ముగిసిన పోలీసు కస్టడీ

5 Jun, 2020 08:20 IST|Sakshi
సంజయ్‌ను మీడియా ముందుకు తీసుకొస్తున్న పోలీసులు (ఫైల్‌)

తొమ్మిది హత్యల కేసులో నిందితుడిని

కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

వరంగల్‌ లీగల్‌ : వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో తొమ్మిది మందిని సజీవంగా బావిలో వేసి హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్‌కుమార్‌యాదవ్‌ను ఆరు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. ఈ మేరకు గీసుకొండ పోలీసులు గురువారం ఆయనను వరంగల్‌లోని కోర్టులో హాజరుపర్చగా కోర్టు అదేశాలతో వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. తొమ్మిది హత్యల కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు అతి తక్కువ సమయంలో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. (9 హత్యల కేసు: వాటిని అమ్మిందెవరు?)

14 రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌కు కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేసు పూర్వాపరాలు, నిందితుని నుండి అదనపు సమాచారం కోసం ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కస్టడీలో భాగంగా ఆరు రోజుల పాటు సీన్‌ రీకన్‌స్ట్రక్టషన్‌ తరహాలో ఘటనా స్థలం, నిందితుడు అద్దెకు ఉన్న ఇళ్లు తదితర ప్రాంతాల్లో పరిశోధన జరిపిన పోలీసులు సంజయ్‌ను గురువారం కోర్టులో హాజరుపరిచారు. కాగా, నిందితుడిపై నమోదైన కేసులో పొందుపర్చిన వివిధ సెక్షన్ల క్రింద నేరం రుజువైతే రెండేళ్ల కఠిన కారాగారశిక్ష మొదలు యావజ్జీవ కారాగార శిక్ష.. చివరకు ఉరిశిక్ష సైతం పడే అవకాశం ఉందని సీనియర్‌ న్యాయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. నిందితుడి వయస్సు తక్కువే అయినందున శిక్షా కాలంలో ప్రవర్తన మార్పు తదితర అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పటికీ యావజ్జీవ కారాగార శిక్ష తప్పకుండా పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. (సంజయ్‌కుమార్‌పై సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌)

మరిన్ని వార్తలు