నీ వెంటే నేను..

17 Sep, 2019 09:11 IST|Sakshi
నాగేశ్వరరావు, నాగరత్నం

భర్త కడసారి చూపు కోసం వస్తూ భార్య అనంత లోకాలకు

ఒకే ఇంట్లో ఇద్దరు కుటుంబ పెద్దల మృతి

ఎస్‌ఆర్‌నాయక్‌ నగర్‌లో విషాదం

నాగేశ్వరరావు, నాగరత్నం దంపతులు. వీరుఅనారోగ్యంతో మూడు రోజుల క్రితం ఈఎస్‌ఐఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో భర్త ఆదివారం రాత్రి కన్నుమూశాడు. ఆయన మృతదేహాన్ని కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ ఎస్‌ఆర్‌నాయక్‌ నగర్‌లోని నివాసానికి తరలించారు. భర్తను కడసారి చూసేందుకు భార్య ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో వస్తుండగా మార్గమధ్యలోనే మరణించింది. ఈ ఘటన కుటుంబసభ్యులనుకలచి వేసింది.

కుత్బుల్లాపూర్‌: అనారోగ్యంతో మృతి చెందిన భర్తను  కడసారి చూపు చూసేందుకు  అంబులెన్స్‌లో వస్తూ మార్గమధ్యలోనే భార్య మృతి చెందిన విషాద సంఘటన కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ ఎస్‌ఆర్‌ నాయక్‌నగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం, కోడేరు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు (70), నాగరత్నం(65) దంపతులు బతుకుదెరువు నిమిత్తం 20 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. మూడు రోజుల క్రితం భార్యాభర్తలిరువురూ అనారోగ్యానికి గురికావడంతో వారిని ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి నాగేశ్వరరావు మృతి చెందాడు.

మృతదేహాన్ని ఎస్‌ఆర్‌ నాయక్‌నగర్‌లోని ఇంటికి తీసుకువచ్చిన కుటుంబసభ్యులు కడసారి చూపు కోసం  నాగరత్నంను అంబులెన్స్‌లో ఇంటికి తీసుకువస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. ఓ వైపు తండ్రి.. మరో వైపు తల్లి ఒకేసారి కన్నుమూయడంతో వారి కుమారులు కన్నీటి పర్యంతమయ్యారు. కడసారి చూపు కోసం వస్తున్న ఆమె భర్తను చూడకుండానే కన్ను మూయడంతో ఎస్‌ఆర్‌ నాయక్‌ నగర్‌లో విషాదం నెలకొంది. సుభాష్‌నగర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుని గా కొనసాగుతున్న గుబ్బల లక్ష్మీనారాయ ణ మాజీ ఎమ్మెల్యే,  కూన శ్రీశైలంగౌడ్‌కు సన్నిహితుడు. వీరి మరణ వార్త విన్నవెంటనే శ్రీశైలంగౌడ్‌ అక్కడికి వచ్చి కుటుంబసభ్యులను ఓదార్చారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.ఎస్‌.వాసు, మాజీ కౌన్సిలర్‌ రంగారావు, పలు పార్టీల నేతలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు