అంతా 45 ఏళ్ల లోపే!

10 Apr, 2020 11:20 IST|Sakshi
ఉప్పల్‌ రింగ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన కరోనా నమూనా

గ్రేటర్‌లో పాజిటివ్‌బాధితుల తీరిదీ..

ఇప్పటికి 129 మంది పురుషులు,

41 మంది మహిళలు, 13 మంది పిల్లలకు వైరస్‌

రంగారెడ్డిలో 32 కేసులు.. వీరిలో ఆరుగురు మహిళలే

అత్యధిక కేసులు... ఆ బస్తీల్లోనే..

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ యువతరం పాలిట శాపంగా మారింది. ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాలు, వ్యాపారాలు, ఇలా వివిధ పనుల కోసం దేశ విదేశాలు తిరుగుతుండటమే వీరు ఎక్కువగా వైరస్‌ బారిన పడుతుండటానికి కారణమని తేలింది. హైదరాబాద్‌ జిల్లాలో ఈ నెల 7వ తేదీ వరకు 170 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,వీరిలో 129 మంది పురుషులు కాగా, 41 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 15 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారు 88 మంది ఉండటం గమనార్హం. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 32 పాజిటివ్‌ కేసులు నమోదైతే..వీరిలో 23 మంది పురుషులు ఉంటే,తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. ఇక 15 నుంచి 29 ఏళ్లలోపు వారు 9 మంది ఉంటే,30 నుంచి 45 ఏళ్లలోపు వారు ఆరుగురు ఉన్నారు. 46 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారు 11 మంది వరకు ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు మూడు జిల్లాల పరిధిలో 8 మంది మృతి చెందగా, వీరంతా 55 ఏళ్లు పైబడిన వారే.  

పాజిటివ్‌ కేసులు ఇక్కడే ఎక్కువ ..
హైదరాబాద్‌ జిల్లా  వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో అత్యధికంగా మైసారం 16, ఫిలింనగర్‌ 8, బార్కాస్, మలక్‌పేట్‌లలో 7 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక  నాంపల్లిలో 6 పాజిటివ్‌ కేసులు నమోదైతే.. సయ్యద్‌నగర్, గోల్కొండలలో 5 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శాంతినగర్, పంజగుట్ట, డబీర్‌పుర, ఖైరతాబాద్, గడ్డిఅన్నారం, కార్వాన్, శ్రీరాంనగర్‌లలో నాలుగు చొప్పున కేసులు నమోదు కాగా,  కుమ్మరివాడి, గగన్‌ మహల్, పాల్‌దాస్, పాన్‌బజార్, జాంబాగ్, మాదన్నపేట, నిలోఫర్‌ యూపీహెచ్‌సీల పరిధిలో మూడు చొప్పున కేసులు నమోదు అయ్యాయి. బాగ్‌ అంబర్‌పేట్, యాకుత్‌పుర, అడ్డగుట్ట, గరీబ్‌నగర్, చింతల్‌బస్తీ, మహ్మద్‌నగర్, తారామైదాన్‌ల పరిదిలో రెండు చొప్పున కేసులు నమోదు కాగా, భోలక్‌పూర్, జూబ్లిహిల్స్, అమీర్‌పేట్, బండ్లగూడ, దారుషిఫా, గుడిమ ల్కాపుర్, బొగ్గులకుంట , డీబీఆర్‌ మిల్స్, తుకారంగేట్, శాలివాహననగర్, ఆఘాపుర, పానిఫురా, దూద్‌బౌలి, కిషన్‌బాగ్, చిలకలగూడ, బంజారాహిల్స్, బోరబండ, జహానుమా పీహెచ్‌సీల పరిధిలో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉప్పరపల్లిలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 65 ఏళ్ల వ్యక్తి నుంచి వారి కుటుంబలో మరో ముగ్గురికి(భార్య, కుమారుడు, కుమార్తె) వైరస్‌ సోకింది. అదే విధంగా కోకాపేటలోని రాజపుష్పాఆర్టిరియాకు చెందిన 49 ఏళ్ల వ్యక్తి నుంచి భార్య, కుమారుడు, కుమార్తెలకు వైరస్‌ సోకింది. ఇలా ఒకే ఇంట్లో నాలుగు కేసులు చొప్పున నమోదయ్యాయి. ఎంఎం పహడి, కింగ్స్‌కాలనీ, అయ్యప్ప సొసైటీ, మణికొండ, కొత్తపేటలోని జుబేన్‌కాలనీ, ఓల్డ్‌ హఫీజ్‌పేట్, అహ్మద్‌నగర్, శక్తిపురం, పీ అండ్‌టీ కాలనీ, మియాపూర్, గచ్చిబౌలిలోని అంజయ్యనగర్, ఎస్‌ఎంఆర్‌ కొడాపూర్, కొత్తపేట వాసవి కాలనీ, జల్‌పల్లిలతో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ఆయా బస్తీ వాసులంతా భయం భయంగా గడుపుతున్నారు.

మూడో దశకు చేరుకున్నట్లేనా..?
కరోనా కట్టు తప్పిందా..? రెండో దశ దాటి మూడో దశలోకి అడుగు పెట్టిందా..? అంటే అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 453 కేసులు నమోదు కాగా, వీరిలో అత్యధికంగా గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌ జిల్లాలో బుధవారం నాటికి 188, రంగారెడ్డి జిల్లాలో 32, మేడ్చల్‌ జిల్లాలో 21 చొప్పున మొత్తం 241 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ప్రస్తుతం గాంధీ, ఛాతి, ఫీవర్‌ ఆస్పత్రుల్లో 199 మంది చికిత్స పొందుతున్నారు. 29 మంది ఇప్పటికే కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఎనిమిది మంది మృతి చెందారు. ఇదిలా ఉంటే  వైరస్‌ ఇప్పటి వరకు రెండో దశలోనే ఉన్నట్లు ప్రభుత్వం చెప్పుతున్నప్పటికీ...నిజానికి మూడో దశలోకి చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే రాంగోపాల్‌పేట, షేక్‌పేట, మలక్‌పేట/సంతోష్‌ నగర్, చాంద్రాయణగుట్ట, అల్వాల్, మూసాపేట, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌/ గాజులరామారం, మయూరినగర్, యూసఫ్‌గూడ, చందానగర్‌లలో ఎక్కువ కేసులు నమోదైనట్లు గుర్తించి, ఇప్పటికే అష్టదిగ్బంధనం చేశారు. 

ఏప్రిల్‌ 15 తర్వాత  మరిన్ని కేసులు?
విదేశాల నుంచి వచ్చిన వారిలో 30 మందికి మాత్రమే కరోనా వైరస్‌ సోకింది. ఇలా వీరి నుంచి వారి కుటుంబ సభ్యులకు మరో 20 మందికి సోకింది. ఇకపై వీరి నుంచి పెద్దగా పాజిటివ్‌ కేసులు వచ్చే అవకాశం లేదు. కానీ  తెలంగాణ నుంచి 1030 మంది మర్క్‌జ్‌కు వెళ్లి రాగా, వీరిలో 603 మంది గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్నారు. వీరిలో ఇప్పటికే 593 మందికి వ్యాధి నిర్థారణ పరీక్షలు చేశారు. వీరిలో 63 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరి నుంచి మరో 45 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించింది. ఏప్రిల్‌ 15 నుంచి 24 మధ్య కాలంలో సామాజిక వ్యాప్తి ద్వారా పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూసే అవకాశం ఉంది. దీంతో వైరస్‌ నియంత్రణలో ఉందా? లేదా కట్టు తప్పిందా? అనేది కూడా తేలిపోతుంది. ఆయా కేసులన్నీ బయటికి వచ్చే వరకు లాక్‌డౌన్‌ కొనసాగించడమే ఉత్తమమని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వార్తలు