ఉసురు తీసిన అప్పులు

30 Jul, 2015 00:03 IST|Sakshi
ఉసురు తీసిన అప్పులు

పంటలు ఎండుముఖంపట్టడంతో మనస్తాపం  
ఆర్థిక ఇబ్బందులతో దంపతుల బలవన్మరణం
పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్‌లో విషాదం
 
 పూడూరు :  రెక్కలుముక్కలు చేసుకొని సాగుచేసిన పంటలు ఎండుముఖం పట్టడం.. ఆర్థిక ఇబ్బందులు.. ఈ నేపథ్యంలో మనోవేదనకు గురైన దంపతులు ఒకరికి తెలియకుండా మరొకరు బలవన్మర ణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన బుధవారం చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగరాజు కథనం ప్రకారం.. పూడూరు మండల పరిధిలోని పెద్ద ఉమ్మెంతాల్‌కు చెందిన చిల్కమర్రి తిర్మలయ్య(30), రమాదేవి(28) దంపతులు. వీరు తమకున్న మూడెకరాల పొలంలో అప్పులు చేసి పత్తి, మొక్కజొన్న పంటలను సాగుచేశారు. వర్షాలు లేకపోవడంతో ఇటీవల పంటలు ఎండుముఖం పట్టాయి.

బ్యాంకులో తీసుకున్న అప్పు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద తీసుకున్న అప్పు రూ. 1.5 లక్షలు తీర్చేమార్గం లేదని భార్యాభర్తలు మనోవేదనకు గురయ్యారు. సోమవారం ఏకాదశి సందర్భంగా గ్రామ సమీపంలోని రాకంచర్ల ఆలయానికి భజనకు వెళ్తున్నానని తల్లి వెంకటమ్మకు చెప్పి వెళ్లిన తిర్మలయ్య తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం పొలానికి వెళ్లిన రమాదేవి కూడా ఇంటికి రాలేదు. దంపతుల కోసం కుటుంబీకులు గాలించసాగారు.

బుధవారం ఉదయం తిర్మలయ్య రాకంచర్ల ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో మృతదేహంగా కనిపించాడు. రమాదేవి తమ పొలం సమీపంలో ఉన్న బావిలో శవంగా తేలింది. చన్గోముల్ పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకొని స్థానికుల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చన్గోముల్ పోలీసులు తెలిపారు.

 అనాథలైన ఇద్దరు పిల్లలు
 తిర్మలయ్య, రమదేవి దంపతుల ఆత్మహత్యతో వారి ఇద్దరు కుమారులు జస్వంత్(7), శివకుమార్ అనాథలయ్యారు. జస్వంత్ గ్రామంలో ఒకటో తరగతి చదువుతుండగా శివకుమార్(3) అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తున్నాడు. ఎండుతున్న పంటలను చూసి ఆందోళనకు గురైన తిర్మలయ్య, రమాదేవి ఒకరికి తెలియకుండా మరొకరు ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.  
 మమ్మీడాడీకి ఏమైంది..
 తల్లిదండ్రుల మృతితో జస్వంత్, శివకుమార్ అనాథలయ్యారు. తమ తల్లిదండ్రులకు ఏమైందో కూడా అభంశుభం తెలియని చిన్నారులకు తెలియకపోవడంతో ‘మమ్మీ.. డాడీకి ఏమైంద’ని వెక్కివెక్కి ఏడ్వడంతో ఘటనా స్థలంలో ఉన్న వారు కంటతడి పెట్టుకున్నారు. వారి రోదనలు ఆపడం ఎవరితరం కాలేదు. 

మరిన్ని వార్తలు