తెలంగాణ, ఏపీలకు కోర్టు ధిక్కార నోటీసులు

4 Nov, 2017 01:45 IST|Sakshi

సెక్యూరిటీ కమిషన్, పోలీస్‌ కంప్లయింట్‌ అథారిటీలను ఎందుకు ఏర్పాటు చేయలేదు: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ అయ్యాయి. జిల్లా స్థాయిలో పోలీసు ఫిర్యాదు విభాగం, రాష్ట్ర స్థాయిలో సెక్యూరిటీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా నేటి వరకు ఏర్పాటు చేయలేదంటూ ఏకలవ్య ఫౌండేషన్‌ ప్రతినిధి ఎన్‌.ఎస్‌.చంద్రశేఖర్‌ లేఖను హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార పిటిషన్‌గా పరిగణించింది. ఎందువల్ల గత ఆదేశాల్ని అమలు చేయలేదో 4 వారాల్లో వివరణ ఇవ్వాలని, ఎందుకు కోర్టు ధిక్కార చర్యలు తీసుకోరాదో తెలియజేయాలని న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు శుక్రవారం ఆదేశించారు.

ఈ మేరకు రెండు రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. పోలీసు అధికారులపై వచ్చే ఆరోపణల ఫిర్యాదుల్ని పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో పోలీస్‌ ఫిర్యాదు విభాగం, పోలీసు చర్యల కారణంగా ఇబ్బందిపడే జనం సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో పోలీస్‌ సెక్యూరిటీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని గతంలోని ఆదేశాలను రెండు ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయని ఆ లేఖలో పేర్కొన్నారు. విచారణ 4 వారాలకు వాయిదా పడింది.

మరిన్ని వార్తలు