‘రియల్‌’ ఎటాక్‌  

19 Sep, 2019 10:16 IST|Sakshi
గాయపడిన వెంకన్న

వాకింగ్‌కు వెళ్లిన దంపతులపై హత్యాయత్నం

కొడవలి, కత్తి, సుత్తితో దాడి

పోలీసుల ఎదుట ముగ్గురు నిందితుల లొంగుబాటు

ఆస్తి తగాదాలు మనుషులప్రాణాలను తీసే దశకు చేరుకుంటున్నాయి. రియల్‌ ఎస్టేట్‌లో వచ్చిన విబేధాలతో పగ పెంచుకుంటూ ఎదుటి వ్యక్తిని చంపాలనే స్థాయికి తమ ఆలోచనలు మొదలవుతున్నాయి. అనుకున్నదే తడవుగా హత్యా ప్రయత్నాలు చేస్తూ కటకటాలపాలవుతున్నారు.

నర్సంపేట రూరల్‌: రియల్‌ ఎస్టేట్‌లో వచ్చిన తేడాలతో వాకింగ్‌ చేస్తున్న దంపతులపై వేట దాడిచేసిన అనంతరం ఆయుధాలతో దుండగులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగి పోయారు. ఈ సంఘటన నర్సంపేట పట్టణంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఉదయం 5 గంటలకే అంబటి వెంకన్న–విజయ దంపతులు వరంగల్‌ రోడ్డు మీదుగా భార్యభర్తలు వాకింగ్‌ వెళ్తుండగా ద్విచక్రవాహనంపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వారి వద్దకు వచ్చి ఇరువురి కంట్లో కారం చల్లారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న వేటకోడవలి, గీత కార్మికుల వద్ద ఉండే కమ్మ కత్తి, సుత్తితో వెంకన్నపై దాడికి దిగారు. దాడిని అడ్డుకుంటున్న విజయపై సైతం దాడికి పాల్పడ్డారు.

దాడినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన వెంకన్న తలపై బలంగా దాడి చేయడంతో తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో వెంకన్న కిందపడిపోయాడు. ఈ క్రమంలో అటువైపుగా  పలువురు వస్తుండగా గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకన్న వద్ద భార్య రోధిస్తుండడాన్ని గమనించిన బాటసారులు  పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వారిని పట్టణంలోని సివిల్‌ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హన్మకొండలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా, ఉద యం దాడికి పాల్పడిన దుండగులు నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయారు.

దాడికి కారణం రియల్‌ దందా..

గ్రామ పంచాయతీగా ఉన్న నర్సంపేట మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయింది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ దందా రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో అంబటి వెంకన్న గతం నుంచే రియల్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఇందుకు తోడు గండు కమల్‌ను సైతం వ్యాపారంలోకి చేర్చుకున్నాడు.  కాగా అంబటి వెంకన్న గతంలో గండు కమల్‌ తాత వద్ద కొంత భూమిని కొనుగోలు చేసి ఇటీవల వేరే వ్యక్తికి ఆ భూమిని అమ్మాడు. ఈ క్రమంలో అనుచరుడైన కమల్‌ తన తాత భూమికి వారసులమైన మా సంతకాలు లేకుండా కొనుగోలు చేసి లాభం పొందుతున్నాడని కక్ష్య పెంచుకున్నాడు. అదే భూమిని ఇతరులకు సైతం కమల్‌ రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ జరగగా కోర్టుకు సైతం వెళ్లారు.

ఇటీవల ఈ భూ తగాదా నర్సంపేట సివిల్‌ కోర్టులో ట్రయల్‌ రాగా నర్సంపేట లాయర్లు ఎవరూ వెంకన్న తరఫున వాధించడానికి రాకపోవడంతో వరంగల్‌ నుంచి ముగ్గురు లాయర్లను పిలిపించుకుని వాదోపవాదాలు చేసినట్లు పలువురు తెలుపుతున్నారు. వెంకన్నకు తీర్పు అనుకూలంగా వస్తుందనే నమ్మకంతో వాదన బలపడటంతో తీవ్రంగా ఆగ్రహానికి లోనైన కమల్‌ తన బామ్మర్తి చుక్క అనిల్, అతనితో పాటు అశోక్‌ అనే యువకుడిని కలుపుకుని ఈ హత్యకు మూడు రోజుల నుంచి రెక్కీ నిర్వహించారు. చివరికి బుధవారం ఉదయం 5 గంటలకు పతకం అమలుపరిచారు. లొంగి పోయిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. కాగా, అంబటి వెంకన్న హత్యకు ప్రేరేపించిన అంబటి శ్రీనివాస్, ఎండీ సమ్మద్‌లపై కూడా కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సునీతామోహన్, సీఐ కరుణసాగర్‌రెడ్డి విలేకరులకు తెలిపారు.  

మరిన్ని వార్తలు