కలెక్టర్‌తో సహా అధికారులకు కోర్టు నోటీసు 

7 Sep, 2019 12:04 IST|Sakshi
న్యాయసేవాధికార సంఘం, జూనియర్‌ సివిల్‌ జడ్జి జారీచేసిన నోటీసు

నిర్లక్ష్యంపై కోర్టును ఆశ్రయించిన న్యాయవాది 

12న లోక్‌ అదాలత్‌ బెంచ్‌కు హాజరుకావాలని ఆదేశం

సాక్షి, జడ్చర్ల : బాదేపల్లి మున్సిపాలిటీలో అంటువ్యాధులు ప్రబలుతుండటంతో అందుకు కారణమైన పందుల తరలింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జడ్చర్ల న్యాయ సేవాధికార సంఘం చైర్మన్, జూనియర్‌ సివిల్‌ జడ్జిని స్థానిక న్యాయవాది శ్రీనివాస్‌గౌడ్‌ శుక్రవారం ఆశ్రయించారు. స్పందించిన సంఘం చైర్మన్, జూనియర్‌ సివిల్‌ జడ్జి ఈ నెల 12న జిల్లా కలెక్టర్‌తోపాటు ఐదు మంది అధికారులు జడ్చర్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు పరిధిలోని లోక్‌ అదాలత్‌ బెంచ్‌కు హాజరుకావాలని నోటీసు జారీ చేశారు. వివరాలిలా.. బాదేపల్లిలో అంటువ్యాధులై న మలేరియా, టైఫాయిడ్‌ తదితర వాటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శ్రీనివాస్‌గౌడ్‌ న్యాయ సేవాధికార సంఘాన్ని ఆశ్రయించారు.

దోమల వల్ల రోగాలు వస్తున్నాయని, దోమలను నియంత్రిస్తేనే దోమలు వ్యాధులు రాకుండా ఉంటాయని విన్నవించారు. దోమలకు కారణమైన పందులను తరలించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అనేక మంది పేదలు రోగాలతో సతమతమవుతున్నారని ఫిర్యాదు చేశారు. తాను నివాసం ఉండే గాంధీనగర్‌లో మహిళల హాస్టల్‌ ఉందని, ఎంతోమంది రోగాలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. పందులను తరలించకుండా కొందరు రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల అనారోగాలకు కారణమవుతున్న మున్సిపాలిటీ కమిషనర్, స్పెషల్‌ ఆఫీసర్‌ ఆర్డీఓ, జడ్చర్ల సీఐ, మహబూబ్‌నగర్‌ డీఎస్పీతోపాటు జిల్లా కలెక్టర్‌పై చర్యలు తీసుకుని తగు ఉత్తుర్వులు జారీ చేయాలని కోరారు. స్పందించిన న్యాయ సేవాధికారి సంఘం చైర్మన్, జూనియర్‌ సివిల్‌ జడ్జి షాలినిలింగం ఈ నెల 12న జిల్లా కలెక్టర్‌తోపాటు ఐదు మంది అధికారులు జడ్చర్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు పరిధిలోని లోక్‌ అదాలత్‌ బెంచ్‌కు హాజరుకావాలని వారికి నోటీసులు జారీ చేశారు. 

  

మరిన్ని వార్తలు