బంజారాహిల్స్ పీఎస్‌లో సురేష్‌, ప్రవిజ దంపతులు

17 Dec, 2019 09:44 IST|Sakshi

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్ పోలీసులపై సంచలన ఆరోపణలు చేసిన అట్లూరి సురేష్‌, ప్రవిజ దంపతులకు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రవిజను పోలీసులు అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ.. సురేష్‌.. ఎస్‌హెచ్‌వోతో వాదనకు దిగాడు. ఒకవేళ పోలీసులు అలాంటి మాటలు అన్నది నిజమే అయితే.. లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వాలని.. తాము వెంటనే చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌వో తెలిపారు. అయితే సురేష్‌ మాత్రం పదే పదే తన భార్య పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ప్రస్తావిస్తూ ఫిర్యాదు చేయడానికి వస్తే గెంటేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సీపీకి ఫోన్‌ చేసి అందరి పైనా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు.

అలాగే చేయమని ఎస్‌హెచ్‌వో సూచించడంతో... ప్రవిజ, తాను స్టేషనులో ఆత్మహత్యకు పాల్పడతామని బెదిరింపులకు దిగాడు. ​కాగా పోలీసులు, తన భర్తకు జరుగుతున్న వాగ్వాదంతో వేదనకు గురైన ప్రవిజ.. పోలీసులు నిజంగా ఏ తప్పూ చేయకుంటే తనకు గతంలో ఎందుకు క్షమాపణ చెప్పారని ప్రశ్నించారు. ఇందుకు బదులిచ్చిన ఎస్‌హెచ్‌వో.. ‘మీరు బాధపడి ఉంటే క్షమించమని అడగడం తప్పా మేడం’ అని అడిగారు. ఈ క్రమంలో రిసెప్షన్‌లోకి వెళ్లి ఫిర్యాదు రాసివ్వాలని సూచించగా.. మేం ఇక్కడే కూర్చుంటామంటూ సురేష్‌ తన భార్యతో సహా ఎస్‌హెచ్‌వో రూంలోనే కూర్చున్నారు. దీంతో పోలీసు స్టేషనులో ఉద్రిక్తత నెలకొంది. 

కాగా బంజాహిల్స్‌ ఇన్స్‌స్పెక్టర్‌ కలింగరావుతో పాటు ఇద్దరు ఎస్‌ఐలపై ప్రవిజ ఆరోపణలు చేస్తూ సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియో సోమవారం వైరల్‌ అయిన విషయం తెలిసిందే. పోలీసులు తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో సోమవారం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో డీసీపీ విలేకరులతో మాట్లాడారు. అట్లూరి సురేష్, వాసుదేవశర్మ అనే వ్యక్తి మధ్య సివిల్‌ తగాదాలు ఉన్నాయన్నారు. శర్మవద్ద రూ.4.70లక్షలు తీసుకున్న సురేష్‌ వాటిని తిరిగి ఇవ్వాలని కోరితే బెదిరింపులకు పాల్పడ్డాడన్నారు. దీనిపై శర్మ ఫిర్యాదు చేసేందుకు రాగా అది సివిల్‌ వివాదమైనందున ఫిర్యాదు తీసుకోలేదని తెలిపారు. దీంతో వాసుదేవశర్మ కోర్టుకు వెళ్లి నోటీసు తీసుకురావడంతో కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు సురేష్‌ను పిలిపించి మాట్లాడరన్నారు. ఆ సమయంలో సురేష్‌ పోలీసులను దూషించడమేగాక ఓ ఎస్‌ఐ పట్ల దురుసుగా ప్రవర్తించాడని, దీంతో 8న సురేష్, ప్రవిజలపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించామన్నారు. గతంలో జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లోనూ వారు అదే తరహాలో ప్రవర్తించడంతో కేసు నమోదైందన్నారు. రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెప్పుకుంటూ ఆయా పోలీస్‌ స్టేషన్లలో పోలీసులను బ్లాక్‌మేయిల్‌ చేస్తుంటారని తెలిపారు. 
 

మరిన్ని వార్తలు