మియాపూర్‌ స్కాంపై కౌంటర్లు దాఖలు చేయండి

27 Dec, 2017 02:54 IST|Sakshi

ప్రభుత్వం, పలు కంపెనీల డైరెక్టర్లకు హైకోర్టు ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ భూకుంభకోణానికి సంబంధించి తీసుకున్న చర్యలను వివరిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కంపెనీల డైరెక్టర్లను సైతం కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మియాపూర్‌ భూకుంభకోణంపై జరుగుతున్న పోలీసు దర్యాప్తును సీబీఐకి బదలాయించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. బీజేపీ అధికార ప్రతినిధి మాధవనేని రఘునందన్‌ రావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీజే నేతృ త్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో ముగ్గురు నిందితులపై కింది కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశామన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నారు.

దర్యాప్తులో ఇతరుల పాత్ర ఉందని తేలితే వారిని నిందితులుగా చేరుస్తూ అదనపు చార్జిషీట్‌ దాఖలు చేస్తామని వివరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల డైరెక్టర్లకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ) కింద నోటీసులు జారీ చేసి వివరణలు తీసుకున్నామన్నారు. ఈ భూముల యాజమాన్యపు హక్కులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందన్నారు.

మరిన్ని వార్తలు