారు. ఇప్పటివరకు సీసీఐ జిల్లాలో బోణీ చేయలేదు. గతేడాది 6,672 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది.

రైతులు ఆందోళన చెందవద్దు
పత్తి ధర తగ్గుతుందని రైతులు ఆందోళన చెందవద్దు. మార్కెట్‌లో మద్దతు ధర కంటే తక్కువ ఉంటే సీసీఐ ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం సీసీఐని రంగంలోకి దించాం. తక్కువ ధరకు పంటను విక్రయించి నష్టపోవద్దు. – శ్రీనివాస్, మార్కెటింగ్‌ ఏడీ, ఆదిలాబాద్‌

మరిన్ని వార్తలు