కొత్త విద్యుత్‌ప్లాంట్లపై కోటి ఆశలు

1 Dec, 2014 01:31 IST|Sakshi
కొత్త విద్యుత్‌ప్లాంట్లపై కోటి ఆశలు
  • సత్వర వెలుగునిచ్చే ప్రాజెక్టుల్లో పెట్టుబడి
  • కేటీపీపీ రెండోదశ పూర్తికి రూ.300 కోట్లు
  • కొత్తగూడెం కొత్త ప్లాంట్‌కు రూ.300 కోట్లు
  • బీహెచ్‌ఈఎల్ ప్రాజెక్టులకు రూ.400 కోట్లు
  • సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంక్షోభం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని గట్టెంక్కించేందుకు వచ్చే డిసెంబర్ నాటికి పూర్తయ్యే ప్రాజెక్టులకు సర్కార్ మొదటి ప్రాధాన్యమివ్వనుంది. ఇందుకోసం కొత్త కేంద్రాలపైనే ఆశలు పెట్టుకుంది. తెలంగా ణ జెన్‌కో సారథ్యంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు, బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం చేసుకున్న థర్మల్‌ప్లాంట్లను శరవేగంగా పూర్తి చేయడంపై దృష్టి కేంద్రీకరిం చింది.

    బడ్జెట్‌లో  టీఎస్ జెన్‌కోలో పెట్టుబడికి నిర్దేశించిన రూ.1000 కోట్లను ఈ కొత్తప్లాంట్ల కోసం ఖర్చు చేయనుంది. భూపాలపల్లిలో నిర్మాణంలో ఉన్న 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ ప్రాజెక్టు రెండో దశకు రూ. 300 కోట్లు, కొత్తగూడెం థర్మల్ ప్లాంట్ ఏడోదశలో తలపెట్టిన 800 మెగావాట్ల ప్రాజెక్టుకు మరో రూ. 300 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. మిగతా రూ. 400 కోట్లను బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం చేసుకునే థర్మల్ ప్రాజెక్టులకు కేటాయించనుంది.
     
    2012లోనే పూర్తికావాల్సింది..

    భూపాలపల్లి ప్లాంట్‌కు ఆర్‌ఈసీ రూ.2170 కోట్ల రుణం మంజూరీ చేసింది. గత నెలాఖరు వరకే దాదాపు రూ.2565 కోట్లు దీనికి ఖర్చయినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.  2009 ఫిబ్రవరిలో  ఈ ప్లాంట్ పని ప్రారంభమైంది. ఒప్పందం ప్రకారం 2012లోనే పూర్తి కావాలి. కాంట్రాక్టర్ల జాప్యంతో రెండేళ్లు ఆలస్యమైంది. అంతేకాక గతనెలలో భారీయంత్రాలు అమర్చే క్రేన్ విరగడంతో బాయిలర్ నిర్మాణం మధ్యలో ఆగింది. దీంతో నెలరోజులు పనులన్నీ నిలిచిపోయాయి.

    ఇటీవలే టీఎస్‌జెన్‌కో ఛైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకరరావు అక్కడికివెళ్లి పనుల పురోగతిని పరిశీలించారు. ఆగస్టు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. దీంతో పాటు మణుగూరులో 1080 మెగావాట్ల (2704 యూనిట్లు) థర్మల్ విద్యుత్‌కేంద్ర నిర్మాణంపై జెన్‌కో దృష్టి సారించింది. దీనిని ఈపీసీ విధానంలో బీహెచ్‌ఈఎల్ కంపెనీకి అప్పగించనుంది. మణుగూరులో 1031.19 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    సాధారణంగా థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి మూడేళ్ల సమయం పడుతుంది. అయితే, 270 మెగావాట్ల ఉత్పత్తికి  అవసరమయ్యే టర్బైన్లు, జనరేటర్లు బీహెచ్‌ఈఎల్ దగ్గర  అందుబాటులో ఉండడంతో రెం డేళ్ల వ్యవధిలోనే పూర్తిచేసేందుకు  అంగీకారం కుదిరిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక కొత్తగూడెం థర్మల్ పవర్‌ప్లాంట్‌లో 800 మెగావాట్ల కేంద్రాన్ని మూడేళ్లలో పూర్తి చేసేందుకు జెన్‌కో ఏర్పాట్లు చేస్తోంది. వీటికితోడు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న జల విద్యుత్‌కేంద్రాలు వచ్చే ఏడాది చివరినాటికి ఉత్పత్తిచేసే దశకు చేరుకుంటాయని అధికారులు అంచనా వేశారు.

    లోయర్ జూరాల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ద్వారా 240 మెగావాట్లు (640), పులిచింతల ప్రాజెక్టు ద్వారా 120 మెగావాట్లు (430) ఉత్పత్తి చేసే యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి 70 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. డిసెంబర్ 15 వరకు ఈ యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉంటుందని జెన్‌కో అంచనా వేసింది.
     

మరిన్ని వార్తలు