‘మరణమే’ సరి..

31 Jan, 2020 01:43 IST|Sakshi

సమత హత్యోదంతంలో దోషులకు మరణ శిక్ష..

ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు

నేరం జరిగిన  66 రోజుల్లోనే తీర్పు..

సమత కుటుంబ  సభ్యుల్లో హర్షం

కంటతడి పెట్టిన నిందితులు

సాక్షి, ఆదిలాబాద్‌: అవును.. వారికి ఉరితాడే సరి.. తప్పతాగి ఓ అమాయకపు మహిళను చెరచిన ఆ మృగాళ్లకు మరణమే సరైన శిక్ష.. మానవత్వం మరచి అతి కిరాతకంగా ఆ నిండు ప్రాణాన్ని బలిగొన్న ఆ కామాంధులకు చావే మిగతా మృగాళ్లకు మేల్కొలుపు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సమత అత్యాచారం, హత్య కేసులో నిందితులను దోషులుగా నిర్ధారించిన ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు.. వారికి ఉరి శిక్ష తీర్పు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. గతేడాది నవంబర్‌ 24న ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌లో సమతపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసులో న్యాయ మూర్తి విచారణ జరిపారు.

ఈ కేసులో ఎన్నో సవాళ్లను అధిగమించి అనేక సాక్ష్యాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. డిసెంబర్‌ 11న ఈ ప్రత్యేక కోర్టు ఏర్పడింది. బాధితురాలు, నిందితుల తరఫున వాదప్రతివాదనలు విన్న తర్వాత కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని గురువారం తీర్పు వెలువరించారు. మొదట నేరం రుజువైనట్లు దోషులతో పేర్కొన్న ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు జడ్జి ఏమైనా చెబుతారా అని నిందితులను అడిగితే వారు.. కంటతడి పెట్టడంతో 10 నిమిషాల పాటు బ్రేక్‌ తీసుకున్న న్యాయమూర్తి ఆ తర్వాత తీర్పునిచ్చారు.

నిర్ధారణ జరిగిందిలా..
సమతపై గతేడాది నవంబర్‌ 24న సామూహిక అత్యాచారం చేసి, ఆమె చేతి వేళ్లు, కాళ్లను కోసేసి హతమర్చారు. రెండో రోజు ఆ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. ఆ తర్వాత 2 రోజుల్లోనే నిందితులను గుర్తించారు. ఎల్లపటార్‌ కు చెందిన షేక్‌ బాబును ఏ1గా, షేక్‌ షాబొద్దీన్‌ను ఏ2గా, షేక్‌ మఖ్దుంను ఏ3గా గుర్తించారు. దర్యాప్తు వేగవంతం చేసి 20 రోజుల్లో తగిన ఆధారాలు సేకరించారు. మృతిచెందిన సమతకు సంబంధించి డీఎన్‌ఏ సరిపోలిన నివేదిక, ఘటనా స్థలి నుంచి ఆమె దుస్తులు, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక, భౌతిక ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఆసిఫాబాద్‌ జిల్లా ఎస్పీ ఎం.మల్లారెడ్డి లేఖ రాశారు. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో ఆదిలాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ కోర్టునే ప్రత్యేక కోర్టుగా మలిచి ఈ కేసును విచారించాలని ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్‌ 11న ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. డిసెంబర్‌ 14న ఆసిఫాబాద్‌ జిల్లా పోలీసులు నిందితులపై ప్రత్యేక కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

 25 మంది సాక్షుల విచారణ..
నిందితుల తరఫు వాదించేందుకు ఏ న్యాయవాదీ ముందుకు రాలేదు. దీంతో ఆదిలాబాద్‌కు చెందిన న్యాయవాది రహీంను నిందితుల తరఫున వాదించేం దుకు కోర్టు నియమించింది. ఈ కేసును డిసెంబర్‌ 16న ప్రత్యేక కోర్టు క్రైం నం.117/2019గా నమోదు చేసింది. డిసెంబర్‌ 23 నుంచి 31 వరకు సాక్షులను విచారించింది. కేసులో పోలీసులు 44 మంది సాక్షులను ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు 25 మంది సాక్షులను విచారించింది. జనవరి 7, 8 తేదీల్లో ప్రాసిక్యూషన్‌ వాదనలు వినిపించగా, జనవరి 10న డిఫెన్స్‌ లాయర్‌ తన వాదనలు వినిపించారు. ఆ తర్వాత నిందితులను కోర్టు విచా రించగా ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని విన్నవించారు. తమ తరఫున సాక్షులున్నారని కోర్టుకు తెలపగా, సాక్షులను ప్రవేశపెట్టేందుకు 2 రోజులు అనుమతించినా.. సాక్షులు ఎవరూ కోర్టుకు హాజరుకాలేదు. ఈ నెల 20న వాదనలు పూర్తి కాగా, 27న ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పాల్సి ఉంది. అయితే జడ్జి అనారోగ్యం కారణంగా గురువారానికి వాయిదా పడింది.

ఈ సెక్షన్లు నమోదు: సమతను హతమర్చినందుకు 302, ఆర్‌–డబ్ల్యూ సెక్షన్ల కింద మరణ శిక్ష. ముగ్గురు ముందస్తు ప్రణాళిక ప్రకారమే నేరానికి పాల్పడినందుకు 34 ఐపీసీ, గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినందుకు 376డీ, వస్తువులను దొంగిలించినందుకు 404 ఐపీసీ, దళితురాలైన ఆమెపై ఈ నేరానికి పాల్పడినందుకు ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటీస్‌ చట్టం ప్రకారం శిక్షలు విధించారు. ముగ్గురికి కలిపి 26 వేల జరిమానా విధించారు. నేరం జరిగిన రోజు నుంచి 66 రోజుల్లో ఈ తీర్పు వెలువడటం గమనార్హం.

సెంట్రల్‌ జైలుకు తరలింపు: సమత కేసు విచారణలో భాగంగా ముగ్గురు నిందితులను ఆదిలాబాద్‌లోని జిల్లా జైలులో ఇన్ని రోజులు ఉంచారు. గురువారం వీరికి మరణ శిక్ష విధించడంతో ఆదిలాబాద్‌ జిల్లా జైలు కాకుండా సెంట్రల్‌ జైలుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉరిపై అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తెలిపారు.

సమత ఆత్మకు శాంతి చేకూరింది  టేకు గోపీ, సమత భర్త
నిందితులకు కోర్టు మరణశిక్ష విధించడంతో సమత ఆత్మకు శాంతి చేకూ రింది. ఆమెను కోల్పోవడం తీరనిలోటు. తల్లి కోసం పిల్లలు కన్నీరు మున్నీర వుతున్నారు. దోషులు అత్యాచారం చేసి క్రూరంగా హత్య చేశారు. వారిని వెంటనే ఉరితీయాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా తీర్పునిచ్చారు.

జడ్జిలకు పాదాభివందనం  టేకు కనకవ్వ, సమత అత్త
ఇంత త్వరగా న్యాయమైన తీర్పు ఇచ్చిన జడ్జిలకు పాదాభివందనం. ఈ తీర్పుద్వారా మహిళలకు స్వాతంత్రం వచ్చినట్లయింది. నిందితులు మీది కోర్టులకు వెళ్లకుండా చూడాలి. రాష్ట్రపతి కూడా దళిత మహిళల అక్రోదనను అర్థం చేసుకొని క్షమాభిక్ష పెట్టవద్దని కోరుతున్నాం.  

మరిన్ని వార్తలు