ధర పెరిగి తగ్గింది!

12 Feb, 2018 14:44 IST|Sakshi

ముందు ఎక్కువ ధర.. తర్వాత తక్కువ

అసలే దిగుబడి లేక ఆవేదనలో అన్నదాతలు

తెల్లబోతున్న పత్తి రైతులు

మార్కెట్‌లో తగ్గుతున్న నిల్వలు

పెద్దపల్లి: చేలలో పత్తి తగ్గుతుండగా మార్కెట్‌లో ధర డిమాండ్‌ పెరుగుతుండేది. ఇది గతంలో ఎన్నో ఏళ్లుగా రైతులు చూసిన అనుభవం. నవంబర్‌లో రూ.4200 ధర పలికితే ఫిబ్రవరిలో 5 వేలకు పైగా పలికేది. పత్తి మార్కెట్‌లో ధరల ఆటుపోటు ఇలా ఉండగా, ప్రస్తుతం గతంలో కంటే ధరలు తగ్గుతూ రావడంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో 65వేల హెక్టార్లలో సాగు
జిల్లాలో 65వేల పత్తి సాగుబడి కాగా, ఆశించిన దానిలో సగం కూడా దిగుబడి రాకపోవడంతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పెద్దపల్లి ప్రాంతంలో రికార్డు స్థాయిలో పత్తి దిగుబడి వచ్చేది. ఒక్కో ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి అవుతుండగా, ఈ ఏడాది 4 నుంచి 6 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. తీరా మార్కెట్‌కు వెళితే నిన్నటి ధర కంటే నేడు మరో రూ. 50 తగ్గుతూ విక్రయాలు కొనసాగిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

తగ్గిన ధర
పెద్దపల్లి పత్తి మార్కెట్‌లో గత నెల 5200 క్వింటాల్‌ ధర పలికితే ప్రస్తుతం 4600 మేరకే పత్తి విక్రయాలు కొనసాగుతున్నాయి. కనిష్ట ధర రూ. 2500, సాధారణ ధర రూ. 4300గా నమోదవుతోంది. ఇది గతంతో పోలిస్తే పూర్తిగా దెబ్బతిన్న రికార్డుగానే చెప్పుకోవచ్చు. రైతులు తగ్గుతున్న ధరలను చూసి ఆవేదనకు గురవుతున్నారు. గడిచిన 15 రోజులుగా పత్తి ధరలు రోజుకు రూ. 100 నుంచి 50 తగ్గుతున్న సందర్భాలే ఎక్కువగా నమోదవు తున్నాయి. కనిష్ట ధర గురువారం రూ. 2500 మాత్రమే పలికితే శుక్రవారం కూడా అంతే పలికింది. ఇక సాధారణ ధర తగ్గుతూ రావడం ఇంట్లో పత్తి దాచుకున్న రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చేందుకు వెనకంజ వేసేలా చేస్తోంది.

దాచుకుంటే ధర పెరిగేది..
చిన్న, సన్నకారు రైతులు తమ అవసరాల కోసం ఏరోజుకారోజు పత్తిని మార్కెట్‌ను తరలిస్తూ విక్రయించేవారు. సంపన్నులైన రైతులు మాత్రం మార్కెట్‌ ధరల పరిస్థితిని గమనిస్తూ అమ్మకాలు చేపట్టేవారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి, మార్చిలో పత్తి ధరలకు రెక్కలు వచ్చేవి. అప్పటివరకు పత్తి అమ్ముకున్న రైతులు ఆ తర్వాత పెరుగుతున్న ధరలను చూసి దిగులుపడేవారు. ప్రస్తుతం పరిస్థితి తలకిందులై గతంలో కంటే క్వింటాల్‌కు రూ. 500కు పైగా ధర తగ్గి విక్రయాలు చేపట్టడం రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ వ్యత్యాసాన్ని పూడ్చివేయడానికి మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు.

బేళ్లకూ  ప్రభావమే..
అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్కో బేల్‌ ఖరీదు రూ. 42వేలు పలికేదని, ప్రస్తుతం రూ. 41వేలకు ధర పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే పత్తి విత్తనాలకు టన్నుకు రూ. 22వేలు ఉండేదని, ప్రస్తుతం రూ. 19వేలకు ధర పడిపోవడంతో ఆ ప్రభావం పత్తి మార్కెట్‌పైన కొనసాగుతుందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులకు పంట దిగుబడితోపాటు ధరల రాబడి కూడా పడిపోతుందని అంటున్నారు.

మరిన్ని వార్తలు