మంచానికి కట్టేసి.. నిప్పంటించి..

31 Oct, 2019 05:30 IST|Sakshi

వృద్ధ దంపతుల సజీవ దహనం

నెక్కొండ: భూ వివాదం ఓ వృద్ధ దంపతుల పాలిట శాపంగా మారింది. చనిపోయాక చితికి నిప్పంటించాల్సిన కొడుకు బతికుండగానే కాల్చి చంపాడు. తల్లిదండ్రులను మంచానికి కట్టేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. కన్నవారు అని కూడా కనికరించని ఆ కిరాతకుడు తన కొడుకుతో కలసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. హృదయ విదారకమైన ఈ సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భూక్యా దస్రు (68)కు  10 ఎకరాలు భూమి ఉండగా.. కుమారులు కేతూరాంకు 3.30 ఎకరాలు, వీరన్నకు నాలుగెకరాలు పంచి ఇచ్చాడు. తన వద్ద రెండున్నర ఎకరాల భూమి ఉంచుకున్నాడు.

వీరన్న కొంతకాలం క్రితం మరణించగా దస్రు తన వద్ద ఉన్న భూమిని వీరన్న భార్య పేరిట పట్టా చేసేందుకు పూనుకున్నాడు.ఈ క్రమంలో తల్లిదండ్రుల పట్ల కక్ష పెంచుకున్న కేతూరాం, అతడి కుమారుడు వెంకన్న.. బుధవారం సాయంత్రం వృద్ధ దంపతులను మంచానికి కట్టేసి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను వారిపై పోసి నిప్పంటించారు. ఇంట్లో నుంచి పొగలు, మంటలు రావడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న నెక్కొండ పోలీసులు గ్రామస్తులతో కలసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంచం మీద ఉన్న వృద్ధ దంపతుల మృతదేహాలు అస్తిపంజరాలుగా మారగా.. కేతూరాం, వెంకన్నకు సైతం గాయాలయ్యాయి. వారు నెక్కొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు