దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది

20 Nov, 2017 01:52 IST|Sakshi

తెలంగాణ రాష్ట్రం ముందుంది: మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు

నందిగామ (షాద్‌నగర్‌): భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. అందులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని.. ఇక్కడి యువత ఉద్యోగాల కోసం వెతికే స్థాయినుంచి ఇచ్చే స్థాయికి ఎదగాలని మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లిలోని సింబయోసిస్‌ విశ్వవిద్యాలయంలో రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్, ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ బ్లాక్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ దేశంలోని భారత దేశం యువశక్తితో ముందుకు దూసుకెళ్తుంటే , ప్రపంచంలోని ఎన్నో దేశాలు వృద్ధ తరంతో సతమతమవుతున్నాయన్నారు. దీంతో భారత యువతకు ప్రపంచవ్యాప్తంగా మరెన్నో అవకాశాలు రానున్నాయన్నారు.

బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హాస్పిటల్స్, హాస్పిటాలిటీ రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఇటీవల మహిళలకు ఉద్యోగ, వ్యాపార, ఉపాధి అవకాశాలు ఎక్కువ అవుతున్నాయని విద్యాసాగర్‌రావు అన్నారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన సింబయోసిస్‌ తెలంగాణ రాష్ట్ర విద్యాముఖ చిత్రాన్ని మార్చేసిందన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 80 దేశాల విద్యార్థులు ఈ యూనివర్సిటిలో చదవడం దీని గొప్పదనాన్ని తెలియచేస్తుందని అన్నారు. అనంతరం ఆయన యూనివర్సిటీ ఆవరణలో మొక్కలను నాటారు. అంతకు ముందు యూనిర్సిటీలో పనిచేసే కార్మికులు, సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, సింబయోసిస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎస్‌బీ ముజుందార్, సంజీవని ముజుందార్, డాక్టర్‌ విద్యాయెరవెకర్, వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ రజనీ, డైరెక్టర్‌ డాక్టర్‌ రవికుమార్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు