తెల్లబోతున్న బంగారం..!

28 Nov, 2018 10:14 IST|Sakshi
జమ్మికుంటలో రైతుల వద్ద పత్తిని బోణి కొడుతున్న సీసీఐ

జమ్మికుంట(హుజూరాబాద్‌): తెల్లబంగారం తెల్లబోతోంది. మొన్నటివరకు మద్దతును మించి ధర పలికిన పత్తి.. వారం వ్యవధిలోనే రూ.600 తగ్గింది. ఒకదశలో రూ.6వేలకు పెరుగుతుందని ఆశించిన రైతులకు తాజాగా పడిపోతున్న ధరలు అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా మద్దతు కంటే ధర దిగువకు పడిపోయాయి. మంగళవారం క్వింటాల్‌కు రూ.5,350 పలికింది. మరోవైపు పత్తి కొనుగోలుకు సీసీఐ రంగంలోకి దిగడంతో రైతులు ఆశలు పెంచుకుంటున్నారు.

పత్తి ధర పతనం ఇలా.. 
అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్‌ పడిపోతోంది. ఫలితంగా ఇక్కడి పత్తికీ ధర తగ్గుతోంది. తాజాగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌ రా ష్ట్రాల్లో పత్తి అమ్మకాలు జోరందుకోవడంతో పత్తి ధరలపై ప్రభావం చూపుతోందని ఎగుమతిదారులు వెల్లడిస్తున్నారు. నార్త్‌ ఇండియాలోని హర్యానా, పంజాబ్, రాజాస్థాన్‌లో గతంలో క్యాండి ధర రూ.47,500 వరకు పలకగా.. ప్రస్తుతం ఆ ధర రూ.44 వేలకు పడిపోయింది. అదే విధంగా సౌత్‌ ఇండియాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో క్యాండీ ధర గతంలో 47,500 వరకు పలకగా.. సోమవారం రూ.44, 300కు దిగజారింది.

పత్తి గింజలు సైతం క్వింటాల్‌కు గతంలో రూ.2,350 నుంచి 2,500 వరకు పలకగా.. సోమవారం ఏకంగా రూ.2,100 నుంచి 2,070కు దిగింది. దీంతో జమ్మికుంట పత్తి మార్కెట్‌లో క్వింటాల్‌ పత్తి అక్టోబర్‌ నుంచి నవంబర్‌ మొదటి వారం క్వింటాల్‌ పత్తి ధర రూ.5800 పలకగా.. సోమవారం రూ.5,350కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొంటున్న వ్యాపార సంక్షోభంతో పత్తి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పతనంకానున్నాయని వ్యాపారవర్గాలు వెల్లడిస్తున్నాయి.

కాటన్‌ వ్యాపారులకు భారీ నష్టం..?
జమ్మికుంట పత్తిమార్కెట్‌లో రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేసిన వ్యాపారులకు పడిపొతున్న పత్తి, గింజల ధరలు భారీనష్టాన్ని మిగిల్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో కాటన్‌ మిల్లర్‌ దాదాపు 20 రోజుల వ్యవధిలో రూ.10 లక్షల నుంచి రూ.30లక్షల వరకు నష్టపోయినట్లు సమాచారం. పత్తికి డిమాండ్‌ లేకున్నా.. మిల్లుల నిర్వహణ కోసం పోటీ పడి మరీ పత్తిని కొనుగోలు చేసిన వ్యాపారులు పడిపోయిన ధరలతో గందరగోళంలో పడినట్లు తెలిసింది. చేసేదేమీ లేక ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోళ్లు చేపట్టినట్లు సమాచారం. కొందరు కాటన్‌ మిల్లర్లు తమ వ్యాపారాలను పక్కన పెట్టినట్లు తెలిసింది. దీంతో ఇక సీసీఐ కొనుగోలు జోరందుకునే అవకాశాలు ఉన్నాయి.

జమ్మికుంటలో పడిపోయిన పత్తి ధర
జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో మంగళవారం క్వింటాల్‌ పత్తికి రూ.5,350 పలికింది. మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంయి 1165 క్విం టాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. ప్రైవేట్‌ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.5350 చెల్లించారు. కనిష్టంగా రూ.5,300 చెల్లించారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.5450 ఉండగా.. వ్యాపారులు రూ.100 తగ్గించి కొనుగోలు చేశారు. డబ్బులు అత్యవసరం ఉన్న రైతులు ధర తక్కువైనా వ్యాపారులకే విక్రయించారు. రెండుమూడు రోజులు అలస్యమైనా సరే అనుకున్నవారు సీసీఐకి విక్రయించారు.

రంగంలోకి సీసీఐ
మద్దతు ధర కంటే ప్రైవేట్‌ వ్యాపారులు ధర తక్కువగా చెల్లిస్తుండడం.. సీసీఐ రంగంలోకి దిగడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సీసీఐ ఇన్‌చార్జి తిరుమల్‌రావు సైతం రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు ముందుకు వచ్చి పలువురు రైతుల వద్ద  సోమవారం 60 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయించారు. మంగళవారం మరో 120 క్వింటాళ్లు కొన్నారు.

సీసీఐకే అమ్ముకున్న..పసుల రాజయ్య, భీంపల్లి, కమాలాపూర్‌
మాది కమాలాపూర్‌ మండలం భీంపెల్లి. నాకున్న ఐదెకరాల్లో పంటలు సాగు చేశా. నాలుగెకరాల్లో ప త్తి పెట్టిన. మొదట పత్తి ఏరితే 24క్వింటాళ్లు చేతికి వచ్చింది. జమ్మికుంట మార్కెట్‌కు నాలుగున్నర క్వింటాళ్లు తీసుకొచ్చిన. క్వింటాల్‌కు ప్రవేట్‌ వ్యా పారులు రూ.5350 ధర చెల్లిస్తామన్నారు. నేను సీసీఐకి మద్దతు ధరతో రూ.5450తో అమ్ముకున్న.

పాసుబుక్కు తప్పనిసరి తిరుమల్‌రావు, సీసీఐ సెంటర్‌ ఇన్‌చార్జి
సీసీఐకి విక్రయించాలనుకునే రైతులు తమవెంట ఆధార్‌కార్డు, పట్టదారు పాస్‌పుస్తకం, బ్యాంక్‌ ఖాతా బుక్కు తెచ్చుకోవాలి. తేమశాతం 12లోపు ఉన్న ఉత్పత్తులను తప్పకుండా కొంటాం. పత్తి మార్కెట్‌తోపాటు పట్టణంలోని మూడు కాటన్‌ మిల్లుల్లో మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. పట్టణంలోని ఆరు మిల్లుల్లో అగ్రిమెంట్లు పూర్తయ్యాయి.

మరిన్ని వార్తలు