కౌంటింగ్‌ కసరత్తు

10 Dec, 2018 10:27 IST|Sakshi

రేపటి ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

విజయ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి   

సాక్షిప్రతినిధి, ఖమ్మం:  జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును ఈ నెల 11వ తేదీన పటిష్టంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కొణిజర్ల మండలంలోని తనికెళ్ల వద్ద గల విజయ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు కోసం కసరత్తు పూర్తయింది. ఈ నెల 7వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం విదితమే. అదేరోజు రాత్రి కౌంటింగ్‌ కేంద్రం(విజయ ఇంజనీరింగ్‌ కళాశాల)కు ఈవీఎంలను తరలించారు. కళాశాల చుట్టూ మూడంచెల బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్‌ నాటి నుంచి కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ల పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లాలోని 1305పోలింగ్‌ బూత్‌లలో ఓటింగ్‌ చేపట్టగా 9,33,124 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 14టేబుళ్లను ఏర్పాటు చేయగా, పోస్టల్‌బ్యాలెట్ల లెక్కింపు కోసం మరొక టేబుల్‌ను సిద్ధం చేశారు. ఒక్కొక్క రౌండ్‌కు  30నిమిషాల పాటు సమయం కేటాయించనున్నారు.
 
ఉదయం 8గంటల నుంచి లెక్కింపు  
ఉదయం 8గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంంది. 8:30గంటల నుంచి ఈవీఎంలోని ఓట్ల లెక్కింపును చేపడతారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 14టేబుళ్ల చొప్పున లెక్కింపు చేయనున్నారు. అదనంగా మరొక టేబుల్‌ను పోస్టల్‌ బ్యాలెట్‌కు ఉపయోగించనున్నారు. ఈవీఎంలను ఉదయం 8:30 గంటలకు ఓపెన్‌ చేసి ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తే మధ్యాహ్నం ఒంటిగంట వరకు అభ్యర్థుల గెలుపు ఓటములు తేలుతాయి. అభ్యర్థికి వచ్చే మెజారిటీపై ఓ అంచనా రానుంది. అధికారిక లెక్కల ప్రకారం సాయంత్రం 4నుంచి 6గంటల వరకు అభ్యర్థుల గెలుపు వివరాలు తెలియనున్నాయి.

        

మరిన్ని వార్తలు