చిట్టీవ్యాపారి ఇంటి ఎదుట దంపతుల ఆందోళన 

28 Mar, 2018 09:29 IST|Sakshi
ఆందోళన చేస్తున్న దంపతులు

తమ బ్లాంకు చెక్కు ఇవ్వాలని డిమాండ్‌ 

ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక 

జమ్మికుంట(హుజూరాబాద్‌): జమ్మికుంట మండలంలోని బిజిగిరిషరీఫ్‌ గ్రామానికి చెందిన బిజిగిరి ప్రభాకర్‌ భార్య కవితతో కలిసి జమ్మికుంట పట్టణంలోని చిట్టీ వ్యాపారి రమేశ్‌ ఇంటి ఎదుట మంగళవారం బైఠాయించాడు. చిట్టీ పాడుకుని ష్యూరిటీగా ఇచ్చిన బ్లాంక్‌ చెక్కును చిట్టీ డబ్బులు మొత్తం చెల్లించన తర్వాత కూడా రమేశ్‌ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చెక్కు తమకు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. బాధితుడు ప్రభాకర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. జమ్మికుంట పట్టణంలో ప్రభాకర్‌ గతంలో సెలూన్‌ షాపు నిర్వహించేవాడు. ఇతడి వద్దనే కటింగ్‌ చేయించుకునే చిట్టీ వ్యాపారి రమేశ్‌ తన వద్ద చిట్టీ వేయాలని ఒత్తిడి చేయడంతో ప్రభాకర్‌ రూ.9 లక్షల చిట్టీ వేశాడు.

ప్రారంభమైన మొదటి నెలలోనే చిట్టీని యాక్షన్‌లో రూ.4.50 లక్షలకు పాడిన ప్రభాకర్‌ ష్యూరిటీగా రమేశ్‌కు బ్లాంక్‌ చెక్కు ఇచ్చాడు. అయితే రమేశ్‌ చిట్టీ డబ్బులు రూ.4.50 లక్షల కు బదులు రూ.3 లక్షలు మాత్రమే ఇచ్చాడు. ఈక్రమంలో ప్రతి నెల చిట్టీ డబ్బులు చెల్లించుకుంటూ వచ్చిన ప్రభాకర్‌ సుమారు రూ.3.60 లక్షలు కట్టాడు. తర్వాత ఆర్థిక ఇబ్బందులతో చిట్టీ కట్టలేనని చెప్పాడు. తనకు రావాల్సి డబ్బులు, బ్లాంక్‌ చెక్కు ఇవ్వాలని రమేశ్‌ను కోరాడు. చిట్టి వ్యాపారి మాత్రం చెక్కును కోర్టులో వేసి ప్రభాకర్‌కే నోటీసులు పంపించాడు.

దీనిపై జమ్మికుంట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఇద్దరి మధ్య పంచాయతీ జరిగిందని, అందులో రూ.2 లక్షలు చిట్టి వ్యాపారికి ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఆ డబ్బులు కూడా ప్రభాకర్‌ ముట్టజెప్పాడు. అయినా చెక్కు ఇవ్వకపోవడంతో భార్యతో కలిసి ఆందోళనకు దిగాడు. తన వెంట సూపర్‌వాస్మ తెచ్చుకుని చెక్కు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని దంపతులు హెచ్చరించారు. ఇంటో రమేశ్‌ లేకపోవడంతో పరిస్థితిని ఆయన భార్యకు వారు వివరించారు. ఆమె ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయింది. ఉదయం 9 నుంచి  రాత్రి7 గంటల వరకు అక్కడే బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి న్యాయం చేస్తామంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు.     

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు