దిగుబడిపై పత్తి రైతుల గంపెడాశలు

24 Sep, 2019 10:35 IST|Sakshi
ఆదిలాబాద్‌ జిన్నింగ్‌ మిల్లులో పత్తి నిల్వలు

దిగుబడిపై పత్తి రైతుల గంపెడాశలు 

సాధారణాన్ని మించిన సాగు 20లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా..? 

ఇప్పుడిప్పుడే చేతికొస్తున్న పంట 

సాక్షి, ఆదిలాబాద్‌: తెల్ల బంగారమేనా.. పత్తి రైతులు పంటపై గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం పంట పూత, కాత దశలో ఉంది. పంట చేతికొచ్చే దశ ఆసన్నమవుతోంది. సాధారణంగా జిల్లాలో దసరా నుంచి పత్తి పంట కొనుగోలు ప్రారంభమవుతుంది. అయితే ఈసారి ఆలస్యంగా అక్టోబర్‌ చివరి వారంలో పంట కొనుగోలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది పత్తి క్వింటాలుకు స్వల్పంగా వంద రూపాయల మద్దతు ధర పెంచింది. 

సాధారణం కన్నా మించి విస్తీర్ణం జిల్లాలో ఈయేడాది పత్తి పంట సాధారణ సాగు విస్తీర్ణం కంటే మించింది. పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 4500 ఎకరాల్లో పంట నష్టం సంభవించగా అందులో 90శాతానికి పైగా పత్తి పంటకే నష్టం చేకూరింది. ఈ దశలో ప్రకృతి సహకరిస్తేనే రైతుకు లాభం చేకూరే పరిస్థితి. ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడిపై రైతు ఆశలు పెట్టుకున్నాడు.

రైతు నుంచి పంట చేజారిన తర్వాత.. 
కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధరను స్వల్పంగా పెంచింది. గతేడాది క్వింటాలుకు రూ.5450 ఉండగా, ఈయేడాది దానికి అదనంగా మరో వంద రూపాయలు పెంచింది. అయితే గతేడాది పత్తి రైతులు పంటను అమ్ముకున్న తర్వాత మార్కెట్లో క్వింటాలు పత్తి ధర గణనీయంగా పెరుగుతూ వస్తూ ఓ దశలో రూ.6050కు చేరుకుంది. అయితే అప్పటికే రైతుల నుంచి పంట చేజారింది. దీంతో అప్పటికే పంటను కొనుగోలు చేసిన ప్రైవేట్‌ ట్రేడర్సే లాభపడ్డారు.

గతేడాది జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ మీనమేషాల నేపథ్యంలో మార్కెట్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ సంఘాలతో గ్రామాల్లో కొనుగోళ్లు చేయించారు. చిన్న, సన్నకార రైతులు తమ పంటను ఈ సంఘాలకు అమ్ముకున్నారు. తద్వారా వారికి రవాణ చార్జీలు మిగిలాయి. ఈయేడాది కూడా సీసీఐతో పాటు పీఏసీఎస్, ఐకేపీ సంఘాలు పత్తి పంటను కొనుగోలు చేయనున్నాయి. అయితే ఈ సంఘాలు నామమాత్రంగా కొనుగోలు చేయగలిగాయి. ప్రధానంగా మార్కెట్లో ప్రైవేట్‌ ట్రేడర్స్‌ రైతులకు మద్దతు ధర కల్పించడంలో విఫలమైన పక్షంలో సీసీఐ రంగంలో ఉంటుంది. ఒకవేళ మద్దతు ధరను మించి మార్కెట్లో హెచ్చు ధర ఉన్నప్పుడు సీసీఐ పాత్ర నామమాత్రంగా ఉంటుంది. గతేడాది ఎంఎస్‌పీ కంటే ధర అధికంగా ఉండడంతో సీసీఐ కొనుగోలు అంతంత మాత్రంగా చేపట్టింది.

నార్నూర్‌కు ప్రతిపాదనలు.. 
జిల్లాలో గతేడాది ఆదిలాబాద్, సొనాల, నేరడి గొండ, బోథ్, పొచ్చర, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బేలలో ఎనిమిది సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి పంటను కొనుగోలు చేశారు. ఈయేడాది వీటితో పాటు నార్నూర్‌లో కొను గోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మార్కెటింగ్‌ శాఖ సీసీఐకి ప్రతిపాదన చేసింది. అయితే ఇది కార్యరూపం దాల్చుతుందా?.. లేదా అనేది వేచి చూడాల్సిందే. నార్నూర్‌లో జిన్నింగ్‌ ఫ్యాక్టరీ లేకపోవడం సమస్యకు కారణమైంది.

ప్రైవేట్‌ ట్రేడర్సే అత్యధికంగా కొనుగోలు 
గతేడాది సీసీఐ, పీఏసీఎస్, ఐకేపీ సంఘాలు పత్తి కొనుగోలు కోసం రంగంలో ఉన్నప్పటికీ ప్రైవేట్‌ ట్రేడర్సే పంటను అత్యధికంగా కొనుగోలు చేశారు. జిల్లాలో దిగుబడి వచ్చిన పంటలో సీసీఐ నామమాత్రంగా 18.69 శాతం మాత్రమే కొనుగోలు చేసింది. ఇక వ్యాపారులు 80 శాతం వరకు కొనుగోలు చేశారంటే దాదాపు పంట మొత్తం వారే కొనుగోలు చేశారనేది స్పష్టమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో విపణి ధరలను బట్టి పత్తి ధరలో హెచ్చు, తగ్గులు ఉంటాయి. గతేడాది కొనుగోలు సీజన్‌ చివరిలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో పత్తి మద్దతు ధర కంటే అధిక ధర పలికింది. ఈ నేపథ్యంలోనే రైతులు తెల్లబంగారంపై ఆశలు పెంచుకున్నారు. 
పత్తి పంట వివరాలు 
పంట సాగైన విస్తీర్ణం:    1,32,047 హెక్టార్లు 
దిగుబడి అంచనా:       18,48,658 క్వింటాళ్లు 
మద్దతు ధర:             రూ.5,550 (క్వింటాలుకు) 
సీసీఐ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు:   9 
గతేడాది కొనుగోలు వివరాలు ప్రైవేట్‌ ట్రేడర్స్‌:    14,62,011 క్వింటాళ్లు 
సీసీఐ:                               3,36,092 క్వింటాళ్లు 
పీఏసీఎస్‌ (11 కేంద్రాలు):       998 క్వింటాళ్లు 
ఐకేపీ (12 కేంద్రాలు):            2,939 క్వింటాళ్లు 

అక్టోబర్‌ చివరిలో కొనుగోలు
అక్టోబర్‌ మూడోవారంలో పత్తి పంట కొనుగోలు ప్రారంభించే అవకాశం ఉంది. సీసీఐ తొమ్మిది కేంద్రాలతో కొనుగోలు కోసం ప్రతిపాదనలు చేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ సంఘాలు కూడా గ్రామాల్లో పంటను కొనుగోలు చేస్తాయి. మార్కెట్‌ యార్డుల్లో ఏర్పాట్లు చేస్తున్నాం. 
– గజానంద్, జిల్లా మార్కెటింగ్‌ శాఖాధికారి, ఆదిలాబాద్‌ 

మరిన్ని వార్తలు