దంపతుల దారుణ హత్య

8 Feb, 2015 04:17 IST|Sakshi
దంపతుల దారుణ హత్య

కేసముద్రం : ఒకరిని కడుపులో పొడిచి.. మరొకరిని మెడపై నరికి అతిదారుణంగా దంపతులిద్దరిని హతమార్చిన సంఘటన మండలంలోని కేసముద్రం స్టేషన్‌లో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కేసముద్రం స్టేషన్‌కు చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు గుడ్ల వెంకట్రామయ్య(70) మొదటి భార్య ప్రమీలకు కుమార్తెలు రాజ్యలక్ష్మి, శ్రీలత, కుమారుడు కృష్ణ ఉన్నారు. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు. ఈ క్రమంలో పదేళ్ల క్రితం ప్రమీల తన తల్లిగారి ఊరైన పర్వతగిరి మండలం కొంకపాక గ్రామంలో బావిలో పడి చనిపోయింది. ఆ తర్వాత కుమారుడు కృష్ణ వివాహమైంది. కుమారుడి పెళ్లయిన ఏడాదికే వెంకట్రామయ్య కూడా తనకు ఒక తోడు కావాలని చెప్పి, జఫర్‌గఢ్ మండలంలోని కూనూరు గ్రామానికి చెందిన సరస్వతి(45)ని రెండో పెళ్లి చేసుకున్నాడు.
 
 వారికి కుమారుడు విష్ణు(3) జన్మించాడు. ఈ క్రమంలో ఏడాది క్రితం తండ్రి ఇల్లు అమ్మడానికి నిశ్చయించుకోగా కొడుకు కృష్ణ ఇందుకు అంగీకరించలేదు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తండ్రి ఉంటున్న ఇంటిపైనే కొడుకు ఉంటున్నప్పటికీ ఇద్దరికి మాటలు లేవు. ఇటీవల సరస్వతి స్వగ్రామమైన కూనూరులో వెంకట్రామయ్య కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ క్రమంలో పని నిమిత్తం భార్య, కుమారుడితో ఇటీవల కేసముద్రంస్టేషన్‌కి వచ్చాడు. శనివారం మధ్యాహ్నం విష్ణుతో ఆడుకోవడానికి  పక్కింటి బాలుడు ఆడుకోవడానికి వచ్చి తలుపు నెట్టి పండు(విషు)్ణ అని పిలిచాడు. విష్ణు ఏడుస్తున్న విషయాన్ని గమనించి అతడు కాస్త లోపలికి వెళ్లి చూడగా రక్తపుమడుగులో పడి ఉన్న దంపతులను కనిపించగానే భయంతో పరుగెత్తుకుని ఇంటికి వెళ్లాడు.
 
 అతడు తల్లిదండ్రులకు చెప్పగా, వారు చుట్టుపక్కలవారితో కలిసి వెంకట్రామయ్య కుమారుడు కృష్ణకు సమాచారమిచ్చారు. ఇంతలో హత్య విషయం దావానంలా వ్యాపించడంతో సంఘటన స్థలానికి జనం పెద్దసంఖ్యలో చేరుకున్నారు. సమాచారం అందుకున్న మానుకోట సీఐ నందిరాంనాయక్,  ఎస్సైలు ఫణిదర్, పవన్, సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. వెంకట్రామయ్యకు కడుపులో కత్తిపోట్లవల్ల పేగులు బయటపడటంతోపాటు, సరస్వతి మెడ భాగంలో కత్తితో నరకడంతో మెదడు బయటపడి న దృశ్యాలు కనిపించాయి. అడిషనల్ ఎస్పీ జాన్‌వెస్లీ, మానుకోట డీఎస్పీ నాగరాజు కూడా చేరుకుని స్థానికులను పిలిచి విచారించారు.
 
 అనంతరం క్లూస్ టీం చేరుకుని రక్తనమూనాలతో, వేలిముద్రలను సేకరించారు. కాగా ఈ హత్యకు ఆస్తి తగాదాలే కారణమా, మరేదేమైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ప్రస్తుతం మృతుడి  కుమారుడు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మృతురాలి బంధువులు మాత్రం వెంకట్రామయ్య కుటుంబ సభ్యులే ఈ హత్యలకు  కారణమని ఫిర్యాదు చేశారు. హత్య రాత్రి జరిగిందా ? ఉదయం జరిగిందా ? అనే విషయంలో స్పష్టత రావడం లేదు.
 
 అమ్మ మృతదేహం వద్దే చిన్నారి
 తల్లి చనిపోయిన విష యం తెలియని పసిబాలుడు విష్ణు మృతదేహం వద్ద కూర్చుని ఉం డడం చూసి స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. స్థానికులు ఆ పసిబాలుడిని  దగ్గరకు తీసుకుని మంచినీళ్లు తాగించి, తినుబండారాలుతినిపిస్తూ అ య్యో పాపం అంటూ రోదించారు.
 

మరిన్ని వార్తలు